Published On: Sat, Mar 30th, 2013

ములాయంపై చిదంబరాస్త్రం

Share This
Tags

కొద్దిరోజులుగా విమర్శల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్‌ను చల్లబరచేందుకు యూపీఏ ప్రభుత్వం చిదంబరాస్త్రాన్ని ప్రయోగించింది. యూపీఏకు వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఏ నిమిషాన్నైనా తన మద్దతును ఉపసంహరించుకోగలదనే ప్రచారం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరం శుక్రవారం లక్నో చేరుకుని, ములాయం తనయుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్‌ను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. యూపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని చెప్పారు. యూపీలో కొత్తగా ఏర్పాటు చేసిన 300 బ్యాంకు శాఖలను ప్రారంభించిన చిదంబరం ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి అఖిలేశ్‌కు, ఆయన బృందానికి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంకు తాను హామీ ఇస్తున్నానని అన్నారు. యూపీలో ఇప్పటికే రూ.18,500 కోట్ల వ్యయంతో 24 కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పారు. యువకుడైన ముఖ్యమంత్రి అఖిలేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గాన నడిపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. యూపీఏ సర్కారుపై, కాంగ్రెస్ పార్టీపై ములాయం కొద్దిరోజులుగా విమర్శలు కురిపిస్తున్న నేపథ్యంలో చిదంబరం తాజాగా చేసిన వ్యాఖ్య లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

About the Author

-