Published On: Fri, Nov 15th, 2013

“మసాలా “సినిమా రివ్యూ

Share This
Tags

తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో మహానటులు ఎన్ టీఆర్, ఏఎన్నాఆర్, శోభన్ బాబులు కృష్ణ, కృష్టం రాజులతో కలిసి అనేక మల్టీ స్టారర్ చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించారు. జనరేషన్ మారిన తర్వాత స్టార్ డమ్ ఇమేజ్ లో చిక్కుకుపోయిన ప్రస్తుత హీరోలు మల్టీస్టారర్ చిత్రాలవైపు చూడటానికి జంకారు, ఆలోచించడానికి వెనకడుగు వేశారు. టాలీవుడ్ తెరపై మల్టీ స్టారర్ చిత్రాల ఉనికి ప్రశ్నార్ధకమైన నేపథ్యంలో తాజాగా విక్టరీ వెంకటేశ్ ఓ సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. దాని ఫలితమే మహేశ్ తో కలిసి వెంకటేశ్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఆ చిత్రం అందించిన విజయోత్సహాంతో మళ్లీ రామ్ తో జతకట్టి ‘మసాలా’ చిత్రంలో నటించగా, రాంచరణ్ తో వెంకటేశ్ మరో చిత్రానికి పచ్చజెండా ఊపారు. టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ కు తెరతీస్తూ.. హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’ చిత్ర రీమేక్ గా ‘మసాలా’తో వెంకటేశ్ గురువారం నవంబర్ 14 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రామ్ తో కలిసి నటించిన మసాలా చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్లొద్దాం!

కోర్టు తీర్పుతో యావదాస్తిని కోల్పోయిన రహమాన్ (రామ్), సోనియా(అంజలీ)లను వారి తండ్రి స్నేహితుడు నారాయణ(ఎంఎస్ నారాయణ) చేరదీసి తన ఊరు భీమరాజపురంకి తీసుకెళుతాడు. భీమరాజపురంలో ధనవంతుడైన బలరాం వద్ద నారాయణ పనిచేస్తుంటాడు. బలరాం (వెంకటేశ్) దేనినైనా సహిస్తాడు కాని అబద్దం ఆడిన వాళ్ల ప్రాణలు తీయడానికైనా వెనుకాడడు. బలరాంకు మీనాక్షి అనే సోదరి ( షాజన్ పదాంసీ) ఉంటుంది. ఆ ఊరిలో బలరాంకు నాగరాజు (పోసాని) అనే దుష్టుడికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్ఠాయిలో విభేదాలు ఉంటాయి. వారిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా ఎన్నో ఏళ్లుగా ఓ ఆలయం మూతపడి ఉంటుంది. అయితే ఆ ఆలయ కొలనులో పడిన బాలుడిని రక్షించడానికి రెహమాన్ గుడి తాళం పగులగొట్టి, తలుపులు తెరుస్తాడు. దాంతో రహమాన్ పై నాగరాజు దాడికి పాల్పడుతున్న సమయంలో బలరాం వచ్చి కాపాడుతాడు. గుడి తలుపులు తెరిచిన రహమాన్ వివరాలు బలరాం అడుగుతాడు. ఆలయ తలుపులు తీసింది ఓ ముస్లిం అని చెబితే గొడవ అవుతుందనే ఉద్దేశంతో రహమాన్ పేరును రామ్ అని నారాయణ కుమారుడు (ఆలీ) అబద్దం ఆడుతాడు. రహమాన్ ఉరఫ్ రామ్ ప్రవర్తన నచ్చి బలరాం ఉద్యోగం ఇస్తాడు. ఒక అబద్దం ఆడిన రామ్.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్దాలు ఆడాల్సి వస్తుంది. అంతేకాక రహమాన్, మీనాక్షిలు ఒకరికొకరు ప్రేమించుకుంటారు. అయితే అనేక అబద్దాలు ఆడిన రామ్.. బలరాంను ఎలా మెప్పించి, మీనాక్షితో పెళ్లిని ఎలా ఒప్పించాడు అనే సాదాసీదా కథతో ‘మసాలా’ చిత్రం రూపొందింది.

వెంకటేష్ బ్రోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడటం బలరాం పాత్ర ప్రత్యేకత. కెరీర్ లో వెంకటేశ్ కు ఇది విభిన్నమైన పాత్ర. మల్టీస్టారర్ చిత్రాల్లో ఉండే పరిమితులు, ఇతర కారణాల వల్ల బలారాం పాత్ర కొంత మూసలో సాగినా.. పర్వాలేదనిపించింది. బలరాం పాత్ర చుట్టే ఇతర పాత్రలు తిరుగుతుంటాయి కాబట్టి వెంకటేశ్ ఈ చిత్రానికి వెన్నుముక అని చెప్పవచ్చు.

ఇక రామ్, రహమన్ రెండు రకాల పాత్రలతో రామ్ ప్రేక్షకులను ఆలరించాడమే కాకుండా ఆకర్షించాడు కూడా. రామ్ పాత్ర కొంత అమాయకంగా ఉంటుంది. రహమాన్ గే (స్వలింగ సంపర్కుడు) రూపంతో నవ్వులు పూయించాడు. రామ్ లో ఉండే ఎనర్జీ గే పాత్రకు చాలా ప్లస్ అయింది. గే పాత్ర పోషించడానికి స్టార్స్ సహజంగానే వెనుకాడుతుంటారు. అయితే రామ్ ఇలాంటి పాత్రను చేయడమనేది ఓ సాహాసామే అని చెప్పవచ్చు.

సోనియా పాత్రలో అంజలి తన పరిధి మేరకు ఓకే అనిపించింది కాని ఈ చిత్రంపై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మీనాక్షిగా పదాంసీ చిన్న చిన్న సీన్లలో కనిపించినా.. పాటలకు మాత్రమే పరిమితమైంది. మీనాక్షి పాత్రకు ఇంకెవర్నినైనా సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నారాయణ, ఆలీ బృందం గురించి. నారాయణ కొడుకుగా ఆలీ నటించాడు. ఆలీ మసాలా అనే డ్రామా కంపెనీని నడుపుతుంటాడు. కామెడి, డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆలీ ట్రాక్ ను తెలుగు వాతవరణానికి అనుగుణంగా చక్కగా డిజైన్ చేశారు. హిందీ ‘బోల్ బచ్చన్’ పోల్చకుంటే కృష్ణ, ఏఎన్నార్ కారెక్టర్లను బాగా ఇంప్రూవ్ చేసి ఆలీతో చేయించడం ఆకట్టుకుంది. అంతేకాక చింతామణి పాత్రలో కోవై సరళ తన మార్కును నిలబెట్టుకుంది. పాత సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్ కు కోవై సరళతో డ్యాన్సులు చేయించడం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. జయప్రకాశ్, పోసానిలకు రొటిన్ పాత్రలే దక్కాయి.

మీనాక్షి పాట ఒక్కటే థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండేలా ఉంది. ఎందుకంటే ప్రోమోలో ఎక్కువగా కనిపించడమేమో. తమన్ మళ్లీ అదే సంగీతం రొటిన్. తమన్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అని చెప్పడం చాలా కష్టం. అనిల్ డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి.

ఇక ‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావు’, ‘మన్మధుడు’ ‘మల్లీశ్వరి’ లాంటి ఫ్యామీలీ ఎంటర్ టైనర్లతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నదర్శకుడు విజయ భాస్కర్ ను ఇటీవల కాలంలో ఫ్లాప్ లు వెంటాడుతున్నాయి. చాలా కాలం తర్వాత ‘బోల్ బచ్చన్’ రీమేక్ తో అక్కడక్కడా తన మార్కును చూపించినా.. ప్రయోగాలకు దూరంగానే ఉన్నట్టు కనిపించింది. బోల్ బచ్చన్ సినిమాను సీన్ టూ సీన్ ను కదపకుండా.. టాలీవుడ్ ట్రెండ్ కు తగినట్టుగా రూపొందించారు.

ఈ చిత్ర సెకండాఫ్ లో కొంత గందరగోళం అనిపించానా.. రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ చేసింది. వెంకటేశ్ ఇంగ్లీష్ డైలాగ్స్ బీ, సీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంపైనే ‘మసాలా’ చిత్ర విజయం కొంత ఆధారపడి ఉంటుంది. వెంకటేశ్, రామ్ అందించిన ‘మసాలా’ చిత్రంలో ఘాటు ఎక్కువైందనిపిస్తుంది. లాజిక్కులన్ని వదిలేసి.. వినోదాన్ని ఆశించే ప్రేక్షకులు ‘మసాలా’ను ఎంజాయ్ చేయవచ్చు అనే రేంజ్ టాక్ ను సంపాదించుకుంది. వెంకట్రామ్ (వెంకటేశ్, రామ్) బ్రాండ్ మసాలాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచిచూద్దాం!

హిందీలో హిట్ అయిన ‘బోల్‌ బచ్చన్‌’ రీమేక్ అనగానే…ఎన్నో సార్లు తెరపై చూసిన పాత కథ, సీన్సే కదా…ఇంక కొత్తగా చెప్పేదేముంటుంది…అంతగా బడ్జెట్ పెట్టి ఇద్దరు హీరోలతో చేస్తున్నప్పుడు స్క్రిప్టు సైడ్ మార్పులతో ఏదో మ్యాజిక్ చేసే ఉంటారు…ఏం చేసి ఉంటారనే ఆసక్తి అందరిలో కలిగింది. అయితే రీమేక్ రైట్స్ ని బోలెడు డబ్బు పెట్టి తీసుకున్నాం కదా…దాన్ని మార్చటం ఎందుకు అనుకున్నారేమో…నటీనటుల హావ భావాలు, డ్రస్,లొకేషన్స్, సీన్స్ ఏమీ మార్చకుండా అచ్చుగుద్దినట్లు అన్నీ మూల చిత్రంలో ఉన్నవే ఉంచారు…అనుకరించారు. దానికి తోడు ఎంతో ఆశలు పెట్టుకున్న వెంకటేష్ బట్లర్ ఇంగ్లీష్ కూడా కిక్ ఇవ్వలేకపోయింది. చాలా డైలాగులు..ఇంగ్లీష్ పదాలుకు అర్దాలు తెలియకపోవటంతో అర్దం కాకుండా, లేనివిగా మిగిలిపోయాయి..అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ కావటంతో టైం పాస్ వ్యవహారంగా ఓ చూపు చూద్దామనుకునేవారితో జస్ట్ ఓకే అనిపించుకునే అవకాసం ఉంది. ఒక అబద్దం ఆడితే …ఆ అబద్దం కప్పి పుచ్చుకోవటానికి మరో అబద్దం…దాన్ని కప్పిపుచ్చుకోవటానికి మరో అబద్దం ఆడాల్సిన పరిస్ధితి వస్తుందనే కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ చిత్రంలో … కోర్టు కేసులో ఓడిపోయి….ఆ కేసు కోసం ఆస్ధి పోగొట్టుకుని, కేసు ఓడగొట్టినందుకు కోపంలో ఆ లాయిర్ ని కొట్టి ఇరుక్కపోయిన రహమాన్(రామ్) నిరాశలో ఏం చేయలేని స్ధితిలో ఉంటాడు. అప్పుడు తన తండ్రి స్నేహితుడైన నారాయణ(ఎంఎస్ నారాయణ) సహాయంతో అతని అక్క సానియా(అంజలి) పెళ్లి కోసం, కుటుంబ పోషణ కోసం భీమరాజపురం వెళ్తాడు. అక్కడ ఊరి పెద్ద బలరాం(వెంకటేష్). బట్లల్ ఇంగ్లీష్ మాట్లాడే అతనికి అబద్దం ఆడేవాళ్లు అంటే మంట..చంపటానికి సైతం వెనుకాడడు. అయితే ఆ విలేజ్ వెళ్లగానే రహమాన్ కొన్ని తప్పని పరిస్దితుల్లో…అబద్దమాడి తన పేరు రామ్‌గా పేరు మార్చుకుని ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ నుంచి…వరసగా ఒక అబద్దం బయిటపడకుండా దాచటం కోసం..మరొకటి..దాన్ని దాచటానికి మరొకటి..చైన్ లా అబద్దాలు అల్లుకుంటూ ముందుకు వెళ్లాల్సిన స్థితి వస్తుంది. అలాంటి స్ధితిలో బలరామ్ కి నిజం ఎలా తెలిసింది…. రహమాన్ ఎలా బయిటపడ్డాడు..కథలో హీరోయిన్స్ పాత్రేమిటి తెరపై చూడాల్సిన మిగతా కథ. వాస్తవానికి ‘బోల్‌ బచ్చన్‌’ చిత్రం స్టోరీ ఐడియా, ఇందులో సీన్స్ మొదటే చెప్పినట్లు కొత్తేమీ కాదు…అందులోనూ రోహిత్ శెట్టి సినిమాల్లో సీన్స్ చాలా భాగం దక్షిణాది సినిమాలనుంచి ఎత్తేసివే ఉంటాయి. అలాంటప్పుడు దాన్ని నెక్ట్స్ లెవిల్ కి స్క్రిప్టు సైడ్ తీసుకు వెళ్తే బాగుండేది. రోహిత్ శెట్టి..గోల్ మాల్ ని … ‘బోల్‌ బచ్చన్‌’గా సెటప్ ఎలా మార్చి చేసారో..అలాగే ‘బోల్‌ బచ్చన్‌’లో స్క్ర్రీన్ ప్లే మార్చి, సీన్స్ కూడా నేటివిటికి తగ్గట్లు కసరత్తు చేసి కొత్తవి వేసుకుంటే (.దబాంగ్ ని గబ్బర్ సింగ్ గా మార్చినట్లు) ఖచ్చితంగా మరో మంచి సినిమా అయ్యిండేది. కథలో వచ్చే మలుపు,జోక్ లు చాలా అవుట్ డేటెడ్ గా…ఊహకు అందే విధంగా ఉన్నాయి. సినిమాలో బాగా పేలింది ఏమిటి అంటే…కోవై సరళ ని తల్లిగా పరిచయం చేసేటప్పుడు వరసగా సెటప్ చేసిన తల్లులు దిగటం థియోటర్ లో విజిల్స్ పడ్డాయి. అలాగే లవ్ సీన్స్ కి ప్లేస్ మెంట్ లేకపోవటంతో కేవలం పాటల కోసమే అవి పెట్టినట్లు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా క్యారెక్టర్స్ లో ఎమోషనల్ డెప్త్ లేదు..క్లైమాక్స్ అయితే హారిబుల్…అదే సినిమాకు పెద్ద మైనస్ గా మారింది.

About the Author