మళ్లీ బుక్ అయినట్లే: పాఠ్య పుస్తకాల సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్
ప్రభుత్వ స్కూళ్లలో చదివే 79 లక్షల మంది విద్యార్థులకు అందించాల్సిన ఉచిత పాఠ్యపుస్తకాల ముద్రణే ఇంకా ప్రారంభం కాలేదు. గతేడాది ఫిబ్రవరి చివరలో పుస్తకాల ముద్రణ ప్రారంభమైనా జూలై చివరి వరకు కూడా విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు అందలేదు. ఈసారి మార్చి నెలాఖరు వచ్చినా పుస్తకాల ముద్రణ ప్రక్రియకు ఇంకా మోక్షం లభించలేదు. ఇటీవలే పేపరు కొనుగోలు టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మరోవైపు ముద్రణ సంస్థలతో(ప్రింటర్లతో) ఒప్పందాల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తైఅగ్రిమెంట్ కాపీలతో పేపరు కొనుగోలుకు ఆర్డరు ఇచ్చేందుకు మరో నెలకు పైగా సమయం పట్టనుంది. ప్రస్తుతం విద్యుత్తు కోతల నేపథ్యంలో పేపరు వచ్చాక, ముద్రణ చేపట్టి స్కూళ్లకు పుస్తకాలను పంపేందుకు మరో 5 నెలల సమయం పట్టనుంది. దీంతో వచ్చే జూన్ 12న స్కూళ్లు తెరిచే రోజు విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందని పరిస్థితి నెలకొంది.
విద్యుత్తు కోతలతో మరింత ఆలస్యం…
సాధారణంగా పాఠ్య పుస్తకాల ముద్రణాలయం ప్రింటర్లకు ఆర్డర్లు ఇచ్చాక పుస్తకాల ముద్రణకు రెండు నెలలకు పైగా సమయం పడుతుంది. ప్రింటర్ల నుంచి హైదరాబాద్‌లోని గోదాముకు, అక్కడి నుంచి జిల్లాలకు, మండల కేంద్రాలకు, స్కూల్ పాయింట్‌కు పుస్తకాలు చేరే సరికే మరో రెండు నెలల సమయం పట్టనుంది. ఇక స్కూల్లోని విద్యార్థులకు పుస్తకాలు అందడ ం వేరే లెక్క. ఈ పరిస్థితుల్లో విద్యుత్తు కోతలు మరింత సమస్య తెచ్చిపెట్టాయి. పరిశ్రమలకు వారం లో మూడు రోజులు విద్యుత్తు సరఫరానే ఉండదు. మరో నాలుగు రోజులు సాయంత్రం 6 గంటల నుంచి 10 వరకు కోతలే. ఈ నేపథ్యంలో ఈసారి ముద్రణకే కనీసం మూడు నెలల సమయం పట్టే పరిస్థితి నెలకొంది. ఈ లెక్కన పుస్తకాలు స్కూల్ పాయింట్‌కు చేరేసరికి ఆగస్టు నెల వచ్చే పరిస్థితి నెలకొందని అధికారులే పేర్కొంటున్నారు.
గతేడాది కొత్త పుస్తకాల సాకు…
రాష్ట్రంలోని 76 వేల ప్రభుత్వ స్కూళ్లలో చదివే 79 ల క్షల మంది విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలను అందించాల్సిన ప్రభుత్వం ఏటా వివిధ సాకులతో జాప్యం చేస్తూనే ఉంది. గతేడాది 3, 6, 7వ తరగతులకు కొత్త పుస్తకాలను రూపొం దించటంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) జాప్యం చేసిందనే నెపంతో సకాలంలో పుస్తకాలను అందించలేకపోయింది. వాస్తవానికి టెండర్ల ఖరారు విషయంలోనే జాప్యం చేసింది. దీంతో గతేడాది జూన్ 12న స్కూళ్లు తెరిచే నాటికి 20 శాతం కంటే తక్కువ పుస్తకాలే మండల కేంద్రాలకు పంపించగలిగింది. ఈసారి అంతమొత్తం కూడా స్కూళ్లకు చేరే పరిస్థితి లేకుండాపోయింది.
ప్రభుత్వం చేస్తున్న తప్పులే ఇందుకు కారణం. ఈసారి 4, 5, 7, 8వ తరగతుల పుస్తకాలను మార్పు చేసినా ఎస్‌సీఈఆర్‌టీ సకాలంలోనే అందించింది. అయినా ఇంతవరకు ముద్రణ చేపట్టలేదు. పుస్తకాల ముద్రణ పనుల ప్రక్రియ గత అక్టోబర్‌లోనే చేపట్టినా ప్రభుత్వమే జాప్యం చేసింది. ఎప్పటిలాగే అధికారులు ఒక ఏడాది ముద్రణ కోసం టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపడితే ప్రభుత్వం రెండేళ్లపాటు పనులను అప్పగించేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అక్టోబరులో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మళ్లీ రెండు నెలల తరువాత ఒక ఏడాదికే ముద్రణ పనులు అప్పగించేలా టెండర్లు పిలవాలని పేర్కొంది. డిసెంబరులో సవరణ ఉత్వర్వులు ఇచ్చింది. దీంతో రెండు నెలల జాప్యం జరిగింది. మరోవైపు పేపరు కొనుగోళ్ల టెండర్లలోనూ జాప్యం చేసింది. ఫలితంగా ఈసారి సకాలంలో పుస్తకాలు అందని పరిస్థితిని ప్రభుత్వమే తెచ్చిపెట్టింది.