మధ్యంతరానికి సిద్ధం: బీజేపీ
దేశంలో మధ్యంతర ఎన్నికలు జరిగితే దానికి తాము అన్నివిధాలా సిద్ధంగా ఉన్నట్టు విపక్ష బీజేపీ ప్రకటించింది. 2014 వరకు వేచి ఉండకుండా కాంగ్రెస్ ఈ ఏడాదిలోనే మధ్యంతరానికి తెరతీయవచ్చనే ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. గడిచిన నాలుగు రోజుల్లో పార్టీ అగ్రనేతల భేటీ రెండోసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో అగ్రనేత ఎల్ కే అద్వానీ, గుజరాత్ సీఎం, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు నరేంద్ర మోడీ, నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, మురళీ మనోహర్ జోషి, అనంతకుమార్, రాంలాల్ తదితరులు పాల్గొన్నారు.
సుమారు రెండు గంటల పాటు సాగిన సమావేశంలో దేశ రాజకీయాలు, పొత్తులు, ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అవినీతి, కుంభకోణాలు, ధరల పెరుగుదల, ఆర్థిక సంక్షోభం, ఇలా అన్ని అంశాల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలు, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ‘వ్యవస్థ’ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. దేశ వ్యాప్తంగా వందకు పైగా ర్యాలీలు నిర్వహించాలని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న సుపరిపాలన, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో కలిసివచ్చే పార్టీలతో పొత్తులపై సంప్రదింపులు, పార్టీని వీడిన నేతలను దరిచేర్చుకోడానికి ఉన్న అవకాశాలపై దృష్టి వంటి కీలక అంశాలపై నేతలు చర్చించినట్టు సమాచారం.
రెండంచెల వ్యూహాలు..
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కోడానికి బీజేపీ రెండంచెల విధానంతో ముందుకు సాగనుంది. రాజకీయంగా, సంస్థాగతంగా ప్రచారానికి సమాయత్తమవుతోంది. దేశవ్యాప్తంగా ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది. సంస్థాగతంగా తీసుకుంటున్న చర్యల్లో మెనిఫెస్టో, కమిటీల ఏర్పాటు తదితర అంశాలను చేర్చారు.
పార్లమెంటును ఎదుర్కోలేని కాంగ్రెస్: అనంతకుమార్
పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ ఎదుర్కోలేకపోతోందని బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ విమర్శించారు. ఈ నెలలో జరగాల్సిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పై మిత్రపక్షాల ఒత్తిడి ఎక్కువైందన్నారు. అవినీతి పెరిగిపోయిందని, ఆర్థిక అంశాల్లో చతికిలపడిందని ఇలా ప్రతి విషయంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ‘మధ్యంతర ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉంది. దీనిపై పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీలో నిర్ణయం కూడా జరిగింది. మిత్రపక్షాల ఒత్తిడి నేపథ్యంలో కాంగ్రెస్ త్వరలోనే ఎన్నికలకు వెళ్లొచ్చు’ అని కుమార్ అన్నారు.