మడోనా ఆస్తులు రూ.5,428 కోట్లు
ప్రముఖ పాప్ గాయని మడోనా(54) అరుదైన ఘనత సాధించారు. వంద కోట్ల డాలర్లు (రూ.5,428 కోట్లు) సంపాదించిన తొలి పాప్ గాయనిగా రికార్డు సృష్టించారు. గత ఏడాది ‘ఎండీఎన్ఏ’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన ప్రదర్శనలు, ఇతర వ్యాపారాలతో వచ్చిన డబ్బుతో ఆమె ఆస్తి వంద కోట్ల డాలర్లకు చేరిందని దిసన్.కో.యూకే వెబ్సైట్ తెలిపింది. దీంతో ఆమె అపరకుబేరులైన హాలీవుడ్ డెరైక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్, టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రేల తదితర సెలబ్రిటీల జాబితాలో చేరిపోయారని పేర్కొంది. మడోనాకు సుగంధతైలాలు, వస్త్ర వ్యాపారాలున్న సంగతి తెలిసిందే.