మండేలా మనసుపడిన వేళ..
పెళ్లి చేసుకుంటానని భారత మహిళకు ప్రతిపాదన
తిరస్కరించిన అమీనా కచాలియా
కచాలియా ఆత్మకథలో వెల్లడి
‘‘అతిలోక సుందరివి నీవు.. మనసు దోచిన జవ్వనివి నీవు’’ అంటూ నెల్సన్ మండేలా ఓ భారత సంతతి మహిళను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె ప్రేమ కోసం ఆరాటపడ్డారు. పెళ్లాడతానని ప్రతిపాదించారు. అయితే అప్పటికి వితంతువైన ఆమె తాను యువతిని కానని, నడి వయస్కురాలినని కరాఖండిగా చెప్పి ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. ఒకవేళ మండేలా ప్రతిపాదనకు ఆమె ఒప్పుకుని ఉంటే దక్షిణాఫ్రికా తొలి భారత సంతతి ప్రథమ మహిళగా చరిత్రలో నిలిచిపోయేది. భారత సంతతికి చెందిన అమీనా కచాలియా ఆత్మకథ ‘వెన్ హోప్ అండ్ హిస్టరీ రైమ్’ పుస్తకంలో ఈ ఆసక్తికర సంగతులున్నాయి. అమీనా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్‌సీ) నేత యూసఫ్ కచాలియా భార్య. గత నెల 83వ ఏట చనిపోయిన అమీనా ఆత్మకథ ఇటీవల ప్రచురితమైంది. అందులో తన కుటుంబ స్నేహితుడైన మండేలాతో ఆత్మీయ అనుబంధాల గురించి వివరించారు. మండేలా తన తల్లిని పెళ్లాడతానని చెప్పిన మాట నిజమేనని అమీనా పిల్లలు గాలిబ్, కోకోలు చెప్పారు. అమీనా తండ్రి ఇబ్రహీం మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన సహచరుడు. అమీనా భర్త 1995లో ఢిల్లీలో చనిపోయారు. అమీనా పుస్తకంలోని మండేలా సంగతులు ఆమె మాటల్లోనే..
అప్పుడు మండేలా 27 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని వచ్చారు. విన్నీ మండేలాతో ఆయన వైవాహిక బంధం ముగిసింది. ఆయన తరచూ మా ఇంటికి వచ్చేవారు(1996 ప్రాంతంలో). నేను కూడా ఆయన ఆఫీసుకు, ఇంటికి వెళ్లేదాన్ని. ఓ సారి ఆయన లివింగ్‌రూంలో నన్ను సోఫాలో కూర్చోబెట్టారు. గాఢంగా ముద్దుపెట్టుకున్నారు. నా తలవెంట్రుకల్లోకి వేళ్లు పోనిచ్చారు. నువ్వు అరుదైన అందగత్తెవని, ఆకర్షణీయమైన యువతివని నీకు తెలుసా? అని అన్నారు. నా ముఖం ఎర్రబడింది. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అని అడిగారు. నేను నెమ్మదిగా బదులిచ్చా. నేను యువతిని కాను. నడీడుదాన్ని అని చెప్పా. ఆయన కుదుటపడ్డారు. అయితే మళ్లీ పాతపాటే పాడారు. అయితే యువతినని కాకుండా ముసలిదాన్ననని అన్నారు. నాకు చిర్రెత్తుకొచ్చింది. నేను ముసలిదాన్నీ కాదని అన్నా. ఇంకోసారి ఆయన జోహన్నెస్‌బర్గ్‌లోని మా ఇంటికొచ్చారు.
ఆయన కోసం పీతల కూర వండా. అయితే తన ప్రతిపాదనను ఒప్పులేదన్న అలకతో తినలేదు. ఆ రోజు రాత్రి నెల్సన్ మళ్లీ ప్రేమ మాట బలంగా తీసుకొచ్చారు. నేనూ తగ్గలేదు. గ్రేకా మచెల్‌తో ఆయన పెళ్లి బంధాన్ని గుర్తు చేశా… ఒక దశలో ఆయనపై మొగ్గుచూపుతానని అనుకున్నా. కానీ గ్రేకాతో ఆయన పెళ్లి నన్ను ఆపింది… నేను ఒంటరిని. ఆయన కాదు. నేను ఆయనను నొప్పించా.. పీతల కూర తినండని బతిమాలా. అయన వద్దని వెళ్లిపోయారు. మరుసటి రోజు ఆయన నేను అందగత్తెనని పొగుడుతూ కాగితాలపై రాశారు. అయితే మనం నిప్పుతో చెలగాటమాడుతున్నాం అని ఆయనను హెచ్చరించి, ఆ కాగితాలు చించేశా. నేను నెల్సన్‌ను ప్రేమించా. కానీ అది నా భర్తపై ప్రేమ లాంటిది కాదు..
కోలుకుంటున్న మండేలా
జోహాన్నెస్‌బర్గ్: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఊపిరితిత్తుల్లోకి నీరు చేరిందని, అయితే, ఆయన ప్రస్తుతం తేలికగానే ఊపిరి తీసుకోగలుగుతున్నారని వైద్యులు చెప్పినట్లు అధ్యక్ష ప్రతినిధి మ్యాక్ మహారాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.