‘బీఎల్ ఎస్ కంపెనీ’కి పాస్ పోర్ట్ సేవలు….
అవుట్ సోర్సింగ్కు సంబంధించిన పాస్పోర్ట్ సేవలను నూతనంగా బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ కంపెనీకి అప్పగించినట్లు అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం వాషింగ్టన్లో వెల్లడించింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి బీఎల్ఎస్ కంపెనీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇప్పటి వరకు ఈ సేవలు అందించిన వీఎఫ్ఎస్ గ్లోబల్ కంపెనీ సేవలు మే 6వ తేదీతో రద్దు అవుతాయని పేర్కొంది. అయితే పాస్పోర్ట్ వ్యక్తిగతంగా అయితే 6వ తేదీ లేదా ఈ మెయిల్ ద్వారా అయితే మే3 లోగా వీఎఫ్ఎస్ కంపెనీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో సూచించింది.
న్యూఢిల్లీ కేంద్ర కార్యాలయంగా పని చేస్తున్న బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ కంపెనీ అవుట్ సోర్సింగ్ వీసా, పాస్పోర్ట్ల సేవలు అందించడంలో ప్రత్యేకత గుర్తింపు పొందిందని పేర్కొంది. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయంతోపాటు న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో, అట్లాంటా, హ్యూస్టన్ నగరాల్లోని భారత కాన్సులేట్లలో బీఎల్ఎస్ కంపెనీ సేవలు అందిస్తుందని భారత రాయబార కార్యాలయం తెలిపింది. పాస్పోర్ట్ అవుట్ సోర్సింగ్ సేవలు అందించేందుకు టెండర్ల ప్రక్రియ ఆహ్వానించేందుకు ఈ ఏడాది మార్చి 1న ప్రకటన ఇచ్చినట్లు భారత రాయబార కార్యాలయం ఈ సందర్భంగా గుర్తు చేసింది.