Published On: Sat, Jan 4th, 2014

‘బిరియానీ’ రివ్యూ

Share This
Tags

సుధీర్(కార్తీ),పరుశురామ్(ప్రేమ్ జీ) క్లోజ్ ప్రెండ్స్. ప్రియాంక(హన్సిక) అనే గర్ల్ ప్రెండ్ ఉన్నా…సుధీర్ కనపడ్డ అమ్మాయికల్లా కన్ను గీటి,ముందుకు వెళ్దామని ట్రై చేస్తూంటాడు. పనిలో పనిగా పరుశు ప్రపోజ్ చేద్దామనుకున్నవాళ్లని సుధీర్ సెట్ చేసేస్తూంటాడు. ఓ రోజు వీరిద్దరూ కలిసి రాజమండ్రికి తమ కంపెనీ పని నిమిత్తం వెళ్లి , తిరిగివస్తూండగా…ఓ అమ్మాయి(మెండి ధాకర్) ని చూసి టెమ్ట్ అవుతారు. ఆమెను ఫాలో చేస్తూ వెళ్లి ప్రముఖ వ్యాపారవేత్త వరదరాజులు(నాజర్) మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అక్కడ నుంచి పోలీసులు, సీఐడీ వెంబడిస్తూంటారు. ఇంతకీ వరదరాజులుని చంపిందెవరు…సుధీర్ ఎలా తప్పించుకుని,అసలు హంతకులుని పట్టించారనేది ట్విస్ట్ లతో కూడిన మిగతా కథ. హాలీవుడ్ చిత్రం హ్యాంగోవర్ ప్రేరణలో రాసుకున్నట్లు ఉన్న ఈ కథలో …(అఫ్ కోర్స్ దర్శకుడు మధ్యలో హ్యాంగోవర్ చూపి క్లూ ఇస్తాడనుకోండి) ఇంటర్వెల్ లో హీరో మర్డర్ కేసులో ఇరుక్కుపోతాడు అనే ట్విస్ట్ మొదటే పెట్టుకుని రాసుకోవటంతో ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కిక్ రాలేదు. సినిమా అప్పటివరకూ పెద్దగా జరిగిన ఫీలింగ్ రాలేదు. కేవలం ఇంటర్వెల్ కి ముందు ఓ పది నిముషాలు ఇంట్రస్టింగ్ గా ఉంది. అయితే దర్శకుడు తెలివిగా దాన్ని కామెడీతో దాటే ప్రయత్నం చేసాడు..చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఫస్టాఫ్ ..గంటం పావులో ఆ పై పావు గంటని ట్రిమ్ చేస్తే మరింత గ్రిప్ తో సాగేదేమో అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ లో హీరో…తనను మర్డర్ కేసులో ఇరికించిన వారిని..కనిపెట్టడమే కార్యక్రమం చేపడతాడు. కానీ యాక్టివ్ గా ఏమీ చేయలేకపోతాడు. ఎప్పటికప్పుడు దర్శకుడే స్వయంగా క్లూలు ఇస్తున్నట్లుగా ..కథలో పాత్రలు వచ్చి..హీరోని లీడ్ చేసి లక్ష్యం కు తోర్పడుతూంటాయి. అయితే సాధారణ యువకుడు ఇన్విస్టేగేషన్ ఏమి చేయగలగుతాడు అని అడగొచ్చు. అయితే సామాన్యుడుగా హీరోని చూపించినప్పుడు అతనిపై ఫైట్స్ అవీ పెట్టకూడదు. ఫైట్స్ ,పాటలు,రొమాన్స్ సమంయంలో అతన్ని అసాధారణ వ్యక్తిలా..(రొటిన్ సౌత్ హీరోలా) చూపి…హీరో లక్ష్య సాధనలో మాత్రం ఏమీ చేయకుండా ప్యాసివ్ గా ఉంచేసారు. పక్కా సినిమా టెక్ గానో, లేక న్యాచురల్ గానో ఏదో ఒకటి దర్శకుడు తేల్చుకుని ఈ స్క్రిప్టుని దర్శకుడు డీల్ చేస్తే బాగుండేది. సినిమాలో పెద్ద పాయింట్ దర్శకుడు సెన్సాఫ్ హ్యూమర్. సీరియస్ సన్నివేశాల్లో కూడా చిన్న జోక్ వేసి ముందుకు వెళ్లాడు. అలాగే…ఈ కామెడీకి ప్రేమ్ జీ బాగా సహకరించాడు. వెంకట్ ప్రభు సినిమాల్లో ఎక్కువగా కనిపించే ప్రేమ్ జీ …సినిమాలో దాదాపు హీరోతో సమానమైన క్యారెక్టర్ వేసాడు. కార్తీ ఎప్పటిలాగే సిన్సియర్ గా,సీరియస్ గా తన పాత్రను చేసుకుంటూ పోయాడు. హన్సిక ఈ సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది అనిపించింది అంతే. క్లైమాక్స్ ట్విస్ట్ బాగున్నా… ఏదో మిస్సైన ఫీలింగ్ వచ్చింది. ఆ క్లైమాక్స్ పాయింట్ ని హీరో స్వయంగా కనుక్కుని ఉంటే బాగుండేది. అలా కాకుండా క్లైమాక్స్ ట్విస్ట్ కూడా కథ పూర్తైంది…ఇక చెప్పేయాలి అన్నట్లు ఓ పాత్రని పంపించి రివిల్ చేసేయటంతో అసంతృప్తి ఫీలింగ్ వచ్చింది. అలాగే అక్క,తమ్మడు అరవ సెంటిమెంట్ తెలుగు వారికి కొంచెం అతిగా అనిపిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్టులలో నాజర్,రాంకీ రొటిన్ గా చేసుకుంటూ పోయారు. టెక్నికల్ గా ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది. సంగీతం విషయానికి వస్తే రెండు పాటలు బాగున్నాయి. రీరికార్డింగ్ బాగుంది. ఫైనల్ గా సినిమా పూర్తిగా తీసిపారేయాల్సిన సినిమా మాత్రం కాదు. ఓ సారి సరదాగా లుక్కేయచ్చు. కాస్త కామెడీ, మరికొంత థ్రిల్ తో ఓ మాదిరిగా ఎంజాయ్ చేసి బయిటపడొచ్చు. వెంకట్ ప్రభు, కార్తీ కాంబినేషన్ అని ఓ రేంజిలో మాత్రం ఊహించుకుంటే దారుణంగా దెబ్బ తింటారు. ఆ హ్యాంగోవర్ నుంచి బయిటపడటానికి చాలా టైమ్ పడుతుంది.

About the Author