బసంతి’ రివ్యూ
స్నేహితులతో సరదాగా స్టూడెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూంటాడు అర్జున్(గౌతమ్). అతను రోషిని (ఆలీషా)తో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. తన ప్రేమను వ్యక్తం చేసే సమయంలో ఆమె కనిపించకుండా పోతుంది. అదే సమయంలో అతను చదువుతున్న బసంతి ఇంజినీరింగ్ కాలేజీని టెర్రరిస్ట్ లు చుట్టుముట్టి ఆధీనంలోకి తీసుకుంటారు. స్టూడెంట్స్ ని విడుదల చేయాలంటే పోలీసుల అదుపులో ఉన్న టెర్రరిస్ట్ బాబాఖాన్ ని విడుదల చేయాలని కండీషన్ పెడతారు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఈ క్రమంలో అర్జున్ క్లోజ్ ప్రెండ్ అబ్బాస్(రణధీర్)ని వాళ్లు చంపేస్తారు. దాంతో అర్జున్ ఎదురు తిరిగి ఏం చేసాడు..ఇంతకీ రోషిణి ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.
నక్సలిజం సమస్యని… తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణగా సున్నితంగా ‘బాణం’ రూపంలో తెరకెక్కించారు దర్శకుడు చైతన్య దంతులూరి. ఇప్పుడు ఆయన దర్శకనిర్మాణంలో వచ్చిన ‘బసంతి’ లో తీవ్రవాదాన్ని నేపథ్యంగా ఎంచుకుని ప్రేమ కథని చెప్పే ప్రయత్నం చేసారు. అయితే ఇలాంటి కథల్లో ముఖ్యంగా ఉండాల్సిన ఉత్కంఠత అనే ఎలిమెంట్ ని మిస్సైపోయాడు. అలాగే స్లో నేరేషన్ కూడా సెకండాఫ్ లో సహన పరీక్ష పెట్టిందనే చెప్పాలి. క్లైమాక్స్ కూడా ఊహకు అందేలా ఉండటం కూడా ఈ కథకు మరో మైనస్ గా నిలిచింది. ఇక ఓ సాధారణమైన కాలేజీ కుర్రాడు …మారణాయుధాలు కలిగి ప్రాణాలకు తెగించిన టెర్రరిస్టులను మట్టికరిపించటం కూడా ఎంత సినిమాటెక్ గా అనుకున్నా కన్వీన్స్ కాలేము. ఇలాంటి ఉత్కంఠభరిత చిత్రంలో కామెడీ ఎందుకనుకున్నారో ఏమో కానీ దాన్ని వదిలేసారు. ఎంటర్టైన్మెంట్ ఉంటే ఆ సీరియస్ నెస్ దెబ్బతింటుదనుకున్నారు సరే ఎమోషన్స్ సంగతి ఏంటంటే సమాధానం ఉండదు. కథలో హీరో స్నేహితుడు చనిపోయినప్పుడు తప్ప ఎప్పుడూ పెద్దగా కనెక్టు కాలేము. గౌతమ్ కూడా పాత్ర డెప్త్ కు తగ్గ ఎక్సప్రెషన్స్ ను చూపించలేకపోయాడు. హీరోయిన్ కు పెద్ద సీన్స్ లేవు…అంత సీనూ లేదు. మిగతా సీనియర్స్ సరేసరి. టెక్నికల్ గా చిత్రం మొదటే చెప్పుకున్నట్లు ముందు వరసలో ఉంటుంది. కథ,కథనంపై మరింత శ్రద్ద దర్శకుడు చూపి ఉంటే బాగుండను అనిపిస్తుంది. సంగీతం విషయానికి పాటలు పెద్దగా క్లిక్ కాకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. ఇక సినిమాటోగ్రఫీ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్పాలి. ఎడిటింగ్ విషయంలో కొంతం స్పీడు చేస్తే స్లో అన్న ఫీలింగ్ ఉండేది కాదేమో అనిపిస్తుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి.