Published On: Sun, May 11th, 2014

ప్యార్ మే పడిపోయానే రివ్యూ……

Share This
Tags

‘ప్రేమ కావాలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని ‘లవ్లీ’ సినిమాతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఆది హీరోగా నటించిన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ప్యార్ మే పడిపోయానే’. ‘లవ్లీ’ తో హిట్ కొట్టి హిట్ పెయిర్ అనిపించుకున్న ఆది, శాన్వి జంటగా నటించిన ఈ సినిమా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి చావాలి రూటు మార్చి మొదటి సారిగా చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కెకె రాధామోహన్ నిర్మాత. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో లవ్ స్టోరీస్ తోనే హిట్స్ అందుకున్న ఆది ఈ లవ్ ఎంటర్టైనర్ తో హిట్ అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం..
కథ :
చంద్ర అలియాస్ చిన్నా (ఆది) – యుక్త (శాన్వి) చిన్నప్పుడు పక్కపక్క ఇళ్లలోనే ఉంటారు. కానీ వీరిద్దరికీ అస్సలు పడదు. కొద్ది రోజులకి చిన్నా వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసే వేరే ఏరియాకి వెళ్ళిపోతారు. కానీ అప్పుడు చేసిన ఓ పని వల్ల యుక్త చిన్నాపై పగ పెంచుకుంటుంది.
కట్ చేస్తే చంద్ర మ్యూజిక్ కంపోజర్ అవ్వాలనుకునే ఓ బిటెక్ కుర్రాడు. తను చదివే కాలేజ్ లోనే యుక్త చేరుతుంది. యుక్తని మొదటి చూపులోనే ప్రేమించేసిన చంద్ర తనతో ఎలాగన్నా పరిచయం పెంచుకోవాలనుకుంటాడు. యుక్తకి సింగర్ అవ్వాలనే కోరిక ఉండడంతో తన ట్రూప్ లో చేర్చుకుంటాడు. అలా పరిచయం మొదలైన వీరిద్దరూ కొద్ది రోజులకి ప్రేమికులుగా మారుతారు. అప్పుడే యుక్త తన చిన్నప్పటి ఫ్రెండ్ అని, అలాగే చిన్నాపైన బాగా పగ పెంచుకొని ఉందని తెలుస్తుంది.
అక్కడి నుంచి చంద్ర యుక్తకి తనే చిన్నా అని తెలియకుండా ఉండటానికి పడ్డ కష్టాలేమిటి? చివరికి యుక్తకి చంద్రనే చిన్నా అని తెలిసిందా? అలా తెలిస్తే చిన్నాని యుక్త ఏం చేసింది? అసలు యుక్తకి చిన్నా చేసిన ద్రోహం ఏంటి అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే..
ప్లస్ పాయింట్స్ :
ఇప్పటి వరకూ చేసిన లవ్ ఎంటర్టైనర్స్ లానే ఆది ఈ లవ్ ఎంటర్టైనర్ లో కూడా చక్కటి నటనని కనబరిచాడు. స్టైలిష్ లుక్ లో కనిపించిన ఆది కామెడీ సీన్స్ ని చాలా బాగా చేసాడు. ముఖ్యంగా సాయి కుమార్, రవి శంకర్ ని ఇమిటేట్ చేసిన సీన్స్, కొన్ని చోట్ల గందరగోళం క్రియేట్ చేసే సీన్స్ లో చాలా బాగా హావభావాలు పలికించాడు మరియు రెండు పాటల్లో డాన్స్ బాగా వేసాడు. హీరోయిన్ శాన్వి కూడా తన పాత్రకి న్యాయం చేసింది. సినిమాలో గ్లామరస్ గా కనిపించడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేసింది.
ఇక చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో ఉన్న కామెడీ ఎపిసోడ్స్.. ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్, హర్రర్ సినిమాల ఎపిసోడ్ నవ్విస్తే, ఇక సెకండాఫ్ లో వచ్చే హుస్సేన్ వర్మ పాత్ర పోషించిన సప్తగిరి ఎపిసోడ్, అలాగే తాగుబోతు రమేష్ ఎపిసోడ్, మధు చేసిన కొన్ని సీన్స్ ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. అలాగే ఆది పక్కన ముస్లీం ఫ్రెండ్ పాత్ర కూడా నవ్విస్తుంది. సెకండాఫ్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ ఈ సినిమా రన్ టైం 2 గంటల 28 నిమిషాలు ఉండడం.. ఇదే సినిమాని అనవసరమైన, రీపీటెడ్ గా అనిపించే సీన్స్ ని లేపేసి రెండుగంటల్లో తీసి ఉంటే సినిమా కాస్త బాగుండేది అలాగే వేగంగా కూడా అనిపించేది. అలాగే సెకండాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేకపోవడమే కాకుండా రిపీటెడ్ సీన్స్ తో సాగదీసినట్టు ఉంటుంది.
అలాగే ఈ సినిమాకి రాసుకున్న కథ చాలా పాతది కానీ దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయాలనుకొన్నారు కానీ సక్సెస్ కాలేకపోయారు. అలాగే స్క్రీన్ ప్లే కూడా చాలా ఊహాజనితంగా ఉంటుంది. దాంతో ఆడియన్స్ కథలో వచ్చే ట్విస్ట్ లను ఈజీగా ఊహించేయగలరు. అలాగే సినిమానే స్లోగా ఉంది అనుకుంటుంటే మధ్యలో వరుసగా పాటలు వచ్చి ఇంకా బోర్ కొట్టిస్తాయి. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంది.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ విభాగంలో సినిమాకి బాగా హెల్ప్ చేసిన వారు ఇద్దరే. అందులో ఒకరు సినిమాటోగ్రాఫర్, రెండవది మ్యూజిక్ డైరెక్టర్. సినిమాటోగ్రాఫర్ టి. సురేందర్ రెడ్డి ఇచ్చిన ప్రతి లొకేషన్ ని చాలా గ్రాండ్ గా చూపించి ఆడియన్స్ కి రిచ్ ఫీల్ కలిగించేలా చేసాడు. ఇక సినిమాలో పాటలు ఎక్కువగా వచ్చినా అనూప్ అందించిన పాటలు మాత్రం బాగున్నాయి అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి హెల్ప్ అయ్యింది. డైలాగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.
ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ తీసుకొని డైరెక్టర్ తో ఒకసారి చర్చించి రిపీటెడ్ గా ఉన్న సీన్స్ మరియు బోరింగ్ గా ఉన్న సీన్స్ ని కట్ చేసి సినిమా నిడివి కాస్త తగ్గించగలిగి ఉంటే సినిమాకి కాస్త హెల్ప్ అయ్యేది. ఇక రూటు మార్చి లవ్ ఎంటర్టైనర్ మీద పడ్డ రవి చావాలి ప్రెజెంటేషన్ కొత్తగా ఇస్తే పాత కథ అయిన హిట్ అయిపోతుందనే ఉద్దేశంతో ఒక పాత కథని ఎంచుకున్నాడు. పాత్రల ప్రెజెంటేషన్ కొత్తగా ఆలోచించిన రవి చావాలి కథనం విషయంలో కొత్తగా ఆలోచించకపోవడంతో సినిమాని అనుకున్న స్థాయికి తీసుకెళ్ళలేక చతికిలపడ్డాడు. దాంతో ఎంటర్టైన్మెంట్, లవ్ ట్రాక్ ని సరిగా డీల్ చేయలేక పోయాడు. చివరిగా రవి చావాలి తనకి టచ్ లేని జోనర్ లో సినిమా చేసి తన చేతులు తనే కాల్చుకున్నాడు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
తీర్పు :
‘ప్యార్ మే పడిపోయానే’ సినిమా థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ని ఈ సినిమాపై ప్యార్ లో పడిపోయే అంత రేంజ్ లో అయితే లేదు. మొదటి సారి లవ్ ఎంటర్టైనర్ చేసిన రవి చావలి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. అలాగే రెండు సార్లు రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ తో హిట్ అందుకున్న ఆది కూడా ఈ సినిమాతో ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు.

About the Author