పొగ మంచును వలేసి పట్టి… ఎడారికి జీవం పోసి…
అటకామా ఎడారి. చిలీ ఉత్తర ప్రాంతంలో ఉన్నది. ఏనాడూ వానను చూడని ఎడారి ఇది. ఒక నీటి చుక్క కానీ.. ఏ పిచ్చి మొక్క కానీ ఎరుగని బీడు. కానీ.. శాస్త్రవేత్తలు ఈ ఎడారికి జీవం పోస్తున్నారు. అందుకు అవసరమైన జీవ జలాన్ని ఈ ఎడారిలోనే సంపాదిస్తున్నారు. తెల్లవారుజామున కురిసే తెలి మంచుకు వలేసి పడుతున్నారు. ఆ వలలో పొగ మంచు బిందువులు చిక్కుకుంటున్నాయి. అవి నీటి చుక్కలుగా మారుతున్నాయి. చుక్క చుక్కనూ ఒడుపుగా పైపులో నింపుతున్నారు. అలా నింపిన స్వచ్ఛమైన నీటితో ఎడారిలో జీవం పుట్టిస్తున్నారు. మొక్కలను పెంచుతున్నారు. దాహం తీర్చుకుంటున్నారు. చనారల్ అనే గ్రామంలో.. గాలిలోని తేమను ఒడిసి పట్టుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన భారీ వలలను స్థానికులు ఉపయోగిస్తుండగా తీసిన చిత్రాలివి. వలలో చిక్కిన పొగమంచు.. నీటి బిందువులుగా మారి పైపుల్లోకి వెళ్లన తర్వాత.. ఆ నీటిని మొక్కలకు పోస్తూ, దాహం తీర్చుకుంటున్న దృశ్యాలివి.