Published On: Sat, Mar 22nd, 2014

పసుపుతో క్యాన్సర్ నియంత్రణ!

Share This
Tags

తెలుగునాట ఏ శుభకార్యం తలపెట్టినా ఇంట్లో పసుపు ఉండాల్సిందే! కూరల్లోనూ తప్పనిసరిగా వాడతాం. గుమ్మానికి పసుపు రాయటం అనాదిగా వస్తున్న ఆచారం, శుభప్రదం. ఇన్ని సుగుణాలతో వంటింట్లో కనిపించే పసుపు కొమ్ము క్యాన్సర్‌కు విరుగుడుగా పనిచేస్తుందని తేలింది.

రకరకాల క్యాన్సర్ కారకాలను పసుపు నియంత్రిస్తుందని, ఇది గొప్ప క్యాన్సర్ ఔషధంగా పని చేస్తుందని నిమ్స్ వైద్యులు కనుగొన్నారు. నిమ్స్ క్లినికల్ ఫార్మకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ విజయకుమార్ కుటాల తన సహచరులు డా. గిరిధర్ కోటంరాజుతో పాటు ఐఐసీటీ శాస్త్రవేత్తలతో కలిసి పసుపులో క్యాన్సర్ నిరోధక కారకాలున్నాయని కనుగొన్నారు. పసుపులో ఉండే ‘కర్‌కుమిన్’ అనే పదార్థం క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తున్నందని తేల్చారు. రోజూ పసుపు తీసుకోవటం ద్వారా కర్‌కుమిన్ తక్కువ మోతాదులో క్యాన్సర్ కణాలకు చేరుతుంది. అదే ట్రైఫినైల్ పాస్పొనియమైన్ అనే పదార్థంతో కలిసి తీసుకుంటే వంద శాతం క్యాన్సర్ కణాల్లోకి వెళుతుందని నిరూపించారు.

దీనివల్ల మిగతా కణాలకు ఎలాం టి ప్రమాదమూ ఉండదని నిర్ధారించారు. దీన్ని ఇంకా ఎవరిపైనా ప్రయోగించలేదు. కొదరు క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన కణుతులపై నిమ్స్ ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చాయని వైద్యులు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో పరిశోధనలు జరిపి రెండేళ్లలో ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

About the Author