పవన్ ‘ఇజం’ చదివితే మతిపోయిందన్న:యండమూరి
పవన్ కల్యాణ్ రెండు నిమిషాలు మాట్లాడాడంటే గనుక.. చాలా ఆవేశపూరితంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మనిషిలో ఫైర్ ఉన్నదని మనకు అనిపిస్తుంది. అదే ఆయన అయిదు నిమిషాలు మాట్లాడితే.. ఆయన ఏదో చెప్పదలచుకుంటున్నాడని సందేహం కలుగుతుంది. అదే పవన్ పది నిమిషాలు మాట్లాడాడంటే గనుక.. ఆయనకు రాజకీయాలు అంటే అసలు ఏమీ క్లారిటీ లేదని.. ఏదో ఉబుసుపోక ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు గనుక.. జనసేన అంటూ కాస్త హడావిడి చేస్తున్నాడని.. కాబోయే నాయకులతో నేస్తం కోసం అర్రులు చాస్తున్నాడని అనిపిస్తుంది. అలా.. పవన్‌కల్యాణ్ మాటల్లో బోలెడంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే కన్ఫ్యూజన్ ఆయన ఇటీవల విడుదల చేసిన సిద్ధాంత గ్రంథం ‘ఇజం’లో కూడా పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది తన పార్టీ సిద్ధాంతం అని జీవితాంతం దీన్ని మార్చబోయేది లేదని ఇజం ఆవిష్కరణ రోజున పవన్ కల్యాణ్ చాలా డాంబికంగా ప్రకటించారు. అయితే ఆయన రాజకీయ ఆగమనాన్ని బహుధా స్వాగతించిన రాంగోపాల్‌వర్మ లాంటివాళ్లే.. ఆ పుస్తకం చదివి… అసలు పవన్ ఏం చెప్పదలచుకుంటున్నాడు.. ఆయనకైనా అర్థమైందా అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు సీనియర్ రచయిత, విశ్లేషకుడు యండమూరి వీరేంద్రనాధ్ కూడా అదే అంటున్నారు. ఆయన శనివారం నాడు ఉదయం ఒక టీవీ ఛానెల్ లైవ్‌లో మాట్లాడుతూ.. పవన్ ఇజం పుస్తకాన్ని అయిదు పేజీలు చదివానని తనకు మతిపోయిందని సెలవిచ్చారు. అసలు ఆ పుస్తకం ద్వారా పవన్‌కల్యాణ్ ఏం చెప్పదలచుకుంటున్నాడో తనకు ఏమీ అర్థం కాలేదని మరనో మేధావి అనడం కొసమెరుపు.