Published On: Sun, Aug 25th, 2013

‘పర్యాటకుల స్వర్గం.. ఆడాళ్ల పాలిట నరకం’

Share This
Tags

భారతదేశం పర్యాటకులకు, సాహసికులకు స్వర్గధామమే గానీ, మహిళలకు మాత్రం నరకప్రాయమని చెబుతోంది ఓ అమెరికన్ విద్యార్థిని. అడుగడుగునా లైంగిక వేధింపులు, ఎక్కడ పడితే అక్కడ తడమడం లాంటి దారుణాలు అక్కడ ఉన్నాయని తెలిపింది. చికాగో యూనివర్సిటీకి చెందిన మైఖేలా క్రాస్ అనే అమ్మాయి రోజ్ చాస్మ్ అనే పేరుతో సీఎన్ఎన్ ఐరిపోర్ట్లో ఈ విషయాలన్నీ చాలా ధైర్యంగా రాసింది. భారత పర్యటనలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు, వాటివల్ల ఆ తర్వాత తనకు ఎదురైన మానసిక ఆందోళన ఫలితంగా తాను నడి రోడ్డుమీదే వెక్కివెక్కి ఏడవాల్సి వచ్చిందని తెలిపింది. ”ఇండియాః ద స్టోరీ యు నెవర్ వాంటెడ్ టు హియర్” అనే పేరుతో ఆమె తన ఆవేదన మొత్తాన్ని వెళ్లగక్కింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. బుధవారం ఉదయానికే ఈ కథనం పెట్టిన పేజీని ఏకంగా 8 లక్షల మంది చూసినట్లు సీఎన్ఎన్ తెలిపింది. దక్షిణాసియా వ్యవహారాలపై పరిశోధన కోసం వచ్చిన మైఖేలా క్రాస్ ఇక్కడ చేదు అనుభవాలు చవిచూసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘నిర్భయ’పై బస్సులో సామూహిక అత్యాచారం జరగడానికి కొద్దిరోజుల ముందే ఆమె భారతదేశం నుంచి తిరిగి తన స్వస్థలానికి వెళ్లిపోయింది.

తనతో పాటు తన సహాధ్యాయులకు ఎదురైన అనుభవాలు నిజమేనన్న విషయం ఈ సంఘటనతో అందరికీ తెలిసిందని వ్యాఖ్యానించింది. 48 గంటల్లో రెండు సార్లు తనపై అత్యాచార యత్నం జరగడంతో ఇక తట్టుకోలేని పరిస్థితుల్లోనే తాను యూనివర్సిటీ అధ్యాపకులకు ఈ విషయాలన్నీ చెప్పానంది. అమెరికాకు తిరిగొచ్చిన తర్వాత భారత్ గురించి ఏం చెప్పాలో తెలియని విచిత్ర పరిస్థితిని ఆమె ఎదుర్కొంది. ఒకవైపు చూస్తే ప్రకృతి అందాలు, సాంస్కృతిక వైభవం ఇవన్నీ ఉన్నాయి. మరోవైపు చూస్తే ఆడవారిపై వేధింపులూ ఉన్నాయి. దీంతో ఆమె ఒకరకమైన ఆవేదనకు గురైంది. ఆమె రాసిన కథనంలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి….

”మొదటి రోజు రాత్రి మేం పుణె నగరంలో దిగాం. అక్కడ గణేశ్ ఉత్సవంలో డాన్సులు చేశాం. అక్కడితో వదిలేయాలా? కాదు… ఎందుకంటే, మేం డాన్సు చేయడం మొదలుపెట్టిన కొద్ది సేపటికే అక్కడి ఉత్సవం ఆగిపోయింది. కొంతమంది మగాళ్లు మా చుట్టూ చేరి మా డాన్సులను వీడియో తీయడం మొదలుపెట్టారు. అక్కడి బజారులో ఉన్న అందమైన చీరలు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి. అవి చూద్దామని వెళ్లినా అక్కడి మగాళ్లు మమ్మల్నే చూస్తూ నిలుచున్నారు. మమ్మల్ని కావాలని తోసేస్తూ.. చేతులతో చెప్పరాని చోట్లల్లా నొక్కుతూ ఉన్నారు. భారతదేశంలో మేం కొన్న చెప్పులు చూసి అమెరికాలో అందరూ ఎంతో మెచ్చుకున్నారు. వాటి గురించి మేం చెప్పాలా… లేక అవి కొనేటప్పుడు 45 నిమిషాల పాటు నన్నే వేధిస్తూ ఉన్న ఓ మగాడి గురించి చెప్పాలా? అంతమంది జనం మధ్యలో నేను వాడిని మొహం మీద గట్టిగా అరిచేవరకు నన్ను వదల్లేదు. భారతదేశంలో ఆడాళ్లు ఎలా బతుకుతున్నారో మరి! నేనక్కడ మూడు నెలల పాటు ఉన్నాను. పర్యాటకులకు అయితే భారతదేశం స్వర్గమే గానీ, మహిళలకు మాత్రం ప్రత్యక్ష నరకం. నాకు చెప్పలేనన్ని లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. అయినా కలలో కూడా ఊహించలేనన్ని సాహసాలు చేయగలిగాను. ఒక్కోసారి పీడకలలు వచ్చినా, చాలా మంచి అనుభవాలూ ఉన్నాయి”.

మైఖేలా క్రాస్ చికాగో యూనివర్సిటీలోనే చదువుతున్నట్లు యూనివర్సిటీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు గానీ, ఆమె మానసిక స్థితి గురించి వ్యాఖ్యానించడానికి మాత్రం నిరాకరించారు. స్వదేశంతో పాటు వేరే దేశాల్లో కూడా తమ విద్యార్థుల భద్రతకు యూనివర్సిటీ కట్టుబడి ఉందన్నారు.

India-tour

About the Author