Published On: Tue, Jun 25th, 2013

విపత్తు మిగిల్చిన విషాదం …..

Share This
Tags

పగబట్టిన ప్రకృతి…ప్రకృతి వికృత రూపందాల్చింది… ప్రళయం విలయతాడవించింది….పర్యవసానంగా ప్రపంచ ప్రఖ్యాత పెరుగాంచిన ప్రసిద్ద  స్థలం మరు భూమిగా మారిపోయింది ఇది ఉత్తరాఖండ్ లో విపత్తు సృష్టించిన ఘోరం …. ఒకరా ఇద్దరా ….పదులా వందల….వేళల్లో మృతులు..అదే స్తాయిలో భయకంపితులు …ఏ నిమిషం లో ఏమి జరుగుతుందో తెలియని ఆందోళన దేశవ్యాప్తంగా కోటాను కోట్లమందికి కదిలించిన విపత్కర పరిస్తితి… తీర్ధయత్రలో జరిగిన ఘోరమిది…

భయపడిందంతా జరిగింది. మరుభూమిగా మారిన మంచుకొండల్లో వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పెను ఉత్పాతం నుంచి బతికి బయటపడి వారం రోజులుగా సాయం కోసం ఎదురుచూస్తున్న పదివేల మంది పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఉత్తరాఖండ్‌లో దాదాపు పది రోజుల కిందట భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన పర్వత ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. మధ్యమధ్యలో కుండపోత ఫలితంగా మళ్లీ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో సోమవారం సైనిక బృందాలు చేపడుతున్న సహాయ చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. హెలికాప్టర్లు, రోడ్డు మార్గాల్లో సహాయ చర్యలు నిలిచిపోయాయి. అప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తేలికపాటి హెలికాప్టర్లను తిప్పుతూ బద్రీనాథ్, గంగోత్రి ప్రాంతాల నుంచి కేవలం వేయి మందిని మాత్రమే రక్షించగలిగారు. ఇంకా పది వేల మందికి పైగా పర్యాటకులు కొండ కోనల్లోనే చిక్కుకుపోయి ఉన్నారు. రానున్న మూడు రోజుల్లో వర్షాలు మరింత తీవ్రమవుతాయని వాతావరణ శాఖ చెప్తోంది. అంటే మూడు రోజుల పాటు సహాయ చర్యలు చేపట్టే అవకాశం లేనట్లేనని సైనికాధికారులు చెప్తున్నారు. దీంతో కొండకోనల్లో చిక్కుకుపోయి ఉన్న దాదాపు పది వేల మంది ప్రాణాలు ఇప్పుడిక ప్రకృతి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉన్నాయి. వీరిలో తెలుగువారు కూడా చాలా మంది ఉన్నారు.

ప్రకృతి ఇలా పగబట్టినట్లు తీర్థయాత్రికులను వేటాడటం కనీవినీ ఎరుగనిది. మనిషికి ఏ రోజైనా ఆపద రావచ్చు. కానీ.. మంచు కొండల్లో చిక్కుకుపోయిన పర్యాటకుల దయనీయ స్థితిని చూస్తే.. ఇది ఇటు మనిషి, అటు ప్రకృతి దేవతలు కుట్రపన్ని దాడిచేస్తున్నట్లు కనిపిస్తోంది. వారి బంధుమిత్రులను ఇప్పటికే ఒక దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు మిగిలిన వారిని కూడా వరుణ దేవుడు వేటాడుతున్నాడు. వీరిని రక్షించే సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న సైనికాధికారులు సైతం ప్రస్తుతం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ‘‘చిక్కుకుపోయివున్న పర్యాటకులను రక్షించటానికి హెలికాప్టర్లను పంపించలేకపోతే.. పదాతి బృందాలను పంపాల్సి ఉంటుంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ప్రాంతాల్లో చిక్కుబడి ఉన్నవారిని రక్షించేందుకు ఇప్పుడు అదే పనిచేస్తున్నాం. కానీ అది చాలా క్లిష్టంగా ఉంది. ఈ ప్రక్రియలో మేం కూడా గాయాలపాలవుతున్నాం’’ అని ఒక సైనికాధికారి పేర్కొన్నారు.

మళ్లీ విరుగుతున్న కొండచరియలు…

రాష్ట్రంలో పర్వత ప్రాంతాలైన చమోలి, ధరసు, పౌరి జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ కూడా వర్షాల్లో తడిసి ముద్దయింది. రుద్రప్రయాగ్‌లో మట్టిపెళ్లలు జారిపోవటం, బ్రదీనాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గం కూడా మూసుకుపోయింది. దట్టమైన మబ్బులు, భారీ వర్షాల కారణంగా పెద్ద హెలికాప్టర్లను నడిపే వీలు లేకపోవటంతో వాటిని నిలిపివేశారు. చిన్నవైన తేలికపాటి హెలికాప్టర్ల సాయంతో స్వల్పంగా సహాయ చర్యలు కొనసాగించారు. బద్రీనాథ్ ప్రాంతంలో దాదాపు 5,000 మంది చిక్కుకుపోయి ఉండగా సోమవారం ఆరు సీట్లున్న హెలికాప్టర్ల ద్వారా కేవలం 164 మందిని మాత్రమే రక్షించి జోషిమఠ్‌కు తరలించగలిగారు. అలాగే హార్షిల్, మనేరి, భట్వారీ ప్రాంతాల నుంచి మరో 830 మందిని రక్షించినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుభాష్‌కుమార్ డెహ్రాడూన్‌లో మీడియాకు తెలిపారు. తాజాగా పౌరి జిల్లాలో పైథాని కసాబా ప్రాంతంలో ఉన్న ములాన్ అనే గ్రామంలో కుండపోత వర్షం కురవటంతో చాలా ఇళ్లు కూలిపోయాయని వార్తలు వచ్చాయి. అయితే ఎవరైనా మరణించారా అన్నది వెంటనే తెలియరాలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల నుంచి సోమవారం 3,675 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వంలోని మీడియాపై మంత్రివర్గ బృందం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఇప్పటివరకూ మొత్తం ఎందరిని రక్షించారు? ఇంకా ఎంతమంది చిక్కుకుపోయే ఉన్నారు? అనే విషయాలను ఈ ప్రకటనలో ప్రస్తావించలేదు.

28 నాటికి వాతావరణం మెరుగయ్యే అవకాశం…

బద్రీనాథ్ ప్రాంతంలో దాదాపు 5,000 మంది పర్యాటకులు ఇంకా చిక్కుకుపోయి ఉన్నారని సైనికాధికారులు పేర్కొన్నారు. హార్షిల్‌లో దాదాపు 1,500 మంది, ధరేలిలో 50 మంది, ఝాలాలో 60 మంది సహాయ చర్యల కోసం నిరీక్షిస్తున్నారని తెలిపింది. కేదార్‌నాథ్‌లో దాదాపు 50 మంది సాధువులు ఇంకా చిక్కుకుని ఉన్నారని ఐటీబీపీ చెప్పింది. వీరందరినీ రక్షించేందుకు సహాయ చర్యలను పునఃప్రారంభించటానికి కనీసం మూడు రోజుల సమయం పడుతుందని ఐటీబీపీ డెరైక్టర్ జనరల్ అజయ్ చద్దా ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు.

కేదార్‌నాథ్ ప్రాంతంలో ఉన్న వారిలో చాలా మందిని రక్షించి తరలించామని.. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిల్లో ఇంకా కొందరు చిక్కుబడి ఉన్నారని ఆయన తెలిపారు. వాతావరణం ఈ నెల 28వ తేదీకి మెరుగుపడుతుందని చెప్తున్నారని.. హెలికాప్టర్లు తిరగటం మొదలైతే పర్యాటకులను రక్షించే కార్యక్రమాన్ని పునరిద్ధరించవచ్చని ఆయన పేర్కొన్నారు. కేదార్‌నాథ్, భైరవ్ చొట్టి, జంగిల్ చొట్టిలకు మారుమూల ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా పర్యాటకులు చిక్కుకుపోయి ఉన్నారా అనేది గుర్తించేందుకు మానవ రహిత విమానం ‘నేత్ర’ ద్వారా గాలింపు జరుపుతున్నామని చద్దా తెలిపారు. మరో రెండు ‘నేత్ర’ విమానాలు అందించాలని కోరామని.. వాతావరణం మెరుగుపడగానే వాటిని కూడా రంగంలోకి దించుతామని చెప్పారు. అలాగే కాలిబాటన కూడా సిబ్బంది గాలిస్తున్నారన్నారు. కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ ప్రాంతంలోని గ్రామాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్నారు.

ప్రాణవాయువు అందక సతమతం…

కొండకోనల్లో చిక్కుకుపోయివున్న పర్యాటకులకు సహాయ బృందాల పుణ్యమాని ప్రస్తుతం ఆహారం, తాగునీరు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎముకలు కొరికే చలికి వారు తాళలేకపోతున్నారు. మరోవైపు గాలిలో ప్రాణవాయువు (ఆక్సిజన్) స్థాయి తీవ్రంగా పడిపోతోంది. ప్రత్యేకించి రాత్రిపూట ఊపిరి తీసుకోవటం చాలా కష్టంగా ఉందని ఆదివారం రాత్రి సహాయబృందాల సాయంతో సురక్షిత ప్రాంతానికి చేరుకున్న వినోద్‌కటియార్ అనే పర్యాటకుడు చెప్పాడు. భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ.. ఎత్తై కొండల మధ్య తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో చిక్కుకుని అనారోగ్యం పాలైన బాధితుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేయకపోవటం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. పర్యాటకులను రక్షించిన వెంటనే వారికి ఆక్సిజన్ అందించటం ఎంతో కీలకమని సైనికాధికారులే చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో చిక్కుకుపోయివున్న పర్యాటకుల జీవన్మరణాల మధ్య సన్నని గీత క్రమంగా చెరిగిపోతూ ఉంది.

చావు త్వరగా రావాలని కోరుకుంటున్నారు…

‘‘మీ తెలుగు వాళ్లు చాలా మంది ఇంకా బతికే ఉన్నారు. వాళ్లు నడిచి కిందకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు’’ అని ఒడిశాకు చెందిన శ్రీమోయ్‌కార్ అనే పర్యాటకుడు ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు. అతడు ఆదివారం రాత్రి ఎంతో కష్టపడి నడుచుకుంటూ కిందవరకూ వచ్చాడు. ఇంకా వందలాది మంది పర్యాటకులు కేదార్‌నాథ్ ప్రాంతం నుంచి కనీసం సగం దూరంలో ఉన్న రాంబారా వరకూ నడుచుకుంటూ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ అది ఎంతో కష్టమని, ప్రమాదకరమని ఆయన వెల్లడించారు. ‘‘దారంతా బురదమయంగా ఉంది. అడుగేస్తే జారిపోతోంది. ఆర్థరైటిస్, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు ఆశలు వదిలేసుకున్నారు. చావు ఎంత త్వరగా వస్తే అంత బాగుండని వారు కోరుకుంటున్నారు.

చనిపోయే ముందు ఇంత నరకయాతన పడలేకపోతున్నామని కన్నీటిపర్యంతమవుతున్నారు’’ అని అతడు ఆవేదన వ్యక్తంచేశాడు. అయితే.. బద్రీనాథ్‌లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అక్కడ చిక్కుబడి ఉన్నవారు సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలంటే దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం అత్యంత ప్రమాదభరితమైన మార్గంలో నడుస్తూ వెళ్లాల్సిందే. హేమకుండ్‌సాహిబ్ దగ్గరి పరిస్థితి కూడా ఇలానే ఉంది. గోవింద్‌ఘాట్ వద్ద చిక్కుబడిన పర్యాటకులను నది దాటించేందుకు సైనిక బృందాలు తాత్కాలిక వంతెనను ఏర్పాటుచేసినప్పటికీ.. అక్కడున్న వారెవరూ కనీసం సైనికుల సాయంతోనైనా నడవగలిగే పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపించటంలేదు.

కేదార్‌నాథ్‌లో ఖననమూ మొదలుకాలేదు…

కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ పడివున్న మృతదేహాలను సంప్రదాయబద్ధంగా ఖననం చేయాలన్న ప్రణాళికను కూడా.. ఆ ప్రాంతంలో తెరిపిలేని వర్షాల కారణంగా సోమవారం అమలు చేయలేకపోయామని ఉత్తరాఖండ్ సీఎస్ సుభాష్‌కుమార్ తెలిపారు. ఈ విపత్తులో మృతుల సంఖ్య ఎంతని అడగగా.. ఆయన ఎలాంటి సంఖ్యా చెప్పలేదు. అంతకుముందు ఉన్నంతేనని మాత్రం బదులిచ్చారు. ఉత్తరాఖండ్ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య వేయి దాటిపోవచ్చని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సోమవారం మీడియాతో పేర్కొన్నారు.

అయితే.. ఐటీబీపీ సిబ్బంది ఇప్పటివరకూ 125 మృతదేహాలను వెలికితీయగా, ఎన్‌డీఆర్‌ఎఫ్ సుమారు 400 మృతదేహాలను వెలికి తీసిందని అజయ్ చద్దా చెప్పటం గమనార్హం. ఒకవైపు సమయం గడిచిపోతూ ఉంటే.. గుట్టలుగా పడివున్న మృతదేహాలను నదీ ప్రవాహంలో పడేయటానికి సహాయ బృందాల సిబ్బంది, ఇతరులు ప్రయత్నిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పనిపూర్తి చేసే చర్యలు తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితుల వల్లే ఇలా చేయాల్సి వస్తోందని వారు చెప్తున్నారు. ఇదిలావుంటే.. ఉత్తరాఖండ్ వరదల్లో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని నదుల్లో కూడా బయటపడుతున్నాయి. సోమవారం బిజ్నూర్, బులంద్‌షహర్ జిల్లాల్లోని నదుల్లో 11 మృతదేహాలు లభ్యమయ్యాయని రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఉత్తరాఖండ్ చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన యూపీ వాసుల్లో దాదాపు వేయి మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని ప్రభుత్వ అధికారులు చెప్పారు.

About the Author