నెత్తురోడిన ఈజిప్టు
భద్రతా బలగాల కాల్పుల్లో 120 మంది మృతి
రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న ఈజిప్టులో నెత్తుటేర్లు పారుతున్నాయి. శుక్ర, శనివారాల్లో దేశవ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో వందమందికి పైగా మృతిచెందారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీకి తిరిగి అధ్యక్ష పదవి అప్పగించాలని కైరోలో శనివారం వేకువజామున ఆందోళన చేస్తున్న ఆయన మద్దతుదారులపై సైనికులు జరిపిన కాల్పుల్లో 120 మంది మృతిచెందారని ముర్సీ నేతృత్వంలోని ముస్లిం బ్రదర్‌హుడ్ తెలిపింది. కాల్పుల్లో 4,500 మందికి పైగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వెల్లడించింది.
అయితే ఘర్షణల్లో 46 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం అలెగ్జాండ్రియా నగరంలో 14 ఏళ్ల బాలుడు సహా 8 మంది, శనివారం కైరోలో రబా ఎల్ అదవీ స్క్వేర్‌లో 38 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏడుగురు పోలీసులు సహా 700 మందికి పైగా గాయపడ్డారని చెప్పింది. ఆయుధాలు కలిగి ఉన్న 53 మంది ముస్లిం బ్రదర్‌హుడ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేసినట్లు మీడియా తెలిపింది. మరోపక్క.. ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫతా ఎల్ సిసీ పిలుపుపై ఆర్మీ మద్దతుదారులు వేలాది మంది కైరోలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ నెల 3న ఆర్మీ ముర్సీని గద్దెదింపడం, అప్పటినుంచి ఆయన అనుచరులకు, ఆర్మీ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు జరుగుతుండడం తెలిసిందే.