నవంబర్ లేదా డిసెంబర్‌లో సివిల్స్ మెయిన్స్
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో జరగనున్నాయి. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించి ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో తప్పనిసరి ఇంగ్లిష్ నిబంధనను కమిషన్ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈసారి కూడా భారతీయ భాషల్లోనూ, ఇంగ్లిష్‌లోనూ రెండు అర్హత పేపర్లు ఉంటాయని పేర్కొంది. అర్హత పేపర్లలో వచ్చే మార్కులను ర్యాంకులు నిర్ణయించడంలో పరిగణనలోకి తీసుకోరు. కాగా, ఈ ఏడాది మే 26న నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి మార్పూలూ లేవని యూపీఎస్సీ స్పష్టంచేసింది. ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే గడువు వచ్చేనెల 4వ తేదీతో ముగియనుంది