Published On: Sat, Dec 6th, 2014

నల్లధనంపై బీజేపీ నేతల స్వరం మారుతోందా..?!

Share This
Tags

మోడీ చెప్పిన వందరోజులు గడిచి, మరో వంద రోజులు దాటబోతున్నాయి. కానీ, ఫలితం లేదు. మాటలు కోటలు దాటాయి. కానీ చేతలు కాగితాల్లోనే ఆగిపోయాయి. అసలు నల్లధనాన్ని వెలికితీయటంలో సర్కారుకు నిజాయితీ ఉందా? పెద్ద చేపల పేర్లు బయటికొస్తాయా? దీనిపై బిజెపీ నేతల స్వరం మారుతోందా? భారత్ లో స్విస్ రాయబారి కామెంట్స్ ఏ సంకేతాలిస్తున్నాయి?
కలకలం రేపిన స్విట్జర్లాండ్ రాయబారి వ్యాఖ్యలు…
స్విట్జర్లాండ్ రాయబారి మొత్తానికి చాలా కలకలమే రేపారు. మన దేశం నుంచి నల్లడబ్బంతా మూటగట్టుకుని స్విట్జర్లాండ్ కి చెక్కేసిందని మనం అనుకుంటున్నాం కదా? మన దేశం బడాబాబులు దొంగచాటుగా బ్లాక్ మనీని స్విస్ బ్యాంకుల్లో కుమ్మరించారని మనకు బోలెడంత ఇన్ ఫర్మేషనే వుంది కదా. ఏ స్విస్ బ్యాంకుని తట్టినా కుప్పులు తెప్పలుగా భారతదేశం నల్లధనం బయటపడుతుందని మన కష్టాలు కొంచెమైనా తీరతాయని మనం కలలు కంటున్నాం కదా. కలలేం కర్మ. అది నిజం చేస్తామని కదా మన సరికొత్త పాలకులు ఎన్నికల వాగ్దానాలుచేసి గద్దెనెక్కారు? అదిగో లిస్టన్నారు. ఇదిగో దొంగలు దొరికారన్నారు. ఇంకేముంది స్విస్ బ్యాంకులు ఇనప తలుపులు బద్దలు కొట్టుకుని వేల కోట్లరూపాయలు స్వదేశయానం చేస్తాయని మురిసిపోతున్నాం కదా. ఓడల్లో తెస్తారో, విమానాల్లో తెస్తారో చూద్దామని ఫుల్ టెన్షన్ తో ఎదురు తెన్నులు చూస్తున్నాం కదా. అంతా నిజమే మరి . కాని మనదేశంలో మకాం వేసిన స్విట్జర్లాండ్ రాయబారి మాత్రం అబ్బ..ఆశ ..దోసె..అప్పడం అని తెగ ఎటకారం చేసేశారు. ఆయన గారి మాటలు వింటే అసలు స్విస్ బ్యాంకుల్లో మన దేశానికి చెందిన నల్లధనం వుందా లేదా అన్న అనుమానం రాకమానదు.
నల్లధనంపై నిరాశను నింపిన రాయబారి వ్యాఖ్యలు…
ప్రపంచంలో దొంగ డబ్బంతా వాళ్ళదేశంలోనే మకాం పెడుతుందని అనవసరంగా అంతా ఆడిపోసుకుంటున్నట్టు సదరు రాయబారిగారు అమాయకంగా, కాదుకాదు, చాలా తెలివిగా, ఇంకా చెప్పాలంటే బాగా దబాయిస్తూ కొట్టిపారేశారు. మన వాళ్ళు తయారు చేసిన జాబితానే తప్పుపట్టారు. దేశంలో మూలుగుతున్న నల్లడబ్బును కనుక్కోలేని చచ్చుదద్దమ్మలు మన నాయకులు అన్నట్టు అన్యాపదేశంగా చాలా లైట్ గా కామెంట్ చేసేశారు. ఆయన ప్రముఖ ఆంగ్లదిన పత్రిక ది హిందూ కిచ్చిన ఇంటర్వ్యూలో చాలా చాలానే మాట్లాడేశారు. అదంతా వింటే నల్లడబ్బు కథ కంచికేనా అన్న అనుమానం కలకగక మానదు సుమా. మన పాలకులు చెప్తున్న మాటల మీద, వారు బయటపెడుతున్న నల్లధనవంతుల జాబితాల మీద చాలా సందేహాలు రేకెత్తక మానవు. అన్నింటికంటే అసలు నల్లడబ్బును మనవాళ్ళు ఎలా దేశానికి తరలించగలరబ్బా అన్న ఆందోళన కూడా కలుగుతుంది మరి. సదరు రాయబారి గారు సెలవిచ్చిన విషయాలు అలా వున్నాయి మరి.
ఊదర గొట్టిన మోడీ సర్కార్…
వీలుచిక్కినప్పుడల్లా ఎన్నికల ప్రచారంలో, అంతకుముందూ ఇదే మాట పదే పదే చెప్పి వాయగొట్టారు. మన సొమ్మంతా విదేశాల్లో మూలుగుతోంది. నల్లకుబేరులు స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టారు. దాన్ని వెనక్కి తెస్తాం అని, అది కూడా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అనే మాట చాలాసార్లు చెప్పారు. కానీ ఆ వందరోజులు దాటి మరో వందరోజులు కూడా సమీపిస్తోంది. మరి ఆ బ్లాక్ మనీ సంగతేంటి? ఆ మధ్య వందరోజుల సినిమా ముగిసింది కదా! అని ప్రశ్నలు వెల్లువెత్తిన టైమ్ లో, ఇదిగో బైటపెడుతున్నామంటూ ఓ చిట్టాని చూపెట్టారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్నారంటూ ఓ నాలుగు పేర్లు బైటపెట్టారు. తీరా చూస్తే కొండను తవ్వి ఎలకలను పడుతున్నారా అనే సందేహాలొచ్చాయి. అప్పట్లో అన్ని మాటలు చెప్పిన బిజెపీ నేతలు ఇప్పుడు స్విస్ రాయబారి తాజా కామెంట్స్ కు ఏమంటారో మరి.
ఆధారాలు లేకుండా ఏం చేయలేం : స్విస్ రాయబారి…
ఇంతకాలం చాలా హైప్ లో బ్లాక్ మనీ గురించి సాగిన డిస్కషన్ ని నాలుగు ముక్కల్లో తేల్చిపడేశారాయన. ఆధారాలు లేకుండా ఏం చేయలేమని, శ్రద్ధ లేకుండా నల్లధనం పని ఖతం కాదని చాలా మాటలు చెప్పారు. అవన్నీ ఏ ఉద్దేశ్యంతో చెప్పినా, ఎవర్ని కాపాడటానికి చెప్పినా, సప్తసముద్రాల ఆవల ఉన్నా వదిలే ప్రసక్తే లేదని ఒకప్పుడు చెప్పిన మోడీ, రాజ్ నాథ్ లు ఇప్పుడేమంటారు. దేశంలో అందరికీ తలా 15,20 లక్షలు పంచుతామని చెప్పిన మాటలకు ఇప్పుడేం సమాధానం చెప్తారో మరి.
బ్లాక్ మనీ వెనక్కి తేవడం అంత సులువు కాదు…
ఫ్లైటెక్కి దేశాలు చుట్టేసినంత లేక చీపురు పట్టి వీధులు ఊడ్చినంత వీజీ కాదు బ్లాక్ మనీ వెనక్కి తేవటం, నల్ల బాబుల పేర్లు బైటపెట్టడం? అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్విట్జర్లాండ్ రాయబారి మాటలతో ఈ విషయం మరింత స్పష్టమవుతోంది. గాలిమాటో, తప్పించుకునో మాటో ఏదైనా కానివ్వండి స్విస్ రాయబారి చెప్పినట్టు నల్లధనం వెలికి తీయాలంటే చాలా శ్రద్ధ, చిత్తశుద్ధి అవసరం. ఇది మాత్రం క్లియర్.
స్వరం మార్చిన మోడీ సర్కార్…
అధికారంలోకి వచ్చాక మోడీ సర్కార్ స్వరం మారింది. ఎన్నికల ముందటి ఉద్రేకమూ చల్లారింది. యూపీఏ సర్కారు ఎప్పటినుంచో పాడుతున్న పాటే మళ్లీ మళ్లీ రికార్డు వేయటం మొదలు పెట్టింది మోడీ సర్కారు. నల్లధన కుబేరుల పేర్లు బయటపెట్టడానికి ఆయా దేశాలతో చేసుకున్న పన్ను ఒప్పందాలు అడ్డొస్తున్నాయని చెప్తూ వచ్చింది. అంతే కాదు, అభియోగాలు దాఖలయ్యాకే పేర్లు బైటపెడతామనీ చెప్పింది. మొత్తానికి ఈ మేటర్ లో యూపీఏ అయినా, ఎన్ డీఏ అయినా మన్మోహన్ అయినా, మోడీ అయినా నో డిఫరెన్స్ అని తేలిపోయింది. చివరికి కోర్టు డెడ్ లైన్ పెట్టాక కానీ, విషయం ముందుకు వెళ్లలేదు.
ఉభయసభలో బిజెపి ఇరకాటం…
నిన్నటికి నిన్న ఉభయసభల్లో విపక్షాల ప్రశ్నలకు సర్కారు దగ్గర సమాధానం లేకుండాపోయింది. అరుణ్ జైట్లీ ప్రశ్నల వర్షానికి నిలబడలేకపోయారు. ఆఖరికి బిజెపి నేతలకు మాటమార్చడం, వక్రభాష్యాలు చెప్పకతప్పలేదు. వెంకయ్య నాయుడు వంద రోజుల్లో తెస్తామని కాదు, చర్యలు తీసుకుంటామన్నాం అని అడ్డంగా బుకాయించేశారు.
బ్లాక్ మనీ ఎలా తరలిపోతోంది?
25లక్షల కోట్లు. అవును అక్షరాలా 25 లక్షల కోట్లే. విదేశాల్లో మూలుగుతున్న భారతీయుల బ్లాక్ మనీ. ఈ దేశపు వనరులనుండి, ఇక్కడి సౌకర్యాలనుండి అడ్డంగా సంపాదించిన అక్రమ సొత్తు అది. ఇది రూ.75 లక్షల కోట్లుంటుందని బిజెపి నాయకులే గతంలో సెలవిచ్చారు. నల్లధనం మేటలు వేసిన దేశాల్లో మనదేశం అయిదో స్థానంలో ఉంది. ఈ సొమ్మంతా ఎక్కడిది? ఇది కేవలం పన్నుల ఎగవేత ఫలితమా? విదేశీ రహస్య లాకర్లలో గుట్టలుగా పేరుకున్న నల్లధనం కేవలం పన్నుల ఎగవేత ఫలితం కాదని కామన్ సెన్సున్న ఏ ఒక్కరికైనా అర్ధమవుతుంది. రాజకీయ నాయకులు, అధికారులు, కార్పొరేట్లు, దళారీలు కుమ్మక్కై అందినకాడికి ప్రజల సొమ్మును దండుకుంటూ, ప్రభుత్వ భారీ కాంట్రాక్టుల నుంచి పెద్ద మొత్తాల్లో వెనకేసే ముడుపులు, లంచాలు, ఇంకా రకరకాల చీకటి మార్గాలలో కొల్లగొట్టే మూటలే ఈ నల్లధనం. మరి వీటిని ఇక్కడ బ్యాంకుల్లోనో, ఇంట్లో లాకర్లోనో, బినామీ పేర్లతోనో దాచటం కంటే, విదేశీ బ్యాంకుల్లో ఓ ఎకౌంట్ ఓపెన్ చేసి పారేస్తే సింపుల్ అండ్ సెక్యూర్డ్ అన్నమాటే. ఇదే నికృష్టమైన పనికి దిగిన బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు ఎందరో ఉన్నారని అంచనాలు చెప్తున్నాయి
ఎన్నికల్లో మంచినీళ్ళలా వేలకోట్ల డబ్బు….
అంతెందుకు ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌ సహా వివిధ పార్టీలు చేసే ఎన్నికల వ్యయం ఎక్కడిది? లెక్కా పత్రం లేకుండా ఎన్నికల్లో విరజిమ్మే నోట్లుకట్టలు ఎవడబ్బసొమ్ము? ఇదంతా రాజకీయ అవినీతిని మరింతగా పెంచి పోషిస్తున్న నల్లధనం కాదా? గత ఎన్నికల్లో ప్రచారానికి కార్పొరేట్‌ శక్తుల అండదండలతో మోడీ నాయకత్వంలోని బిజెపి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతిని చూస్తే ఇక రాజకీయాలు నల్లధనం సృష్టించిన విషవలయంలో ఎంత దారుణంగా ఇరుక్కున్నదీ అర్ధమవుతుంది. ఈ సంబంధాలే నల్లధనం వెలికితీతలో సర్కారు నిజాయితీపై అనుమానాలు పెంచుతున్నాయి. అంతెందుకు, నల్లధనం దాచుకున్నవారి పేర్లు బయటపెట్టడానికి తాము వ్యతిరేకమనీ, అందువల్ల తీవ్ర పర్యవసానాలు ఉంటాయనీ భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య సిగ్గూఎగ్గూ లేకుండా హెచ్చరించింది అంటే విషయం ఎక్కడిదాకా వచ్చిందో తెలుస్తుంది. ఇలాంటి పరిణామాలే నల్లధనం వెలికి తీయటాన్ని ప్రభుత్వాలకు సవాల్ గా మారుస్తున్నాయి.
నల్లధనాన్ని వెనక్కుతేవటం సాధ్యమా?
నల్ల డబ్బు కథలు 1947 నుండి వింటున్నాం కానీ, ఇంకా కంచికి చేరలేదు. బ్లాక్‌మనీ ముచ్చట వినడమే కానీ ఎవరూ వెనక్కు రప్పించలేకపోయారు. నల్లధనం నిగ్గు తేల్చాలని సుప్రీం కోర్టు 2011లోనే ఆదేశించింది. కానీ, మూడేళ్లు గడచినా ప్రభుత్వాలు సాధించిందేం లేదు. విదేశీ బ్యాంకుల్లోని రహస్య ఖాతాల్లో గుట్టలు గుట్టలుగా దొంగ సొమ్ము దాచుకున్నవారిలో మనోళ్లే టాపని వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే అప్పట్లో ప్రకటించాడు. కావాలంటే, ఆ ఖాతాల వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్పాడు. కానీ, నాటి యూపిఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఇప్పుడు ఎన్డీఏ కూడా అంతకంటే తక్కువేం తినలేదు. మనదేశానికి అప్పుల రికార్డు ఎంత పాతతో, బ్లాక్ మనీ చరిత్ర కూడా అంతే పాతది. బ్లాక్‌మనీని రాబట్టుకోగలిగితే అప్పూ ఉండదు, దేశంలో ఆకలి దప్పులూ ఉండవు. పేద, మధ్య తరగతి వారి బతుకులు సుబ్బరంగా బాగుచేయొచ్చు. ఇవన్నీ సాక్షాత్తూ ప్రధాని సెలవిచ్చిన మాటలే. కానీ, ఈ నల్లడబ్బు వెనక్కు తెచ్చే విషయంలో, విదేశీ బ్యాంకుల్లో సొమ్మున్న బడాబాబుల పేర్లు బయటపెట్టే విషయంలో సర్కారులో పారదర్శకత ఎందుకు లేదు? కోర్టు మొట్టికాయలు వేస్తే కానీ, జాబితా ఇవ్వని పరిస్థితి నెలకొంది. మొదటి లిస్టు, రెండో లిస్టు అంటూ ఇప్పటికే పుణ్యకాలం గడిచిపోతోంది. ఇక చర్యలు తీసుకునేదెపుడు? ఆయా దేశాల్లోని చట్టాల వల్లనే బ్లాక్‌మనీని తీసుకురాలేకపోతున్నట్టు మన ప్రభుత్వాలు కల్లబొల్లి కబుర్లు చెపుతున్నాయి. అక్కడ చట్టాలు కస్టమర్లకు అనుకూలంగా ఉండటం వల్లనే ఆ దేశాల్లో సొమ్ములు దాయటం నిజం కావచ్చు. కానీ, సరిహద్దులు దాటి పోతున్న సొమ్మెంత? అది ఎక్కడ దాస్తున్నారనే విషయంపై సర్కారు ఓ క్లారిటీ ఉండాలి. ఆ దేశాలతో ఒప్పందాలూ ఉండాలి. సరైన ఆధారాలతో పారదర్శకంగా, చిత్తశుద్ధితో ఉంటే తప్ప బ్లాక్ మనీ వెలికి తీయటం కష్టమనటంలో సందేహం లేదు. మరి మోడీ సర్కారు ఎన్ని వందల రోజులకు ఆ పని చేస్తుందో వేచి చూడాలి.
మోడీ సర్కారు నిజాయితీని నిరూపించుకోవాలి
బ్లాక్ మనీ పెరగడానికి ప్రధాన కారణం అవినీతి. ఓ దేశంలో పకడ్బందీగా ఆర్థికనేరం చేయడం, మరో దేశంలోకి పెట్టుబడుల విస్తరణ, మూడో దేశంలోని బ్యాంకుల్లో ఆ డబ్బు పదిలం చేసుకోవడం ఇదంతా ఓ విషవలయంగానే ఉంది. మోడీ ప్రభుత్వంలో కప్పదాట్లు, సాచివేత ధోరణే తప్ప దృఢసంకల్పం కనిపించడంలేదు. తమ ఎన్నికల వాగ్దానం పట్ల తమకు నిబద్ధతే ఉంటే, నల్లధనం వంటి తీవ్ర సమస్యను మామూలు పన్నుల సమస్యగా చిత్రించకుండా తిమింగలాలు, మొసళ్లతో సహా అందరి పేర్లూ బయటపెట్టాలి. దర్యాప్తును, అభియోగాల దాఖలును వేగవంతం చేయాలి. ఉద్రేకంగా నల్లధనం వెనక్కు తెస్తాం అని చెప్పటం కాదు. ఆ చిట్టా బైటపెట్టి నిజాయితీ నిరూపించుకోవాలి. ఓటేసి ఈ సర్కారును గెలిపించిన ప్రతి పౌరుడు ఆశిస్తున్నది ఇదే. american dollars in the hands

american dollars in the hands

About the Author