Published On: Fri, Apr 24th, 2015

దోచేయ్‌ రివ్యూ……

Share This
Tags

నాగ చైతన్య కధానాయకునిగా తెరకెక్కిన చిత్రం దోచేయ్,చైతన్య ఈ మద్య కాలం లో సినిమాలు ఎంపిక విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకున్నట్టే కనబడుతుంది.. స్వామి రారా చిత్ర దర్శకుని నుంచి వచ్చిన ఈ చిత్రం లోని విషయానికి వస్తే చేయని నేరానికి తండ్రి జైలుకెళితే, అనారోగ్యంతో తల్లి చనిపోతే.. చెల్లిని డాక్టర్‌ చదివించడం కోసం అన్నయ్య ‘మోసగాడి’గా మారతాడు! ఏదో ఎనభైల కాలం నాటి కథలా ఉంది కదూ? గ్రే షేడ్స్‌ ఉన్న లీడ్‌ క్యారెక్టర్‌పై సింపతీ కలిగించడానికి అప్పట్లో ఇలాంటి ఫ్లాష్‌బ్యాక్‌లు వాడుకునేవారు. నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ని ఈతరం ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేయడానికి ఇలాంటి ‘ఫార్ములా’ ఫ్లాష్‌బ్యాక్‌లు అవసరం లేదిపుడు. ఇలాంటి ముతక ఫ్లాష్‌బ్యాక్‌ ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని తీసిన విధానం మాత్రం నవ తరం ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలానే ఉంది. ‘స్వామిరారా’తోనే ఆకట్టుకున్న దర్శకుడు సుధీర్‌ వర్మ ‘దోచేయ్‌’లో కూడా కొన్ని సందర్భాల్లో తన ప్రతిభ చాటుకున్నాడు. అయితే మొదటి సినిమాలో ఉన్న పకడ్బందీ కథనం, పట్టు సడలని గమనం ఇందులో మిస్‌ అయ్యాయి. అడపాదడపా సరదా చమక్కులతో తళుక్కుమంటూ ఆట్టే విసుగు కలిగించకపోయినా కానీ మొత్తమ్మీద చూస్తే మాత్రం ఒక మోస్తరు సినిమానే అనిపిస్తుంది తప్ప ‘స్వామిరారా’ మాదిరిగా స్పెషల్‌ మూవీ అనిపించుకోదు. చిన్న చిన్న మోసాలు చేస్తూ, జనాన్ని బురిడీ కొట్టించి డబ్బు సంపాదించే చందు (చైతన్య) ఓ మెడీకోతో (కృతి) ప్రేమలో పడతాడు. చెల్లిని మెడిసిన్‌ చదివించడానికి తన సంపాదన ఖర్చు పెట్టేస్తున్న చందు జైల్లో ఉన్న తండ్రిని (రావు రమేష్‌) బయటకి తీసుకురావడానికి రెండు కోట్లు అవసరమని తెలుసుకుంటాడు. ఆ డబ్బు అనుకోకుండా అతని చేతికొస్తుంది. తండ్రి కోసమని అది ఖర్చు పెట్టేసిన తర్వాత సదరు డబ్బుకి హక్కుదారుడైన మాణిక్యం (పోసాని) వచ్చి ఆ రెండు కోట్లు నాలుగు రోజుల్లో తెచ్చివ్వకపోతే చందు చెల్లి, తండ్రిని చంపేస్తానంటాడు. మరి ఆ రెండు కోట్లు అప్పటికప్పుడు చందు ఎలా సంపాదిస్తాడు? ఈ సినిమాకి వేసుకున్న బేస్‌.. మూస ఫార్ములా సినిమాదే అయినప్పటికీ చిత్రీకరణ కాంటెంపరరీగా ఉండడం, తీసిన విధానం స్టయిలిష్‌గా ఉండడంతో ‘దోచేయ్‌’ మూస సినిమాల మధ్య కాస్తో కూస్తో ప్రత్యేకంగానే అనిపిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే పరంగా చేసిన తప్పుల వల్ల సినిమాలో పాజిటివ్‌ పాయింట్స్‌ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఇంప్రెస్‌ చేయలేకపోయింది. ప్రథమార్థంలో అసలు కథేంటనేదే అర్థం కాదు. ఇంటర్వెల్‌ పాయింట్‌కి కూడా ప్లాట్‌ ఏంటో రివీల్‌ కాదు. గతంలో ఏదో జరిగిందనేది చూచాయగా తెలుస్తూనే ఉన్నా కానీ అసలు కథ ఏంటి, అసలు ఈ సినిమా దేని గురించి అనేది తెలియడానికి ద్వితీయార్థం వరకు ఆగాల్సి వచ్చింది. అంటే స్క్రీన్‌ప్లే స్ట్రక్చర్‌ పరంగానే పొరపాటు దొర్లిపోయింది. ఫస్ట్‌ హాఫ్‌లో విషయం ఏంటనేది చూపించకుండా టైమ్‌ పాస్‌ చేయడంలో మాత్రం సుధీర్‌ వర్మ సక్సెస్‌ అయ్యాడు. హీరో చేసే చిన్న చిన్న మోసాలు, విలన్‌ పక్కన చేరి కామెడీ చేసే వాళ్లు, హీరోయిన్‌తో పరిచయానికి హీరో పడే పాట్లు లాంటివి ఇంకా అసలు కథలోకి వెళ్లలేదనే లోటు తెలీకుండా చేసాయి. ఒక్కసారి కథ ఏంటనేది తెలిసిన తర్వాత మాత్రం హీరో క్యారెక్టరైజేషన్‌ దృష్ట్యా తెలివైన మోసానికి తెర లేస్తుంది, థ్రిల్‌ చేస్తుంది అనే నమ్మకం కలుగుతుంది. కానీ సదరు వ్యవహారమంతా చాలా సాదాసీదాగా సాగిపోయిందే తప్ప ఎక్కడా థ్రిల్‌ ఇవ్వలేకపోయింది. ప్రధానంగా ఆకట్టుకోవాల్సినవి చప్పగా సాగిపోతే, కథనం కుంటుపడి బండి ముందుకి కదల్లేకపోతుంటే.. అక్కడక్కడా కామెడీ సీన్లు, డైలాగులే సినిమా ముందుకి సాగడానికి ఇంధనమయ్యాయి. పోలీస్‌కి టోపీ పెట్టే సీన్‌లో చాలా విషయమున్నా కానీ తెరపైకి వచ్చిన విధానం మాత్రం పేలవంగా తయారైంది. చివరకు విలన్‌కి మస్కా కొట్టే ‘ఎక్స్‌టెండెడ్‌ క్లయిమాక్స్‌’ సీక్వెన్స్‌తోనే సెకండాఫ్‌కి లైఫ్‌ వచ్చింది. స్వామిరారా చిత్రాన్ని ఎక్కడా బిగి సడలకుండా నడిపించిన సుధీర్‌ వర్మ ఇక్కడ చాలా సార్లు గ్రిప్‌ కోల్పోయాడు. అయితే తన సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌, స్టయిలిష్‌ టేకింగ్‌తో ఇది పూర్తిగా డిజప్పాయింట్‌మెంట్‌ కాకుండా నిలబెట్టగలిగాడు. స్క్రిప్ట్‌ పరంగా కాస్త కేర్‌ తీసుకుని ఉంటే ‘దోచేయ్‌’ కూడా సినీ ప్రియుల మనసుల్ని దోచుకుని ఉండేది. తనకి నచ్చిన సినిమాల నుంచి కాపీ కొడతా అని మొదటి సినిమాకే ప్రకటించిన సుధీర్‌వర్మ ఇందులో కూడా చాలా సందర్భాల్లో తనకి నచ్చిన సీన్లని వాడేసుకున్నాడు. స్వామిరారాలో అవన్నీ కథలో చక్కగా ఇమిడిపోతే.. ఇక్కడ కొన్ని సార్లు బలవంతంగా ఇరికించినట్టు అనిపించాయి. ‘కాన్‌మేన్‌’గా నాగచైతన్య చాలా క్యాజువల్‌గా నటించేసాడు. ఆ ఆటిట్యూడ్‌ చూపించడానికి బాడీ లాంగ్వేజ్‌ పరంగా, డిక్షన్‌ పరంగా చిన్నపాటి ఛేంజెస్‌ ఏమైనా ట్రై చేసి ఉండాల్సిందేమో. ఓవరాల్‌గా నాగచైతన్య ఓకే అనిపిస్తాడు. కృతి సనన్‌ తన పాత్రలో ఒదిగిపోయింది. పోసాని కృష్ణమురళి క్యారెక్టర్‌ని క్షణక్షణంలో పరేష్‌ రావల్‌ తరహాలో డిజైన్‌ చేసారు. ఒక సీన్లో క్షణక్షణంలో పరేష్‌ సీన్‌ చూస్తూ తనని తాను ఐడెంటిఫై చేసుకుంటాడు కూడా. పోసాని పక్కన హర్ష, చైతన్య పక్కన ప్రవీణ్‌ ఆకట్టుకున్నారు. రవిబాబు ఫర్వాలేదనిపించాడు. బ్రహ్మానందం ‘బుల్లెట్‌ బాబు’గా ఫిలిం ఇండస్ట్రీ వాళ్లు బాగా కనెక్ట్‌ అయ్యే కొన్ని పంచ్‌లు వేసి అలరించాడు. సుధీర్‌వర్మకి సాంకేతిక వర్గం నుంచి ఫుల్‌ సపోర్ట్‌ లభించింది. సన్నీ మ్యూజిక్‌ ఈ సినిమాకి వన్‌ ఆఫ్‌ ది ఎస్సెట్స్‌గా నిలిచింది. రిచర్డ్‌ సినిమాటోగ్రఫీ వల్ల ఈ చిత్రానికి స్టయిలిష్‌ లుక్‌ వచ్చింది. నిర్మాత రాజీ పడకుండా ఖర్చు పెట్టారనే సంగతి స్పష్టంగా కనిపించింది. రొటీన్‌కి భిన్నమైన సినిమాలు కోరుకునే వారికి ‘దోచేయ్‌’తో ఒకింత తృప్తి కలుగుతుంది. కాకపోతే ఇంకా చాలా బాగుండడానికి స్కోప్‌ ఉన్నప్పటికీ స్క్రిప్ట్‌ పరంగా తగినంత శ్రద్ధ చూపించకపోవడం వల్ల దోచేయ్‌ ఒక సగటు సినిమాగా మిగిలిపోవాల్సి వచ్చింది. మాస్‌ ప్రేక్షకుల కంటే ఈ చిత్రానికి సిటీ ఆడియన్స్‌ ఎక్కువ కనెక్ట్‌ అయ్యే అవకాశముంది. బలహీనతలు ఉన్నప్పటికీ కాలక్షేపానికి ఒకసారి చూసేందుకు పనికొస్తుంది.

About the Author