దగ్గరిదారిలో ఐఎస్‌ఎస్‌కు!
రష్యా సోయజ్ వ్యోమనౌకలో గురువారం అర్ధరాత్రి అంతరిక్షానికి బయలుదేరిన ముగ్గురు వ్యోమగాములు కొత్తగా దగ్గరి దారిలో ప్రయాణిస్తూ శుక్రవారం తెల్లవారుజామున కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు సురక్షితంగా చేరుకున్నారు. సోయజ్ క్యాప్సూల్‌లో సుమారు ఆరు గంటలపాటు ప్రయాణించిన అమెరికాకు చెందిన క్రిస్ కాసిడీ, రష్యాకు చెందిన పవేల్ వినోగ్రాదోవ్(59), అలెగ్జాండర్ మిసుర్కిన్(35)లు పసిఫిక్ సముద్రంపై గగనతలంలో ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమై అందులోకి ప్రవేశించారు. కజకిస్థాన్‌లోని బైకనూర్ నుంచి అర్ధరాత్రి బయలుదేరిన సోయజ్ వ్యోమనౌక కొత్త మార్గంలో నేరుగా ప్రయాణించింది. భూమిని నాలుగు సార్లు మాత్రమే చుట్టివచ్చి ఆరు గంటల్లోనే ఐఎస్‌ఎస్‌కు చేరుకుంది. ఇంతకుముం దు మార్గంలో అయితే సుమారు 50 గంటలపాటు ప్రయాణించిన తర్వాతే ఐఎస్‌ఎస్‌కు చేరుకునేందుకు సాధ్యమయ్యేది.