Published On: Sun, Jun 1st, 2014

తెలంగాణ పదిజిల్లాల్లో పారిశ్రామిక ప్రగతి పరుగులెట్టేనా?

Share This
Tags

రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు పారిశ్రామిక ప్రగతి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క విశాఖ జిల్లాను మినహాయిస్తే పారిశ్రామిక క్షేత్రాలు కలిగిన జిల్లా మరేదీ కనిపించదు. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే హైదరాబాద్ తో పాటు , కరీంనగర్ లాంటి జిల్లాల్లో చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఎక్కువగా కనిపిస్తాయి. సాధారణంగా ఏదేనీ రాష్ట్రాభివృద్ధికి వ్యవసాయాభివృద్ధితో పాటు పారిశ్రామిక వృద్ధి కూడా అవసరమే. మరి తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీఆర్ ఎస్ పార్టీ చెబుతున్నట్టు బంగారు తెలంగాణకు వ్యవసాయ వృద్ధితోపాటు పారిశ్రామిక ప్రగతి కూడా అవసరమే.
విభజన, ఎన్నికల నేపథ్యంలో బంగారు తెలంగాణను మేమే నిర్మిస్తాం..కాదు మేము తెలంగాణను పునర్ నిర్మిస్తాం..సామాజిక తెలంగాణ అంటూ ప్రధాన పార్టీలు ఏకరువు పెట్టాయి. ఎన్నికల ముగిసిన తరుణంలోనూ ఇంకా అవే మాటలు చెబుతూనే ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికరణ ఎలా ఉంది ? ఏ చర్యలు తీసుకుంటే తెలంగాణలో నూతన పరిశ్రమల స్ధాపన జరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.?
ఐదు జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి
మొత్తంగా చూస్తే తెలంగాణ వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి ఉందని చెప్పవచ్చు. ఇందులో 90 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఉండగా మిగిలింది ఎక్కువ భాగం నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలు నాలుగు, ఖమ్మం జిల్లాలో బొగ్గు, బీడి పరిశ్రమలతో పాటు అదిలాబాద్ జిల్లాలో జిన్నింగ్ మిల్లులు మినహాయిస్తే పారిశ్రామిక అభివృద్ధి అంతగాలేదని చెప్పవచ్చు. అయితే తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామిక రంగాన్ని గత ప్రభుత్వ పాలకులే నాశనం చేశారని చెప్పవచ్చు. హెచ్ఎంటి, ప్రాగా టూల్స్, ఐడిపిఎల్, ఎఫ్ సిఐ, ఆల్వీన్, రిపబ్లికన్ పోర్టు, నిజాం షుగర్స్, ఆజాంజాహి మిల్స్ ఇలా ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. పారిశ్రామిక రంగం కుదేలైన ఫలితంగా ఉపాధి అవకాశాలకు దెబ్బ పడడంతో నిరుద్యోగ సమస్య తీవ్రమైంది.
మూసిన కంపెనీలను పునరుద్ధరిస్తాం..
అయితే తెలంగాణలో ప్రస్తుతం మూతపడ్డ కంపెనీలలో కొన్నింటిని పునరుద్ధరిస్తామని తెలంగాణ నూతన రాష్ట్రంలో అధికారం చేపట్టనున్న టిఆర్ఎస్ చెబుతోంది. కానీ ఉత్తర తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మాత్రం చెప్పలేదు. ఇక టిడిపి, కాంగ్రెస్, బిజెపి పార్టీల విషయానికొస్తే ఆయా పార్టీలన్నీ ఇప్పటివరకు పారిశ్రామిక రంగ అభివృద్ధికి సంబంధించిన ఊసే ఎత్తలేదు.
కేంద్ర నిధుల మాటేమిటి ?
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరబోతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని ప్రజలు, నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల వద్ద 6 లక్షల 80వేల కోట్ల రూపాయలుకు పైగా నిధులున్నాయి. వీటిని పెట్టుబడులుగా పెట్టి ఉత్తర తెలంగాణలోనే కాకుండా వెనుకబడిన రాయలసీమ, ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున్న పరిశ్రమలను విస్తరించవచ్చు. మూసివేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలను తిరిగి తెరిపిస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశముంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెరిగిపోతున్న నిరుద్యోగం దృష్ట్యా ఆ ప్రాంతంలో ఉన్న ఎఫ్ సిఐ, సిసిఐ, నిజాం షుగర్స్, అంతర్గాం స్పిన్నింగ్ మిల్లును తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాలో లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. అత్యధికులు కంపెనీ రోల్స్ లో లేకుండా దోపిడికి గురవుతున్నారు. అటువంటి దోపిడీ జరకుండా బీడీ కార్మికులందరినీ అధికారికంగా విధుల్లోకి తీసుకునే చర్యలు కొత్త సర్కారు చేపట్టాలి. అలాగే బీడీ కంపెనీలను ఆ ప్రాంతానికే కేంద్రీకరించకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలకు విస్తరించే విధంగా కృషి చేయాలి. అలాగే సింగరేణి లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడాన్ని నిలిపివేయాలి. మహబూబ్ నగర్ పడమర, దక్షిణ, తూర్పు ప్రాంతాలు, నల్గొండ పడమర, దక్షిణ ప్రాంతాలను పారిశ్రామికరించాలి. పారిశ్రామికీకరణ వల్ల నిరుద్యోగులకు ఉపాధి కల్పించి కనీస వేతనాలు అమలు చేయడం వల్ల వలసలను నివారించవచ్చు. పరిశ్రమల్లో శాశ్వత పనుల్లో ఉన్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేసేలా కాంట్రాక్టు కార్మిక చట్టంలో మార్పులు తీసుకరావాలి. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా దారిద్ర్య రేఖకు దిగువనున్నారా ? ఎగువనున్నారా ? అనే విషయం ఆలోచించకుండా అసంఘటిత కార్మికులందరికీ సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలి. పిఎఫ్, పెన్షన్, ఆరోగ్య సౌకర్యం, ప్రమాదం జరిగితే నష్టపరిహారం, ప్రసూతి సౌకర్యం, పిల్లలకు స్కాలర్ షిప్ లు వంటి సౌకర్యాలతో కూడిన చట్టాన్ని అమలు చేయాలి.
తెలంగాణ ప్రాంతానికే కాకుండా సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న కార్మికులకు మేలు చేసే విధంగా పాలకులు వ్యవహరించాలని కోరుకుందాం. ఒకవేళ వారు మేలు చేసే విధానాలు అమలు చేయకుండా ప్రైవేటీకరణ, ప్రపంచబ్యాంకు విధానాలు అమలు చేస్తే మాత్రం ప్రజాస్వామిక శక్తులు ఉద్యమించక తప్పదు..

About the Author