Published On: Sun, Jun 1st, 2014

టాలీవుడ్ కు కొత్త కామెడీ..!!

Share This
Tags

సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో హాస్యనటులకు అంతే క్రేజ్ ఉంటుంది. అది జోక్ అయినా.. సరసమైనా.. సీరియస్ యాక్షన్ అయినా.. హాస్యాన్ని పండించే నటులను ప్రేక్షకులు ఎప్పుడూ అభిమానిస్తారు. అలాగే సినీ రంగంలో చాలా ట్రెండ్ లు వస్తుంటాయి. పోతుంటాయి. ఏది.. ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఒక సమయంలో ఒక్కో అంశం ప్రభావితం చేస్తుంది. అలాగే మన సినిమా ఇండస్ట్రీలో కామెడీ కూడా మారుతూ వస్తోంది. అంతేకాదు కొంతపుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు రేలంగి, అల్లు రామలింగయ్య, రాజబాబు, సూర్యకాంతం వంటి వారు కామెడీని పండించి ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపుతెచ్చుకున్నారు. ఆ తర్వాత చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీలో పుట్టుకొచ్చారు. వారిలో సుత్తి వేలు, శ్రీ లక్ష్మి, పొట్టి ప్రసాద్ …లాంటి వారు కడుపుబ్బా నవ్వించారు. ఆ టైమ్ లో ఆ కాలంలో జంధ్యాల చేయించిన హాస్యం ఓ వెలుగు వెలిగింది. ‘నాల్గు స్తంభాలాట’, ‘చంటబ్బాయి ‘ లాంటి ఎన్నో సినిమాలు తీసి జంధ్యాల కామెడీ తో కబడ్డీ ఆడించారు. ఆయన సినిమాలలో హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేది. రాను రాను కామెడీ మారడమే కాకుండా.. కొత్తకొత్త హాస్యనటులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. తనదైన మార్కు కామెడీతో ప్రేక్షకులను గిలిగింతలు పెడుతున్నారు.
ఇక ఆ తరువాత వచ్చిన కమెడియన్స్ బ్రహ్మా నందం, కోట, బాబుమోహన్, అలీ తదితరులు ఉన్నారు. వీరు చేసిన కామెడీ.. సినిమాలకు పెద్ద ప్లస్ అయ్యేవి. అయితే బ్రహ్మానందాన్ని మంచి కమెడియన్ గా మార్చింది మాత్రం జంధ్యాల అని చెప్పవచ్చు. అప్పుడు మొదలయిన బ్రహ్మీ హవా.. వందలు దాటి వేల సినిమాలకు చేరింది. నిన్న మొన్నటి నుంచి నేటీ వరకు ప్రతీ సినిమాలో బ్రహ్మీ ఉండటం ఓ ట్రెండ్ అయిపోయింది. ఇతనితో పాటు అలీ, సునీల్, వేణు వంటివారు కమెడియన్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఒకప్పుడు కామెడీ సినిమాలో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు ‘కామెడీ సినిమాలే’ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బ్రహ్మీ లేకపోతే హిట్ లేదంతే..
ప్రస్తుతం టాలీవుడ్ లో బ్రహ్మీ కామెడీ పీక్ స్టేజ్ కి వెళ్లింది. ఒకరకంగా చెప్పాలంటే బ్రహ్మానందం లేకుండా స్టార్ హీరోల సినిమాలు రావడం లేదంటే అతిశయోక్తి కాదు. వారి హిట్లలో మేజర్ రోల్ బ్రహ్మీదే. ఇలా ఇండస్ట్రీని స్టార్ హీరోలు ఏలుతున్నారు అనడం కంటే.. బ్రహ్మీ ఏలుతున్నాడనే కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇలా ప్రతీ సినిమాలో బ్రహ్మానందం తప్పని సరి అయిపోయాడు.
బాబు మోహన్ రిటైర్ కాగా.. అలీ అలరిస్తూనే ఉన్నాడు..
ఒకప్పుడు కోట శ్రీనివాస్, బాబుమోహన్ కాంబినేషన్ కామెడీకి విపరీతమైన క్రేజ్ ఉండేది. వీళ్లు తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వులు పూసేవి. వీరిద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. వాటిలో చాలా వరకు హిట్ అయినవే ఉన్నాయి. అయితే ప్రస్తుతం కోట క్యారెక్టర్ ఆర్టిస్టుగానే పరిమితం కాగా.. బాబు మోహన్ పెద్దగా కనిపించడం లేదు. తాజాగా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఇక సినిమాలు తీసే ఛాన్స్ లేదనే చెప్పాలి. ఇక బాల నటుడిగానే ఇండస్ట్రీకి పరిచయం అయిన అలీ ఇప్పటికీ తన దైన భిన్నమైన కామెడీతో ఆలరిస్తున్నాడు. ప్రతీ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకతను చాటుతూ.. ఆడియెన్స్ ను నవ్విస్తున్నాడు. అంతేకాదు.. ఓ వైపు కామెడీ పండిస్తూనే మరోవైపు హీరోగా మారి ఫైట్లూ.. హీరోయిన్లతో డ్యూయెట్లూ పాడుకుంటున్నాడు. దీంతో అటు కమెడియన్ గా.. ఇటు హీరోగా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికీ హాస్య నటుడిగా, హీరోగా టాలీవుడ్ లో నత సత్తా చాటుతున్నాడు.
సునీల్ హీరోకే పరిమితమయ్యాడు..
ఒకప్పుడు అమాయకమైన ఫేస్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన సునీల్ ఓ దశాబ్దకాలం పాటు బాగానే ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాలో తన మార్కు హాస్యంతో ఊర్రూతలుగించాడు. ఇక హీరోగా మారిన సునీల్ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అలా ‘మర్యాద రామన్న’తో హీరోగా ఫేమ్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాలు చేస్తున్నా సరైన హిట్ మాత్రం రావడం లేదు. రీసెంట్ గా వచ్చిన ‘భీమవరం బుల్లోడు’ కూడా యావరేజ్ టాక్ నే తెచ్చుకుంది. అయినా సునీల్ హీరోగానే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. సునీల్ తోపాటు కామెడీ పంచుతూ ఆకట్టుకుంటున్న మరో ఆర్టిస్టు శ్రీనివాస్ రెడ్డి. అలాగే కృష్ణభగవాన్ కూడా తన దైన పంచ్ డైలాగ్ లతో ఆడియెన్స్ కు నవ్వులు పంచుతున్నారు. ఈ కమెడియన్స్ ఏం మాట్లాడినా.. పంచ్ డైలాగ్ లు పేలి హాస్యం పుడుతుంది. అలా డిఫరెంట్ కామెడీతో టాలీవుడ్ లో రాణిస్తున్నారు మన ఈ కమెడియన్స్.
కొత్త నవ్వులు వస్తున్నాయి..
టాలీవుడ్ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కొత్త కమెడియన్లు టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఇంకా అవుతూనే ఉన్నారు. తన మార్కు కొత్తదనంతో కూడిన కామెడీ ఆడియెన్స్ ను నవ్వులతో ముంచేత్తుతున్నారు. వారే తాగుబోతు రమేష్, సప్తగిరి, ప్రవీణ్ కుమార్.
వీరిలో ముందుగా తాగుబోతు రమేష్ ను చూస్తే.. ‘అలా మొదలైంది’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన రమేష్ .. టాలీవుడ్ కు సరికొత్త హ్యాస్యాన్ని పరిచయం చేశాడు. అప్పటి వరకు తాగుబోతు క్యారెక్టర్ కు కేరాఫ్ అయిన ఎమ్మెస్ నారాయణకు ధీటుగా ఇండస్ట్రీలో తనదైన మార్కు కామెడీతో నవ్వులు పూయించాడు. ఇప్పటికీ పూయిస్తూనే ఉన్నాడు. అయితే రమేష్ కామెడీలో ఈ మధ్య కొత్తదనం లేదని, ప్రతీ సినిమాలోనూ ఒకే ఎక్స్ ప్రెషన్స్ తో బోర్ కొట్టిస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రొటీన్ కామెడీకే పరిమితమయ్యాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇలానే కొనసాగితే.. వీలైనంత త్వరలోనే మనోడి కెరీర్ ప్రశ్నార్థకంలో పడే అవకాశాలున్నాయంటున్నారు సినీ పెద్దలు.
సప్తగిరి.. స్టార్ కమెడియన్ గా ఎదుగుతాడట..
‘హ్యాపీడేస్’ సినిమాలో నెల్లూరు కుర్రోడిలా.. అమాయకంగా కనిపించిన సప్తగిరి.. బన్నీ ‘పరుగు’ మూవీతో ఇండస్ట్రీ పెద్దల దృష్టిలోపడ్డాడు. ఇక ఆ తర్వాత ‘ప్రేమ కథా చిత్రం’లో నటించి బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో సప్తగిరి చేసిన అమాయకత్వపు కామెడీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆట్టుకుంది. ఇక అంతే వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి సప్తగిరికి. అలా సందీప్ కిషన్ మూవీ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’తో బాగా పాపులర్ అయ్యాడు. తన మార్కు డిఫరెంట్ కామెడీని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ సినిమా హిట్ లో ముఖ్య పాత్ర సప్తగిరిది ఉందంటే అతిశయోక్తి కాదు. ఇలా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కూడిన కామెడీని పంచుతూ.. నవ్వులు పంచుతున్న సప్తగిరి త్వరలోనే స్టార్ కమెడియన్ అవుతాడనడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఎప్పటి నుంచో.. అడపాదడపా కామెడీ పంచుతున్న ప్రవీణ్ కూడా ఈ మధ్య తన మార్కును కామెడీ డోస్ పెంచాడు. పంచ్ డైలాగ్ లతో కూడిన హాస్యాన్ని పంచుతూ రాణిస్తున్నాడు.
ఇలా చాలా మంది కొత్త కామెడీయన్లు ఇండస్ట్రీకి వస్తున్నారు. తన మార్కు కొత్తదనంతో కూడిన హాస్యాన్ని పంచుతున్నారు. ఉన్న వారు ఎప్పటికప్పుడు తన శైలి మార్పులు చేసుకొని ఆడియెన్స్ కు సరికొత్త కామెడీని పంచుతున్నారు. ఇలా ఇంకా ఇంకా కొత్తతరం కమెడియన్లు వచ్చి టాలీవుడ్ ప్రేక్షకులకు ఆరోగ్యకరమైన కామెడీని పంచాలని కోరుకుందాం..

About the Author