చౌకగా సౌర, పవన విద్యుత్ నిల్వ!
గాలి మరలు, సౌర విద్యుత్ పలకల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నిల్వ చేసేందుకుగాను కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ శాస్త్రవేత్తలు అతిచౌకైన ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. విద్యుత్‌ను నిల్వ చేయడంతోపాటు అవసరమైనప్పుడు తిరిగి వాడుకునేందుకు ఉపయోగపడే ఈ పద్ధతి సౌరశక్తి, పవన విద్యుత్ రంగాలకు కీలకం కానుందని వారు వెల్లడించారు. విద్యుద్విశ్లేషణ (ఎలక్ట్రోలైసిస్) ప్రక్రియ ద్వారా నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులుగా విడగొడుతూ.. విద్యుత్‌ను నిల్వ చే సేందుకు తాము చౌకైన పద్ధతిని కనుగొన్నామని వర్సిటీకి చెందిన కర్టిస్ బెర్లింగెట్, సైమన్ ట్రుడెల్ పేర్కొన్నారు. విద్యుద్విశ్లేషణ ద్వారా విద్యుత్ నిల్వ కోసం ప్రస్తుతం ఇరీడియం, రుథీనియం వంటి అరుదైన, ఖరీదైన లోహాలను ఉత్ప్రేరకాలు(క్యాటలిస్ట్స్)గా ఉపయోగిస్తున్నారని, తాము మాత్రం చౌకైన లోహాలతోనే సమర్థంగా విద్యుత్‌ను నిల్వ చేయగలిగామని తెలిపారు. తుప్పు వంటి చౌకైన ఆక్సైడ్‌లతోపాటు దాదాపు అన్ని సాధారణ లోహాలను ఉపయోగించి కూడా విద్యుత్‌ను సమర్థంగా నిల్వ చేయగలిగామన్నారు. వీటితో విద్యు త్ నిల్వ ఖర్చు వెయ్యి రెట్లు తగ్గుతుందని ‘సైన్స్’ జర్నల్‌లో పేర్కొన్నారు.