చిత్ర సీమ పేరు చెప్పుకొని సంపాదించేస్తున్నారు…..
సినిమా వాళ్లంటే జనాలకు తీరని మోజు. థియేటర్లో కనిపించే తమ అభిమాన నటీనటులు కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఆ థ్రిల్లే వేరు. అందుకే వాళ్లను చూసే ఏ చిన్న అవకాశమైనా చాలామందికి ఏనుగెక్కినంత సంబరం. ఇక దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచన సినిమావాళ్లది. జనాలకు చూడాలనే ఆశ ఉన్నప్పుడు.. తమకంత క్రేజ్ ఉన్నప్పుడు ‘ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం… కాస్త వీలు చూసుకొని పబ్లిక్ వేడుకల్లో కనిపిస్తే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చుకదా’ అనేది నటీనటుల అభిప్రాయం. అందుకే దుకాణాల ప్రారంభోత్సవాల్లో తెగ సందడి చేస్తుంటారు. అయితే ఇటీవల కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే.. విద్యాసంస్థల వేడుకల్లో సినిమావాళ్ల హంగామా!
విద్య వ్యాపారమై, విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలయ్యాక ఆయా సంస్థల మధ్య పెరిగిన పోటీ వాతావరణం సినిమాతారలకు ఇప్పుడు వరమవుతోంది. వివిధ సంస్థల్లో జరిగే ఏ వేడుకనైనా అంగరంగవైభవంగా జరపడం, సదరు కార్యక్రమానికి సినిమావాళ్లను తీసుకురావడం ఆడంబరమైన ఆనవాయతీ అయిపోతోంది. ఈ క్రమంలో సినిమావాళ్లు కూడా ఇదేదో బాగానే ఉందని, ఆహ్వానం అందుకోవడమే తరువాయి హాజరైపోతున్నారు. కళాశాలలు యాజమాన్యాలు కూడా ఈ ‘మర్యాద’కు బాగానే ముట్టజెప్పుతుండడంతో పేరున్న కథానాయికలే కాకుండా, హాస్యనటులు, వాంప్ పాత్రలు వేసే నటీమణులు, గాయనీగాయకులు కళాశాల వేడుకల్లో అలరిస్తున్నారు.
దీంతో ఇటువంటి విద్యాసంస్థలకు సినిమావాళ్లను పంపిణీచేసే సంధానకర్తల (మేనేజర్లకు) కు గిరాకీ బాగా పెరిగిపోయింది. ఇదే అదనుగా వారు కూడా కమీషన్ల రూపంలో బాగానే వెనకేసుకోవడం మొదలుపెట్టారు. ఇటువంటి కార్యక్రమాల్లో కనిపించడానికి తమన్నా, అంజలి వంటి తారలైతే 7-10 లక్షలు తీసుకుంటారని సమాచారం. చిన్న చిన్న స్కిట్లు వేసి నవ్వించే గౌతంరాజు, ధన్ రాజ్, నల్ల శీను, చిత్రం శీను, శ్రీనివాసరెడ్డి వంటి హాస్యనటులు 50 వేల నుంచి ఒకట్రెండు లక్షల వరకు తీసుకుంటున్నారట. పేరున్న గాయనీగాయకులూ దాదాపు అంతే మొత్తంలో తీసుకుంటున్నారు. ఏమైనా, సినిమా వాళ్లకి ఇదో సైడ్ ఇన్ కం అయిపోయింది!