చదువులో పిల్లల ఇష్టాలకు విలువ ఇవ్వండి: ఐఐసీటీ సదస్సులో అబ్దుల్ కలాం పిలుపు
పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని తల్లిదండ్రులు కోరుకోవడంలో తప్పులేకపోయినప్పటికీ… వారు ఇష్టపడే సబ్జెక్ట్‌లోనే ఉన్నత విద్యనభ్యసించేందుకు అవకాశమివ్వడం ఎంతైనా అవసరమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం స్పష్టం చేశారు. ‘సైన్స్ విద్య, పరిశోధనలపై విద్యార్థుల్లో తగ్గుతున్న ఆసక్తి- కారణాలు, పరిష్కార మార్గాలు’ అన్న అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాల, ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు కలాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎస్‌ఐఆర్ పరిశోధన సంస్థలు ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్‌జీఆర్‌ఐల సహకారంతో శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సులో కలాం మాట్లాడుతూ సైన్స్ విద్యను ఆకర్షణీయమైన ఉపాధి మార్గంగా మార్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీనియర్ శాస్త్రవేత్తలు, సైన్స్ టీచర్లు తరచూ హైస్కూల్ విద్యార్థులతో ముచ్చటించడం ద్వారా వారిలో సైన్స్‌పట్ల ఆసక్తిని పెంపొందించవచ్చని సూచించారు.
ఈ దేశపు విద్యార్థులు, యువత అందరిలోనూ ప్రత్యేకంగా ఉండాలని ఆశిస్తోంటే సమాజం వారిని అందరిలో ఒకరిగా మార్చేందుకు శతథా ప్రయత్నిస్తోందని.. ఇది విద్యార్థులకు సవాలేనన్నారు. అంతకుముందు సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి తగ్గలేదని, సామాజిక, ఆర్థిక కారణాలతో వారు ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. సైన్స్ సబ్జెక్ట్‌లో బీఎస్సీ చేసిన వారు ఎమ్మెస్సీ, పీహెచ్‌డీలు చేయాల్సి వస్తోందని, దీనికి బదులుగా నాలుగేళ్ల బీఎస్సీ కోర్సును ప్రవేశపెట్టడంపై ఆలోచన చేయాలని సూచించారు. ఓయూ వైస్‌చాన్స్‌లర్ ఎస్.సత్యనారాయణ అధ్యక్షోపన్యాసం చేస్తూ సైన్స్‌పట్ల, పరిశోధనలపై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గేందుకు యూజీసీ వంటి సంస్థల విధానాలూ కారణమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఓయూ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.టి.సీత, ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ అహ్మద్ కమాల్, ఎన్‌జీఆర్‌ఐ సీనియర్ శాస్త్రవేత్త వై.జె.భాస్కరరావు, ప్రొఫెసర్ బి.ఎన్.రెడ్డి తదితరులు ప్రసంగించారు.