Published On: Thu, Sep 12th, 2013

గ్యాస్ ఆధారిత విద్యుత్‌పై సబ్సిడీ!

Share This
Tags
దేశీయంగా సహజవాయువు(గ్యాస్) లభ్యత అడుగంటిపోయి విద్యుత్ ప్లాంట్‌లకు సరఫరాలు ఆవిరవుతున్న నేపథ్యంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ భారీ సబ్సిడీ ప్రణాళికకు తెరలేపింది. అధిక గ్యాస్ రేట్ల కారణంగా పెరిగిపోతున్న కరెంట్ చార్జీల భారం ప్రజలపై పడకుండా ప్లాంట్‌లకు సుమారు రూ.11 వేల కోట్ల సబ్సిడీని చెల్లించే ప్రతిపాదనను రూపొందించింది. దీనికి సంబంధించి ముసాయిదా నోట్‌ను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ)కి సమర్పించింది.
 దీని ప్రకారం దేశీయంగా లభిస్తున్న చౌక గ్యాస్, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఖరీదైన ద్రవీకృత సహజవాయువు(ఎన్‌ఎన్‌జీ) ధరల సగటు రేటును(దీన్నే పూలింగ్‌గా కూడా వ్యవహరిస్తారు) అన్ని గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్‌లకు ఏకరూప(యూనిఫాం) రేటుగా వర్తింపజేయాలనేది కూడా తాజా ప్రతిపాదనలో ఉంది. ‘ఇలాచేసిన తర్వాత కూడా యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం సుమారు రూ.10 వరకూ అయ్యే అవకాశం ఉంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ మాత్రం కేవలం యూనిట్‌కు రూ.5.50ను మాత్రమే వినియోగదారులపై చార్జీగా విధించగలదు. మిగతా భారాన్ని ప్లాంట్‌లకు ప్రత్యక్ష నగదు చెల్లింపుద్వారా ప్రభుత్వం సబ్సిడీగా భరించాల్సి ఉంటుంది’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
 2015-16 నాటికి…
 రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు చెందిన కేజీ-డీ6 క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి పాతాళానికి పడిపోవడంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లకు సరఫరాలు లేక మూతపడేస్థాయికి చేరాయి. దేశీ గ్యాస్ క్షేత్రాల నుంచి విద్యుత్ ప్లాంట్‌లకు రోజుకు 71.29 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ) గ్యాస్ కేటాయించగా..  కేవలం 17.25 ఎంఎంఎస్‌సీఎండీలు మాత్రమే సరఫరా జరుగుతోంది. మరో 3.5 ఎంఎంఎస్‌సీఎండీల ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకుంటున్నా అనేక ప్లాంట్‌లు ఇంధనం లేక నిలిచిపోయాయి. దీంతె ఈ ఆర్థిక సంవత్సరం నుంచే గ్యాస్ పూలింగ్/సగటు ధర విధానాన్ని అమలు చేయాలనేది విద్యుత్ శాఖ వాదన.
 దీని ప్రకారం చూస్తే ఒక్కో బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంబీటీయూ) గ్యాస్ రేటు 11.43 డాలర్లుగా పడుతుంది. ఈ లెక్కన ప్లాంట్‌లకు విద్యుదుత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10.47కు చేరుతుంది. ఇంత భారీ రేటును వినియోగదార్లు భరించే అవకాశం లేదనేది విద్యుత్ శాఖ వాదన. అందుకే యూనిట్ చార్జీ రూ.5.50కి మించి.. ఆపై పడే రేటును ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించాలని ప్రతిపాదించింది.
 దీనికి సీసీఈఏ ఆమోదం తెలిపి అమల్లోకివస్తే… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి నాలుగు నెలలకు ప్రభుత్వం విద్యుత్ ప్లాంట్‌లకు రూ.2,498 కోట్లను సబ్సిడీగా చెల్లించాల్సి వస్తుందని అంచనా. వచ్చే ఏడాది ఈ సబ్సిడీ మొత్తం రూ.8,646 కోట్లకు, 2015-16లో రూ.10,849 కోట్లకు చేరనుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది. దేశీ గ్యాస్ ధర ఎంబీటీయూకి 4.2 డాలర్లే ఉన్నా ఉత్పత్తి పడిపోవడంతో తీవ్ర కొరత నెలకొన్న సంగతి తెలిసిందే.
 ఈ గ్యాస్ పూలింగ్ విధానం అమలుతో క్రమంగా అన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అవకాశం లభిస్తుందని, తద్వారా రుణాలను తిరిగి చెల్లించేందుకు వీలవుతుందని విద్యుత్ శాఖ అభిప్రాయపడింది. కాగా, గతంలో గ్యాస్ పూలింగ్‌ను వ్యతిరేకించిన ఈ శాఖ.. విద్యుదుత్పత్తి కంపెనీల అసోసియేషన్ విజ్ఞప్తుల మేరకు తాజా ప్రతిపాదనను సీసీఈఏకు సమర్పించడం గమనార్హం.

About the Author