Published On: Wed, May 14th, 2014

‘గీతాంజలి’ ఓ దృశ్యకావ్యం…

Share This
Tags

”అల్లరి, ఆనందం కలిసి అందరిలాగే ఆడుతూ పాడుతూ ఉన్న ఓ కాలేజీ కుర్రాడు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ తో మరికొన్ని రోజుల్లో చనిపోతాడనే భయంకరమైన నిజం బయటపడుతుంది”. ఇది సింపుల్ గా నాగార్జున నటించిన ‘గీతాంజలి’ సినిమా కథ. మరణానికి చేరువైన హీరో, హీరోయిన్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ‘గీతాంజలి’ తెలుగు సినిమాలో చెరగని ముద్ర వేసుకుంది.
రెండు దశాబ్దాల క్రితం వరకూ ఎవరినైనా ‘గీతాంజలి’ గురించి చెప్పమంటే మొదట వచ్చే సమాధానం ‘రవీంద్రనాథ్ టాగోర్ రచన’ అని ఉండేది. తర్వాతి కాలంలో అది కాస్తా ‘మణిరత్నం-నాగార్జున’ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అయ్యింది. తమిళ దర్శకుడు మణిరత్నం 1989 లో తీసిన ‘గీతాంజలి’ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. ఆబాలగోపాలాన్నీ అలరించిన సున్నితమైన ప్రేమకథ. హీరోకో, హీరోయిన్కో ప్రాణం పోయే జబ్బు ఉండడం, అది కథ క్లైమాక్స్ కి వచ్చాక బయట పడడం అన్నది తెలుగు సినిమాల్లో బాగా నలిగిన ఫార్ములా. ముఖ్యంగా అప్పటివరకూ ఇద్దరి హీరోయిన్లతో ఆడిపాడిన హీరోని శుభం కార్డు సమయానికి ఏకపత్నీవ్రతుడిని చేసేందుకు, ఇద్దరిలోనూ ఒక హీరోయిన్ కి ప్రాణాంతక వ్యాధి ఉన్నట్టు చూపించిన సినిమాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఈ రొటీన్ ఫార్ములాకి కొంచం భిన్నంగా నాయికా నాయకులిద్దరినీ ఎన్నాళ్ళు బతుకుతారో తెలియని పేషెంట్లు గా చూపడం ‘గీతాంజలి’ ప్రత్యేకత.
మణిరత్నం కవ్వించాడు.. నవ్వించాడు..
ప్రతి ఫ్రేమ్ నూ ఓ పెయింటింగ్ లా మలచి శ్రీరామ్ చేసిన మ్యాజిక్ అద్భుతమైతే, అల్లరి పిల్లే హీరోకు తారసపడటం.. టీజింగ్ తో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారడం, తర్వాత ఆమె కూడా తనలాగే మరణశయ్యపై ఉందనే నిజం తెలియడం, ఇలాంటి సిట్యుయేషన్ లో మరో దర్శకుడైతే తెరంతా కన్నీళ్లు కుమ్మరించేవాడు. కానీ మణిరత్నం కవ్వించాడు. నవ్వించాడు. వాళ్లు మరణానికి చేరువలో ఉన్నారన్న విషయం అండర్ కరెంట్ చేసి రొమాంటిక్ ప్లే చేశాడు. కథా పరంగా గీతాంజలి ఎంత అద్భుతంగా ఉంటుందో, సంగీతం, సాహిత్య పరంగానూ అంతే అద్భుతంగా ఉంటుంది. ఇళయరాజా స్వరాలకు వేటూరి సాహిత్యం.. బంగారానికి తావి అద్దినట్టుగా సరిపోయింది.
నాగార్జున కెరీర్ నే మలుపు తిప్పింది…
‘గీతాంజలి’ సినిమా నాగార్జున కెరీర్ కు గొప్ప టర్న్ ఇచ్చింది. అప్పటి వరకూ అతనికి నటన రాదని, అక్కినేనికి వారసుడు కాలేడని, అనే విమర్శలు ఉండేవి. ‘గీతాంజలి’తో అవన్నీ పోయాయనే చెప్పాలి. ఇక గీతాంజలిగా నటించిన ‘గిరిజ’ కళ్లను ఇప్పటికీ మర్చిపోలేరు. తొలి సినిమా అయినా కళ్లతోనే ఆమె పలికించిన భావాలకు నాటి ప్రేక్షకులే కాదు, ఇప్పటి కుర్రాళ్లు సైతం ఫిదా అయిపోవాల్సిందే..
‘యంగ్ డై ఫస్ట్’ అనే ఇంగ్లీష్ సినిమా నుంచి ఇన్స్ స్పైర్ అయి మణిరత్నం రాసుకున్న ఈ చిత్రం తెలుగులో అతనికి తొలి.. చివరి సినిమా కూడా కావడం విశేషం.
అనేక అవార్డులందుకుంది..
ఇక ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘గీతాంజలి’ జాతీయ అవార్డ్ అందుకుంది. మణిరత్నంకు ఫిల్మ్ ఫేర్ దక్కింది. ఇక వీటితో పాటు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ కొరియోగ్రఫీ, ఉత్తమ కథా రచయిత, ఉత్తమ కమెడియన్, ఉత్తమ సినిమా టోగ్రాఫర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ విభాగంలో ఆరు నందులను అందుకొని తన సత్తా చాటిచెప్పింది. నాగార్జునకు తిరుగులేని ఇమేజ్ తెచ్చిన ఇలాంటి సినిమాలు ఆ తర్వాత రాలేదనే చెప్పాలి. వచ్చినా ‘గీతాంజలి’ని మరింపిచడం అసాధ్యం అనేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దారు మణిరత్నం. అందుకే ఇది టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమాల లిస్ట్ లో శాశ్వత స్థానం సంపాదించుకుంది.

About the Author