Published On: Tue, Apr 2nd, 2013

కేన్సర్ రోగులకు వరం

Share This
Tags

‘గ్లివెక్’ కేన్సర్ ఔషధం పేటెంట్ పోరులో నోవార్టిస్‌కు ఎదురుదెబ్బ..
కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు లక్షలాది మంది కేన్సర్ రోగులకు చౌకగా జనరిక్ ఔషధాలు
దేశీయ ఫార్మాకు బూస్ట్

 

దేశీ ఫార్మా కంపెనీలు, లక్షలాది మంది కేన్సర్ రోగుల పాలిట వరంలా నిలిచే చరిత్రాత్మక రోజు ఇది. స్విట్జర్లాండ్ ఫార్మా దిగ్గజం నోవార్టిస్ తన కేన్సర్ ఔషధం గ్లివెక్‌కు పేటెంట్ విషయంలో ఏడేళ్లుగా కొనసాగిస్తున్న న్యాయపోరాటంలో ఓటమి చవిచూసింది. ఈ పేటెంట్ కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సోమవారం అత్యంత కీలకమైన తీర్పు ఇచ్చింది. గ్లివెక్ తయారీపై తనకు విశేషమైన అధికారాలు కల్పించాలని, దేశీ ఫార్మా కంపెనీలు దీన్ని తయారు చేయకుండా చూడాలంటూ నోవార్టిస్ ఇన్నేళ్లుగా చేస్తున్న వాదనలకు ఇక తెరపడినట్టయింది.
దీంతో దేశీ ఫార్మా కంపెనీలు కేన్సర్ రోగులకు చౌక ధరల్లో జనరిక్ ఔషధాలను అందించేందుకు మార్గం సుగమమైంది.

జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. రక్త, చర్మ ఇతరత్రా కేన్సర్ నివారణల కోసం ఉపయోగించే ఈ గ్లివెక్ ఔషధంలో కొత్తగా ఎలాంటి మాలిక్యూల్‌ను ఉపయోగించలేదని, ఇదేమీ కొత్తగా కనుగొన్న ఔషధం కాదని తేల్చిచెబుతూ ధర్మాసనం నోవార్టిస్ పిటిషన్‌ను కొట్టివేసింది. ‘ఇమటినిబ్ మెసైలేట్’ అనే కొత్త సబ్‌స్టెన్స్‌ను తమ కేన్సర్ డ్రగ్‌లో వాడామని, తాజా ఆవిష్కరణ ద్వారా ఈ కొత్త ఉత్పత్తిని తీసుకొచ్చామన్న నోవార్టిస్ వాదనను కూడా సుప్రీం తిరస్కరించింది. మొత్తం 98 పేజీల తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం అనేక కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ‘వాస్తవ ఆవిష్కరణల ఆధారంగా కాకుండా నిపుణులైన లాయర్లను పెట్టుకొని కొన్ని కంపెనీలు తమకు అనుకూలంగా పేటెంట్ క్లెయిమ్‌లను మలచుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పేటెంట్లు అనేవి సంబంధిత ఔషధాల ఉత్పత్తి, మార్కెటింగ్‌ల కోసం కాకుండా ఒక కమోడిటీగా కూడా మారుతున్నాయి. ఇలాంటి చర్యల ఆధారంగా దేశంలో పేటెంట్ చట్టాల రూపకల్పనకు మేం అనుమతించం’ అని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

దేశీ కంపెనీలకు భలే చాన్సులే…
నోవార్టిస్ గ్లివెక్ పేటెంట్ కేసు తీర్పు విషయంలో దేశీయంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా బహుళజాతి(ఎంఎన్‌సీ) ఫార్మా దిగ్గజాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. నోవార్టిస్ వాదనలను దేశీ ఫార్మా కంపెనీలతో పాటు వైద్యపరమైన స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో ఇక పేటెంట్ గడువు తీరిపోయిన ఔషధాల్లో మార్పుచేర్పులు చేసి కొత్త పేటెంట్‌లతో గుత్తాధిపత్యం చలాయించేందుకు వీలులేకుండా చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా ఫార్మా కంపెనీలు కేన్సర్ రోగులకు ఇక చౌక ధరల్లో జనరిక్ ఔషధాలను తయారు చేసి విక్రయించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. అధికారిక అంచనాల ప్రకారం.. దేశంలో 28 లక్షల మంది కేన్సర్ రోగగ్రస్తులు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం నోవార్టిస్ గ్లివెక్ ఔషధం ఒక నెల డోస్(మాత్రలు) ఖర్చు రూ.1.2 లక్షలుగా ఉంది. దేశీయ కంపెనీలు తయారు చేస్తున్న ఇదే జనరిక్ వెర్షన్ ఔషధం నెల రోజుల డోస్ ధర రూ.8,000 మాత్రమే కావడం గమనార్హం. సుప్రీం తీర్పుతో ఇప్పుడు దేశీ ఫార్మా కంపెనీలు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి నివారణకు జనరిక్ వెర్షన్ ఔషధాలను తయారు చేసుకునేందుకు వీలవుతుంది. నాట్కో, సిప్లా, ర్యాన్‌బాక్సీ వంటి దేశీ కంపెనీలు చాలా చౌక రేటుకే ‘ఇమటినిబ్’ జనరిక్ డ్రగ్ తయారీ, మార్కెటింగ్‌ను కొనసాగించగలుగుతాయి. మరిన్ని కంపెనీలు ఈ కేన్సర్ ఔషధాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉండటంవల్ల భవిష్యత్తులో ధర మరింత తగ్గే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పేటెంట్ పరిరక్షణ లేని ఇతర దేశాలకు భారత్ నుంచి గ్లివెక్ జనరిక్ వెర్షన్ ఎగుమతులు భారీగా పెరిగేందుకు, తద్వారా కంపెనీల రాబడులు కూడా జోరందుకునేందుకు తాజా తీర్పు దోహదం చేస్తుంది.

పేద రోగులకు ప్రయోజనం: ఫార్మా కంపెనీలు
నోవార్టిస్ గ్లివెక్ పేటెంట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై దేశీ ఫార్మా కంపెనీలు సంతోషం వ్యక్తం చేశాయి. నాణ్యమైన ఔషధాలు పేద రోగులకు అందుబాటులోకి వచ్చేందుకు ఈ తీర్పు దోహదం చేస్తుందని వ్యాఖ్యానించాయి. ‘పేద రోగులకు ప్రయోజనం కలిగించే దిశగా ఇది చరిత్రాత్మకమైన తీర్పు’ అని ఇండియన్ ఫార్మా మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్(ఐడీఎంఏ), ఇండియన్ ఫార్మసూటికల్ అలయెన్స్(ఐపీఏ)లు అభివర్ణించాయి. దీనివల్ల ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ వ్యాధులకు చాలా చౌకగా దేశీయ కంపెనీలైన సిప్లా, ర్యాన్‌బాక్సీ, నాట్కో వంటివి జనరిక్ ఔషధాలను తయారు చేసేందుకు వీలవుతుందని ఐపీఏ సెక్రటరీ జనరల్ డీజీ షా పేర్కొన్నారు. ఇమటినిబ్(గ్లివెక్)ను నోవార్టిస్ కంటే అత్యంత చౌకగా అందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ‘భారతీయ జనరిక్ కంపెనీలకే కాకుండా దేశంలోని పేద రోగులందరికీ మేలు చేకూర్చే తీర్పు ఇది. దేశంలో చట్టాలకు తగిన రక్షణ ఉందని దీనివల్ల తేటతెల్లమైంది’ అని ఐడీఎంఏ సెక్రటరీ జనరల్ దారా బి.పటేల్ వ్యాఖ్యానించారు.

ఏడేళ్ల పోరుకు తెర…
కేన్సర్ ఔషధం ‘గ్లివిక్’ ఔషధాన్ని మరింత సమర్ధంగా తీర్చిదిద్దామని దీనికి కొత్తగా మళ్లీ పెటెంట్ ఇవ్వాల్సిందిగా… 2006లో తొలిసారి భారత పెటెంట్ కార్యాలయం… కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్ అండ్ డిజైన్‌కు నోవార్టిస్ దరఖాస్తు చేసుకుంది. అయితే, భారత పేటెంట్ చట్టంలోని సెక్షన్ 3(డి), 3(బి)లలో పేర్కొన్న అంశాల విషయంలో గ్లివెక్ పేటెంట్ దరఖాస్తుకు అర్హత లేదని పేర్కొంటూ… పేటెంట్ కార్యాలయం నోవార్టిస్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సెక్షన్ 3(డి) ప్రకారం ఇంతకు ముందే వాడుకలో ఉన్న ఔషధాల పనితీరు మరింత మెరుగైనది అయితేనే తప్ప పేటెంట్ ఇవ్వడానికి వీల్లేదు. అదేవిధంగా మార్కెట్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలతో పోలిస్తే… కొత్తగా పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఔషధాల్లో అధిక రోగనివారణ సామర్థ్యం లేనిపక్షంలో, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పెటెంట్ నిరాకరణలకు ఇక సెక్షన్ 3(బి) వీలుకల్పిస్తోంది. అయితే, దీన్ని చేస్తూ నోవార్టిస్ చెన్నైలోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పిలేట్ బోర్డ్(ఐపీఏబీ)ను ఆశ్రయించింది. అక్కడ కూడా స్విస్ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది.

ఐపీఏబీ నోవార్టిస్ అభ్యర్ధనను తిరస్కరించడంతో చివరకు 2009లో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అయితే, పేటెంట్ కార్యాలయం, ఐపీఏబీ ఆదేశాలను సమర్ధిస్తూ ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. ఇమటినిబ్ మెసైలేట్‌ను కొత్త ఆవిష్కరణ ద్వారా తయారు చేసిన కొత్త ఉత్పత్తిగా గుర్తించలేమని నోవార్టిస్ వాదనలను తిరస్కరించింది. గతంలో పేటెంట్ పొందిన ‘జిమెర్‌మన్’లో కూడా ఇమటినిబ్ అనేది ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా సుప్రీం ప్రస్తావించింది. దీంతో నోవార్టిస్ చేస్తున్న న్యాయపోరాటానికి తెరపడింది. కాగా, అన్నిరకాల కెమికల్, ఫార్మా మూలకాలకు సంబంధించి మెరుగైన ఆవిష్కరణల రక్షణకు సెక్షన్(3డి) అడ్డుకట్టవేస్తుందనేది తమ తీర్పు ఉద్దేశం కాదని సుప్రీం పేర్కొనడం గమనార్హం.

ఇక భారత్‌లో ఆర్ అండ్ డీ పెట్టుబడులు పెట్టం: నోవార్టిస్
ప్రాణాంతకమైన వ్యాధులకు సమర్థవంతమైన చికిత్స అందించేందుకు వీలుగా వైద్యరంగంలో పరిశోధన, కొత్త ఆవిష్కరణల (పేటెంట్)కు సుప్రీంకోర్టు తీర్పు ఎదురుదెబ్బేనని నోవార్టిస్ స్పందిం చింది. భారత్‌లో ఫార్మా పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలపై పెట్టుబడులు పెట్టబోమని నోవార్టిస్ ప్రకటించింది. ఇక్కడి నుంచి ఆర్‌అండ్‌డీని మరో సానుకూల దేశానికి తరలించనున్నట్లు కూడా పేర్కొంది. భారత్‌లో కొత్త పేటెంట్‌ల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని, మరిన్ని ఉత్పత్తులను ప్రవేశపెడతామని, అయితే ఆర్‌అండ్‌డీపైనే ఇక పెట్టుబడులు ఉండవని నోవార్టిస్ ఇండియా వైస్‌చైర్మన్, ఎండీ రంజిత్ షహానీ సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఔషధాల ఉత్పత్తికి మాత్రం పెట్టుబడులకు సుప్రీం తీర్పు అడ్డంకి కాదంటూనే.. కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పడం గమనార్హం. పేటెంట్‌కు తిరస్కరణ ద్వారా మేధోపరమైన సంపద(ప్రాపర్టీ)కు భారత్‌లో పరిమితంగానే రక్షణ ఉందని స్పష్టమైందని, దేశంలో భవిష్యత్ ఆవిష్కరణలను ఇది నిరుత్సాహపరుస్తుందని కూడా షహానీ పేర్కొన్నారు. గ్లివెక్‌కు చైనా, రష్యా, తైవాన్ సహా మొత్తం 40 దేశాల్లో పేటెంట్ పరిరక్షణ ఉందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు.

‘ఎవర్ గ్రీనింగ్’కు అడ్డుకట్ట…
ఎంఎన్‌సీ ఫార్మా కంపెనీలు లాభాలు దండుకోవడమే లక్ష్యంగా తమ పేటెంట్లను కొనసాగించేందుకు, అధిక ధరలతో ఔషధాలను అమ్ముకోవడానికి చూస్తున్నాయని దేశీ ఫార్మా కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు ఎప్పటినుంచో గగ్గోలు పెడుతున్నాయి. ప్రాణాంతక వ్యాధుల చికిత్సకోసం పేద రోగులకు తక్కువ ధరకే ఔషధాలు అందించాలంటే జనరిక్ వెర్షన్ల అత్యవసరమని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు ఉన్నాయి. భారత్‌లో తయారవుతున్న జనరిక్ ఔషధాలు ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల్లో పేదల పాలిట వరంగా నిలుస్తున్నాయి. నోవార్టిస్‌తో పాటు అనేక ఎంఎన్‌సీలు ‘ఎవర్ గ్రీనింగ్’ వ్యూహంతో తమ పేటెంట్లపై గుత్తాధిపత్యానికి తెరతీస్తున్నాయనేది జనరిక్ కంపెనీల వాదన. ఇప్పటికే ఉన్న ఔషధాలు, ఫార్ములేషన్ల పేటెంట్ గడువు ముగింపుదశకు చేరే తరుణంలో… దానికే కొద్దిగా మార్పులు చేసి మళ్లీ కొత్తగా పేటెంట్‌లను తీసుకోవడాన్ని ఎవర్ గ్రీనింగ్‌గా పేర్కొంటున్నారు. ఒకవేళ నోవార్టిస్ గ్లివెక్‌కు కొత్తగా పేటెంట్ లభించిఉంటే… 20 ఏళ్లపాటు ఆ కంపెనీకి సర్వహక్కులు లభించిఉండేవి. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆ కంపెనీ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఎంఎన్‌సీ ఫార్మా కంపెనీల ఎవర్ గ్రీనింగ్ చర్యలకు అడ్డకట్ట పటినట్లయింది.

About the Author