Published On: Mon, Jul 15th, 2013

కాంగ్రెస్, బీజేపీ.. ఓ వాగ్యుద్ధం

Share This
Tags

లౌకికవాద బురఖా ధరిస్తున్నారంటూ కాంగ్రెస్పై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చేసిన తాజా వ్యాఖ్యలు మళ్లీ పార్టీల మధ్య చిచ్చు రేపాయి. సహజంగానే బీజేపీ మీద కాంగ్రెస్ నేతలు ఒంటికాలిమీద లేవగా.. ఈ వివాదం వల్ల అధికార పార్టీకే ఎక్కువ లబ్ధి కలుగుతుందని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఆందోళన చెందుతున్నారు. అనవసరంగా కాంగ్రెస్ ఉచ్చులో పడొద్దని, ఇలాంటి పనికిమాలిన చర్చల వల్ల ఆర్థిక రంగంలో ప్రభుత్వ వైఫల్యాలు మసకబారడం తప్ప మరో ఉపయోగం ఉండదని మోడీకి ఆయన క్లాసు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఏదైనా సంక్షోభంలో ఉన్నప్పుడల్లా తన వైఫల్యాలు దాచుకోడానికి లౌకికవాద బురఖా వేసుకుంటోందంటూ పుణెలో మోడీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నగ్న కులపిచ్చి కంటే బురఖాలో ఉన్న లౌకికవాదమే నయమని కాంగ్రెస్ నేతలు ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, కేంద్ర మంత్రులు మనీశ్ తివారీ, శశి థరూర్.. ఇలా అందరూ ఒక్కసారిగా మోడీ మీద పడ్డారు. ఇటీవలే బీజేపీతో తెగతెంపులు చేసుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా వారికి జతకలిశారు. కుక్కపిల్ల, బురఖా లాంటి పదాలు వాడటం బీజేపీకి అంత సరిపోదని, దానివల్ల వాతావరణ కాలుష్యం తప్ప మరేమీ ఉండదని ఆయన అన్నారు.

అయితే.. ఈ మొత్తం వివాదాన్ని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరో రకంగా చూశారు. ఒకవైపు నిరుద్యోగం, రూపాయి పతనం లాటి అనేక సమస్యలుండగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వివాదాల జోలికి పోయేబదులు.. ప్రచార వ్యూహాలపై మోడీ దృష్టి పెడితే మంచిదని ఆయన సూచించారు. మోడీ సమస్యలను ప్రస్తావిస్తున్న తీరు బాగానే ఉంది గానీ, కుక్కపిల్ల లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అధికార పార్టీకి జుట్టు అప్పగించినట్లు అవుతుందని ఆయన చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నందున దానిగురించి ప్రస్తావించాలని చెప్పారు.

మరోవైపు.. తమ ప్రచార కమిటీ చైర్మన్ మోడీ విషయంలో కాంగ్రెస్ నాయకులు ఒక్కటిగా దాడిచేయడంతో.. ఆయన్ను వెనకేసుకు వచ్చేందుకు బీజేపీ నేతలు కూడా సిద్ధమవుతున్నారు. మోడీ అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానం ఇవ్వడానికి బదులు అనవసరమైన విషయాలను కాంగ్రెస్ నాయకులు లేవనెత్తుతున్నారని అన్నారు. దీన్ని బట్టే కాంగ్రెస్ నేతలకు ఎంత ‘నమోనియా” ఉందో అర్థమవుతోందంటున్నారు. మొత్తమ్మీద మరోసారి కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది ఎక్కడకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

About the Author