Published On: Wed, Dec 18th, 2013

కళాత్మక చిత్రాలు కళ్ళు తెరచిన రోజు …

Share This
Tags

తెలుగు సినిమాకు ‘శుభోదయం’ చూపించి … ‘శుభలేఖలు’ రాయించి … ‘శృతి లయలు’ నేర్పించి … ‘సాగరసంగమం’లో స్నానాలు చేయించి … ప్రేక్షకుల హృదయాల్లో ‘సిరివెన్నెల’ కురిపించిన దర్శకులు కె.విశ్వనాథ్. తెలుగు సినిమా సముద్రంలో ఆణిముత్యాలను ఏరితే, అందులో అధిక భాగం విశ్వనాథ్ కి చెందినవై వుంటాయి. విశ్వనాథ్ సినిమాల్లో సంగీత సాహిత్యాలు సమతూకంగా కనిపిస్తాయి. సహజత్వానికి అద్దం పడుతూ నిజజీవితాలను ప్రతిబింబిస్తాయి. హీరో … హీరోయిన్ల క్రేజ్ … ఇమేజ్ లపై ఆధారపడి ఆయన సినిమాలు చేయరు.

ఆయన సినిమాల్లో కథా బలం వుంటుంది … కమ్మని పాటలుంటాయి … మనసును కట్టిపడేసే కళాత్మక విలువలు వుంటాయి. దర్శకుడిగా తొలి చిత్రమైన ‘ఆత్మగౌరవం’ … ‘సుడిగుండాలు’ … చెల్లెలి కాపురం’ … ‘కాలం మారింది’ … ‘శారద’ … ‘ఓ సీత కథ’ … ‘సీతామాలక్ష్మి’ చిత్రాలను ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక సంగీత నృత్య ప్రధానమైన కథగా ఆయన రూపొందించిన ‘సిరిసిరిమువ్వ’ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దాంతో కేవలం సంగీతాన్ని ప్రధాన కథా వస్తువుగా చేసుకుని ఆయన తెరకెక్కించిన ‘శంకరాభరణం’ అప్పటికీ ఇప్పటికీ ఓ ప్రయోగంగానే నిలిచిపోయింది.

సంగీతంలో వున్న అమరత్వం … ఆ సంగీతానికి జీవితాన్ని అంకితం చేసిన శంకరశాస్త్రి పరిస్థితిని ఆయన ‘శంకరాభరణం’లో కళ్ళకు కట్టారు. ఆయన సినిమాలలో కులాల ప్రస్తావన వుంటుంది గానీ, కులతత్వం మాత్రం వుండదు. అందుకే, ‘శంకరాభరణం’లో కానీ, ‘సప్తపది’ లో కానీ, ప్రధాన పాత్రలు బ్రాహ్మణ కులానికి చెందినవైనప్పటికీ ఇతర కులాలతో అవి మమేకం అయిపోతాయి. ఆ విధంగా చేసి ప్రేక్షకులను ఒప్పించడం అన్నది దర్శకుడికి కత్తిమీద సాము… అది విశ్వనాథుడికి వెన్నతో పెట్టిన విద్య!

ఇక నృత్య ప్రధానంగా ‘సాగర సంగమం’ … ‘స్వర్ణకమలం’, సంగీత ప్రధానంగా ‘సిరివెన్నెల’ … ‘శ్రుతిలయలు’ … ‘స్వాతికిరణం’ వంటి చిత్రాలను ఆవిష్కరించిన ఆయన, ‘సూత్రధారులు’ … ‘స్వయం కృషి’ … ‘ఆపద్బాంధవుడు’ … ‘శుభ సంకల్పం’ వంటి చిత్రాల్లో కొన్ని వర్గాలకు చెందినవారి నిజ జీవితాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొన్ని జీవితాలను … మరికొన్ని జీవితాలకు పరిచయం చేసే ఓ కళాత్మక ప్రయోగంగా ఆయన సినిమాలు కనిపిస్తాయి.

తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలకు … వారు ఎంతగానో అభిమానించే సంగీత సాహిత్య నృత్యాలకు జీవంపోస్తూ ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం ప్రేక్షకుల హృదయవేదికపై పదికాలాల పాటు పట్టాభిషేకం జరుపుకుంటూనే వుంటుంది.

About the Author