Published On: Mon, May 27th, 2013

కల నెరవేరింది

Share This
Tags

ఐపీఎల్-6 విజేత ముంబై ఇండియన్స్
ఫైనల్లో చెన్నైపై ఘన విజయం
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పొలార్డ్

ఐపీఎల్‌లో అన్నిటికంటే ఖరీదైన జట్టు… ఖరీదైన ఆటగాళ్లు… జట్టు నిండా దిగ్గజ క్రికెటర్లు… డగౌట్ నిండా అనుభవజ్ఞులైన సహాయక సిబ్బంది… ఎంత డబ్బయినా ఖర్చు చేయడానికి వెనకాడని మేనేజ్‌మెంట్…. ఇంత కథ ఉన్నా ఐదు సంవత్సరాల పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు టైటిల్ కల నెరవేరలేదు. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ముంబై ఇండియన్స్… జాన్‌రైట్‌ను కోచ్‌గా, కుంబ్లేను మెంటర్‌గా తెచ్చుకుంది. కేవలం కెప్టెన్సీకి పనికొస్తాడేమో అంటూ పాంటింగ్‌పై కోట్లు కుమ్మరించింది…. మొత్తానికి ముకేశ్ అంబానీ పెట్టుబడికి ఫలితం దక్కింది. ఐపీఎల్ ఆరో సీజన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ సాధించింది.

సీజన్ అంతటా అద్భుతమైన ఆటతీరుతో దుమ్మురేపిన చెన్నై సూపర్ కింగ్స్… కీలకమైన ఫైనల్‌కు ముందు వెలుగులోకి వచ్చిన ‘ఫిక్సింగ్’ పరిణామాలతో దారుణంగా దెబ్బతిన్నట్లుంది. ఐపీఎల్‌లో అద్భుతమైన రికార్డూ… ఫైనల్స్ ఆడటంలో ఏ జట్టుకూ లేనంత అనుభవం ఉన్నా… ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. ఈడెన్‌గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన ఐపీఎల్-6 ఫైనల్లో ముంబై ఇండియన్స్ 23 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆరంభంలో చకచకా వికెట్లు కోల్పోయినా… పొలార్డ్ (32 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరిపోరాటంతో ఆదుకున్నాడు.

రాయుడు (36 బంతుల్లో 37; 4 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించారు. చివర్లో హర్భజన్ (8 బంతుల్లో 14; 3 ఫోర్లు) వేగంగా ఆడాడు. డ్వేన్ స్మిత్ (4 బంతుల్లో 4; 1 ఫోర్), తారే (0), రోహిత్ శర్మ (5 బంతుల్లో 2) నిరాశపర్చారు. రాయుడుతో కలిసి ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించిన పొలార్డ్ చివరి వరకు క్రీజులో నిలబడ్డాడు. బ్రేవో వేసిన ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి ముంబైకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చెన్నై బౌలర్లలో బ్రేవో 4, మోర్కెల్ 2 వికెట్లు తీశారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ ధోని (45 బంతుల్లో 63 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించినా… మిగతా వారు పూర్తిగా విఫలమయ్యారు. హస్సీ (1), రైనా (0), బద్రీనాథ్ (0)లు ఏడు బంతుల వ్యవధిలో అవుట్ కావడం జట్టును దెబ్బతీసింది. ఇప్పటి వరకు లీగ్‌లో పెద్దగా ప్రభావం చూపని మలింగ తొలి ఓవర్‌లోనే నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి చెన్నైకి షాక్ ఇచ్చాడు. రెండో ఎండ్‌లో జాన్సన్ కూడా దుమ్మురేపడంతో చెన్నై 3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. విజయ్ (20 బంతుల్లో 18; 2 ఫోర్లు), బ్రేవో (16 బంతుల్లో 15; 3 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 32 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ దశలో ముంబై బౌలర్లు మరోసారి విజృంభించడంతో నాలుగు పరుగుల తేడాతో చెన్నై మరో మూడు వికెట్లు చేజార్చుకుంది. దీంతో 39 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన ధోనిసేన ఏ దశలోనూ కోలుకోలేదు. మోర్కెల్ (10 బంతుల్లో 10; 1 సిక్సర్) ప్రయత్నించి విఫలమయ్యాడు. చివర్లో ధోని సిక్సర్లతో కాసేపు అలరించాడు. ముంబై బౌలర్లలో మలింగ, జాన్సన్, హర్భజన్ రెండేసి వికెట్లు తీశారు.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) మోహిత్ 4; ఆదిత్య తారె (బి) మోర్కెల్ 0; దినేశ్ కార్తీక్ (బి) మోరిస్ 21; రోహిత్ శర్మ (సి) అండ్ (బి) మోర్కెల్ 2; రాయుడు (బి) బ్రేవో 37; పొలార్డ్ నాటౌట్ 60; హర్భజన్ సింగ్ (సి) హస్సీ (బి) బ్రేవో 14; ధావన్ రనౌట్ 3; జాన్సన్ (సి) ధోని (బి) బ్రేవో 1; మలింగ (సి) ధోని (బి) బ్రేవో 0; ఓజా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 2, వైడ్లు 3) 5; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 148.

వికెట్లపతనం: 1-4, 2-8, 3-16, 4-52, 5-100, 6-125, 7-133, 8-135, 9-135.
బౌలింగ్: మోహిత్ శర్మ 4-0-26-1; అల్బీ మోర్కెల్ 3-0-12-2; మోరిస్ 4-0-25-1; అశ్విన్ 3-0-22-0; జడేజా 2-0-19-0; బ్రేవో 4-0-42-4
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: హస్సీ (బి) మలింగ 1; విజయ్ (సి) రోహిత్ (బి) జాన్సన్ 18; రైనా (సి) స్మిత్ (బి) మలింగ 0; బద్రీనాథ్ (సి) కార్తీక్ (బి) జాన్సన్ 0; బ్రేవో (సి) జాన్సన్ (బి) ధావన్ 15; జడేజా (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 0; ధోని నాటౌట్ 63; మోర్కెల్ (బి) ఓజా 10; మోరిస్ (సి) కార్తీక్ (బి) హర్భజన్ 0; అశ్విన్ (సి) సబ్ ఏఆర్ పటేల్ (బి) పొలార్డ్ 9; మోహిత్ శర్మ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 2, వైడ్లు 7) 9; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 125.

వికెట్లపతనం: 1-2, 2-2, 3-3, 4-35, 5-36, 6-39, 7-57, 8-58, 9-99
బౌలింగ్; మలింగ 4-0-22-2; జాన్సన్ 4-0-19-2; ఓజా 4-0-28-1; రిషి ధావన్ 1-0-6-1; హర్భజన్ సింగ్ 3-0-14-2; పొలార్డ్ 4-0-34-1.

బై… బై… ఐపీఎల్: సచిన్ ప్రకటన
మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఫైనల్లో విజయానంతరం ఇదే తన ఆఖరి ఐపీఎల్ అని అతను పేర్కొన్నాడు. ఐపీఎల్‌ను ముగించడానికి ఇది సరైన సమయంగా భావిస్తున్నట్లు సచిన్ వెల్లడించాడు.

గాయం కారణంగా ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లకు దూరమైన సచిన్…ఫైనల్లో కూడా ఆడలేదు. 2011లో ముంబై ఇండియన్స్ జట్టు చాంపియన్స్ లీగ్ గెలిచినప్పుడు కూడా మాస్టర్ గాయంతో మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఈ ఏడాది జరిగే చాంపియన్స్ లీగ్‌లో మాత్రం అతను పాల్గొనే అవకాశం ఉంది.

 

About the Author