ఐఎస్‌బీ విద్యార్థులకు రికార్డు స్థాయి ఆఫర్లు
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) విద్యార్థులకు జాబ్ ఆఫర్స్ రికార్డు స్థాయిలో పెరిగాయి. తమ హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లలో ప్లేస్‌మెంట్స్ కోసం వస్తున్న కంపెనీల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతోందని ఐఎస్‌బీ డిప్యూటీ డీన్ దీపక్ చంద్ర శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది ఐఎస్‌బీ పీజీ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(పీజీపీ) ప్లేస్‌మెంట్స్‌కు సంబంధించి పాల్గొన్న కంపెనీల సంఖ్య 21 శాతం, జాబ్ ఆఫర్ల సంఖ్య 27 శాతం చొప్పున వృద్ధి చెందాయని, ఈ రెండింటి విషయంలో ఇది రికార్డని పేర్కొన్నారు.
మొత్తం 762 మంది విద్యార్థుల్లో 21 మంది సొంత వెంచర్లు ఏర్పాటు/కుటుంబ వ్యాపారాలను చూసుకుంటామని చెప్పారని, ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో 741 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. మొత్తం 421 కంపెనీలు 798 ఆఫర్లనిచ్చాయని, మేలో ఈ ప్రక్రియ ముగుస్తుందని, అప్పటికల్లా ఈ సంఖ్య మరింత పెరగవచ్చని వివరించారు. మొత్తం విద్యార్థుల్లో 29%గా ఉన్న మహిళలకు మంచి ఆఫర్లు వచ్చాయని, యాక్సిస్ బ్యాంక్ 12 మంది మహిళలను ఎంపిక చేసుకుందన్నారు. ఐటీ రంగం నుంచి అధికంగా(300 ఆఫర్లు, 53 కంపెనీలు). ఆఫర్లు వచ్చాయని, ఆ తర్వాత స్థానంలో కన్సల్టింగ్ (163 ఆఫర్లు, 30 కంపెనీలు) రంగం ఉందని పేర్కొన్నారు.