ఎక్కడి రేట్లు అక్కడేనా!
దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనం… రూపాయి విలువ పాతాళానికి పడిపోవడం వంటి క్లిష్టపరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పాలసీపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. తొలి త్రైమాసిక పరపతి విధాన సమీక్షను రేపు(మంగళవారం) ఆర్‌బీఐ చేపట్టనుంది. అయితే, వృద్ది కంటే ఆర్‌బీఐ రూపాయి ఆందోళనలపైనే ఆర్‌బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అధిక దృష్టి కేంద్రీకరించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి పతనానికి అడ్డుకట్టవేసి, కరెన్సీలో తీవ్ర హెచ్చుతగ్గులను నివారించడమే ఆర్‌బీఐ ప్రధాన లక్ష్యంగా ఉంటుందని బ్యాంకర్లు, ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. పరిశ్రమ వర్గాలు కోరుతున్నట్లుగా పాలసీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని, ఇప్పుడున్నట్లుగానే వీటిని యథాతథంగా కొనసాగించవచ్చనేది వారి అభిప్రాయం. ప్రస్తుతం రెపో రేటు 7.25 శాతం, రివర్స్ రెపో 6.25 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతంగా ఉన్నాయి. గత సమీక్ష(జూన్ 17న)లో కూడా పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులూ చేయని సంగతి తెలిసిందే.
కార్పొరేట్ల గగ్గోలు…: పారిశ్రామిక రంగం తాజా గణాంకాల ప్రకారం తిరోగమనంలోకి జారిపోయింది. ఈ ఏడాది మే నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) మైనస్ 1.6 శాతానికి పడిపోయింది. తయారీ రంగం ఉత్పాదకత ఏకంగా మైనస్ 2 శాతం క్షీణించింది. గడిచిన 11 నెలల్లో ఇదే అత్యంత ఘోరమైన ఉత్పాదకత కావడం గమనార్హం. దీంతో మొత్తం ఆర్థిక వ్యవస్థపై దీని ప్రతికూల ప్రభావం పడుతుందని.. వడ్డీరేట్లు తగ్గించాలంటూ కార్పొరేట్ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు గతేడాది(2012-13)లో దశాబ్దపు కనిష్టానికి(5 శాతం) పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోపక్క, టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మళ్లీ జూన్‌లో కాస్త పుంజుకోవడం ఆర్‌బీఐ పాలసీపై ప్రభావం చూపే అంశం. మే నెలలో 4.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం… జూన్లో 4.86 శాతానికి చేరింది. ఇదేకాకుండా నిత్యావసర వస్తువులు ప్రధానంగా కూరగాయలు ఇతరత్రా ఆహారోత్పత్తుల ధరలు మండిపోతుండటం కూడా రేట్ల తగ్గింపునకు ఆటంకంగా నిలిచే ప్రధానాంశాల్లో ఒకటి.
బ్యాంకర్లు ఏమంటున్నారంటే..
ఇటీవల కాలంలో రూపాయి క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం ఆర్‌బీఐ పలు కఠిన చర్యలను ప్రకటించడం విదితమే. బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యసరఫరా(లిక్విడిటీ)ను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంది. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ కొద్దిగా కోలుకుంటూ వస్తోంది. గత శుక్రవారం 58.69 వద్ద ముగిసింది(కొద్దిరోజుల క్రితం 61.21 స్థాయిని కూడా తాకిన సంగతి తెలిసిందే). తొలి త్రైమాసిక పాలసీ సమీక్షలో రూపాయిపై చర్యల విషయంలో ఆర్‌బీఐ మరికొంత స్పష్టత ఇవ్వొచ్చని, పాలసీ రేట్లను యథాతథంగానే ఉంచొచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ వీఆర్ అయ్యర్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశాల్లేవని దేనా బ్యాంక్ సీఎండీ అశ్వని కుమార్ అభిప్రాయపడ్డారు. కాగా, ఆర్‌బీఐ లిక్విడిటీ కట్టడి చర్యలపై ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి ఇటీవలే తీవ్రంగా స్పందించిన విషయం విదితమే. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికో లేదంటే ధరల కట్టడికి…. అవసరమైతే వడ్డీరేట్లను పెంచుకోవచ్చుగానీ, లిక్విడిటీని మాత్రం తగ్గించొద్దంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
ఆర్థిక వేత్తల అభిప్రాయం ఇదీ…
రూపాయి కొత్త కనిష్టాలకు పడిపోతున్న నేపథ్యంలో వడ్డీరేట్ల తగ్గింపు చర్యలేవీ పాలసీ సమీక్షలో ఉండకపోవచ్చని ఆర్థిక వేత్తలు అంటున్నారు. గత రెండు వారాల్లో రూపాయి పతనాని అరికట్టేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలకు విఘాతం కలిగే నిర్ణయాలేవీ దువ్వూరి ప్రకటించే అవకాశం లేదని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నావిస్ పేర్కొన్నారు. లిక్విడిటీని మరింత తగ్గించకపోవచ్చని చెప్పారు. సీఆర్‌ఆర్‌ను తగ్గిస్తే దీర్ఘకాలిక ద్రవ్యసరఫరాపై ప్రతికూలతకు దారితీస్తుందని, అందువల్ల ఆర్‌బీఐ అటువైపు మొగ్గుచూపదని సబ్నావిస్ అభిప్రాయపడ్డారు.