ఉర్దూ టీచర్ పోస్టులు ఖాళీ
రాష్ట్రంలో ఉర్దూ టీచర్ పోస్టులు అభ్యర్థుల్లేక మిగిలిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు చేసిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు ఆయా రిజర్వేషన్ కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో భర్తీ కావడం లేదు. ఫలితంగా ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు ఇతర రిజర్వేషన్ కేటగిరీల్లో ఉర్దూ పండిట్ ట్రైనింగ్ చేసి, పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగులు పోస్టుల్లేక ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. డీఎస్సీ-2012లోనే 1,325 ఉర్దూ టీచర్ పోస్టులను ప్రకటిస్తే 753 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. రిజర్వేషన్ కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థుల్లేక 572 పోస్టులు మిగిలిపోయాయి. ఉర్దూ టీచర్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అర్హులు లేనప్పుడు ఆ పోస్టులను డీ-రిజర్వు చేసేందుకు 2008లో ప్రభుత్వం జీవో 74ను జారీ చేసింది. దాని ప్రకారం 2006 డీఎస్సీలో మిగిలిన పోస్టులను డీ-రిజర్వు చేయాలని పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల ఖాళీలను డీ-రిజర్వు చేశాక బీసీ-బీ, ఓసీ అభ్యర్థులతో భర్తీ చేయాలని స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో మిగిలిన పోస్టులను డీ-రిజర్వు చేసి భర్తీ చే శారు. ప్రస్తుతం డీఎస్సీ-2012లో మిగిలిపోయిన పోస్టులను కూడా డీ-రిజర్వు చేసి భర్తీ చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరులో 48, కడపలో 68, అనంతపురంలో 50, కర్నూలులో 52, మహబూబ్‌నగర్‌లో 67, గుంటూరులో 3, హైదరాబాద్‌లో 124, నిజామాబాద్‌లో 31, రంగారెడ్డిలో 10, కరీంనగర్‌లో 8, మెదక్‌లో 54, నెల్లూరులో 8, పశ్చిమగోదావరిలో 10, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 7, విజయనగరంలో 2, ఆదిలాబాద్‌లో 15, కృష్ణా జిల్లాలో 14 పోస్టులు మిగిలిపోయాయి.