Published On: Sun, Jun 1st, 2014

ఉత్తర్ ప్రదేశ్ లో మహిళలకు భద్రత ఏదీ ?

Share This
Tags

సంస్కృతి సాంప్రదాయలు నేర్పిన రాష్ర్టం. అంతే కాకుండా దేశానికి ఎంతో మంది నాయకులను అందించిన రాష్ర్టం..అలాంటి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఎక్కడో ఒక చోట కామాంధుల చేతిలో మహిళలు అ(హ)త్యాచారానికి గురవుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడి మహిళల తలరాతలు మారడం లేదు. మహిళలకు భద్రత కల్పిస్తామంటూ ఎన్నికల్లో హామీలు గుప్పిస్తుంటారు. అనంతరం అధికారంలోకి రాగానే వారు ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తుంటారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు బాధ్యాతయుమైన పదవిలో ఉన్న వారు నోరు పారేసుకుంటున్నారు. ఇటీవలే ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఈనెల 27వ తేదీన దళిత బాలికలపై జరిగిన దుర్ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో సంచలనం రేకెత్తించింది.
విశిష్టతలకు నిలయం…
ఉత్తరప్రదేశ్..ఎన్నో విశిష్టతలకు నిలయం. 2 లక్షలా 43 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం,19 కోట్ల జనాభాతో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. గత చరిత్రను బట్టి అత్యంత గొప్పదైన రాష్ట్రం అయ్యుండాలి. కానీ యథార్థం వేరేలా ఉంటుంది. అభివృద్ధిలో ఆమడ దూరం ఉండే పల్లెలు లెక్కకు మించి కన్పిస్తాయి.
భయంకరమైన ఖాప్ పంచాయతీలు..
ఆడపిల్లపై అత్యాచారం జరిగితే అమ్మాయిదే తప్పని పంచాయతీ పెద్దలు తీర్మానం చేస్తారు. ఇంట్లోంచి ఎందుకు బయటకొచ్చావంటూ ఎదురు ప్రశ్నిస్తారు. అత్యాచారం చేయబోతే అబ్బాయికి ఎందుకు సహకరించలేదని ఆరా తీస్తారు. తనను పలానా వ్యక్తి నాశనం చేశాడంటే సాక్ష్యం కావాలంటారు. వేడి నూనెలో చేయి పెట్టు కాలలేదంటే తప్పు నీది కాదంటారు. ఎదురు ప్రశ్నిస్తే అత్యాచారమే ఎదురు శిక్ష అవుతుంది. అక్కడి బాలికలపై, స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతునే ఉన్నాయి ఎంత మంది పాలకులు మారినా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.
ప్రధాన కారణం మరుగుదొడ్లు లేకపోవడమే…
యుపిలో జరిగే అత్యాచారాలకు టాయిలెట్లు లేకపోవడం ప్రధాన కారణమని ఓ సర్వేలో తేలింది. అక్కడ మహిళలు, బాలికలు బహిర్భూమికి వెళ్లినప్పుడే మగ మృగాలు విరుచుకపడతాయి. ప్రతి ఊరిలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఖాకీలు పెద్దలకు సలాం కొట్టాలి. లేదంటే మరుసటి రోజు ఆ పోలీస్ అధికారి అక్కడ కన్పించడు. ఇందుకు 27న దళిత బాలికలపై జరిగిన అమానుష కాండే ఉదాహరణ. తమ కూతుళ్లు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్య తీసుకోలేదు. ఇందుకు ప్రతిగా వాళ్లు సస్పెండయ్యారు.
ప్రజల బతుకు చిత్రాలు మారడం లేదు…
రాష్ట్రాన్ని ఏ పార్టీ పాలించినా దాని రూపు రేఖలు మార్చేందుకు ప్రయత్నించలేదు. కొన్నేళ్లు కాంగ్రెస్‌, మరికొన్నేళ్లు బిజెపి, ఇంకొన్నేళ్లు బిఎస్పీ, ఎస్పీ. ఇలా ఎన్ని పార్టీలు అధికారంలోకొచ్చినా ప్రజల బతుకు చిత్రాలు మారవు. అప్పుడప్పుడు ప్రభుత్వాలు మారినా పాలకులు అభివృద్ధి జోలికి పోరు. ఇక్కడే పప్పూయాదవ్, రాజాభయ్యా, ధనంజయ్‌ సిన్హా లాంటి ఘనత వహించిన క్రిమినల్స్ అలవోకగా విజయం సాధిస్తుంటారు. పైగా అబ్బాయిలు తప్పులు చేస్తారు అయితే శిక్షించాలా అంటూ ములాయం లాంటి పెద్దలు ప్రశ్నిస్తుంటారు. ఈయనా రాష్ట్రాన్ని కొన్నేళ్లపాటు పాలించారు. ప్రస్తుతం తనయుడు అఖిలేష్‌ యాదవ్ రాజ్యమేలుతున్నారు.
సాక్ష్యం కావాలంట..
గ్రామ పెద్దలకు అమ్మాయిలు అఘాయిత్యం జరిగిందని చెబితే సాక్షం కావలంటారు…అంతే కాకుండా ఇంట్లో నుండి బయటికి ఎందుకు వచ్చారంటారు, అబ్బాయికి ఎందుకు సహకరించలేదెందుకని అమ్మాయిదే తప్పని తీర్పు చెబుతారు. ఒక వేళ పోలీసులు కేసు నమోదు చేస్తే మరుసటి రోజు ఆ స్టేషన్ లో ఆ అధికారి ఉండడు.
క్రైమ్ విషయంలో ఎస్పీ రికార్డు…
సమాజ్ వాదీ అధికారంలోకొచ్చిన కొన్ని రోజులకే క్రైమ్ విషయంలో రికార్డు సృష్టించింది. 2012 మార్చిలో అధికారం చేపట్టగా ఏప్రిల్ 15 నాటికి 699 మర్డర్ కేసులు, 263 రేప్‌, 249 దొమ్మీ కేసులో నమోదయ్యాయి. ఇవన్నీ కేవలం రెండు నెలల కాలంలోనే. ప్రస్తుతం ఆ లెక్కలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వమైనా మేలు చేస్తుందో వేచి చూడాలి .

About the Author