Published On: Wed, Jun 26th, 2013

ఉత్తరాఖండ్ లో సాగని సహాయక చర్యలు

Share This
Tags

ఉత్తరాఖండ్‌లో ఊళ్లకు ఊళ్లనే వరదల్లో తుడిచిపెట్టేసిన ప్రకృతి ఇంకా శాంతించలేదు. కుండపోతగా కురుస్తున్న వర్షాలు బాధితుల్లో గుబులు పెంచుతున్నాయి. ప్రతికూల వాతావరణంలోనే సైనిక, పారా మిలటరీ బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తుండగా, అనుకోని దుర్ఘటన జరిగింది. కేదార్‌నాథ్ నుంచి గౌచార్‌కు బాధితులను తీసుకు వస్తున్న ఐఏఎఫ్ హెలికాప్టర్ మార్గమధ్యంలోనే గౌరీకుండ్‌కు ఉత్తరాన కుప్పకూలింది. సిబ్బందితో కలిపి అందులో ఉన్న 21 మంది మృతిచెందినట్లు భావిస్తున్నారు. మృతదేహాల కోసం గాలించిన గరుడ్ కమాండోలకు ఎనిమిది మృతదేహాలు మాత్రమే దొరికాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధితులను ఈ సంఘటన మరింతగా కలచివేసింది.

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. మంచు పర్వతాలపై చిక్కుకుపోయి ఉన్నవారిని రక్షించేందుకు సైనిక బృందాల సహాయ చర్యలు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా ముందుకు సాగలేదు. ఎడతెరిపిలేని భారీ వర్షాలు, మధ్యమధ్యలో ఆకాశానికి చిల్లులు పడ్డట్లు కుండపోత కురుస్తుండటంతో వాతావరణ పరిస్థితి ప్రమాదభరితంగా ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కేదార్‌నాథ్ వద్ద సహాయ చర్యల్లో పాల్గొంటున్న భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్ ఒకటి గౌరీకుండ్ వద్ద కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న యాత్రికులు, భద్రతా సిబ్బంది 21 మందీ చనిపోయారు. అప్పటికీ సైనిక బృందాలు మంగళవారం వేయి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగాయి.

హిమాలయ పర్వత సానువుల్లో జలవిలయం సంభవించిన పది రోజుల తర్వాత కూడా పర్వతాలపై ఇంకా 10వేల మందికి పైగా చిక్కుకుపోయి ఉన్నట్లు సైనికాధికారులు తెలిపారు. బద్రీనాథ్‌లో అధికంగా 4వేల మంది వరకూ చిక్కుకున్నారని.. వారిలో 1,500 మంది స్థానికులేనని చెప్పారు. హేమకుండ్‌సాహెబ్‌లో మరో 2వేల మంది వరకూ ఉన్నారు. సరిహద్దు రహదారుల సంస్థ పాండుకేశ్వర్ వద్ద వంతెన నిర్మాణ పనులను శరవేగంగా పూర్తిచేస్తోం దని.. ఇది పూర్తయితే బద్రీనాథ్‌లో ఉన్నవారిని రక్షించటం సులువవుతుందని అధికారులు చెప్తున్నారు. చిక్కుకున్న వారంతా క్షేమంగా ఉన్నారని, వారికి అవసరమైనంత ఆహారం, మందులు అందుబాటులో ఉన్నాయని ఉత్తరాఖండ్ సీఎం విజయ్‌బహుగుణ పేర్కొన్నారు.

గంగోత్రి మార్గంలో వందలాది మంది ఆకలి కేకలు

మరోవైపు.. గంగోత్రి మార్గంలో వందలాది మంది యాత్రికులు పది రోజులుగా రోడ్డు మీదే చిక్కుబడి ఉన్నారు. వారు ఆహారం, తాగునీరు లేక ఆకలితో అలమటిస్తున్నారని, తక్షణమే హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీరు జారవిడవకపోతే వారందరికీ ప్రాణాపాయం పొంచివుందని వార్తలు వస్తున్నాయి. ఇక కేదార్‌నాథ్ ప్రాంతంలో చిక్కుబడి ఉన్న వారి కోసం గాలింపు, రక్షణ చర్యలన్నీ పూర్తయ్యాయని సైనికాధికారులు ప్రకటించారు. ‘కేదార్‌నాథ్ పరిసరాల్లోని అడవుల్లో ఏ ఒక్కరూ చిక్కుబడి లేరు. అందరినీ తీసుకువచ్చాం’ అని రుద్రప్రయాగ్ జిల్లాలో సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న నోడల్ అధికారి రవినాథ్‌రామన్ పేర్కొన్నారు.

రోడ్లపై విరిగిపడుతున్న కొండచరియలు

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో బద్రీనాథ్ తదితర ప్రాంతాల్లో సహాయ చర్యలన్నీ దాదాపు నిలిచిపోయాయి. అయితే.. వైమానిక దళం చిన్నపాటి హెలికాప్టర్ల ద్వారా 500 మందిని రక్షించింది. వారిలో 120 మందిని బద్రీనాథ్ ప్రాంతం నుంచి, 327 మందిని హార్షిల్ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు బద్రీనాథ్ ఎగువ పర్వత ప్రాంతాల నుంచి అంతకుముందు రక్షించిన 500 మంది బాధితులను 44 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం ద్వారా జోషిమఠ్‌కు సురక్షితంగా తీసుకెళ్లారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ కిన్నౌర్ జిల్లాలోని సాంగ్లా, హామ్గో, రేకాంగ్ పేవ్ తదితర ప్రాంతాల నుంచి దాదాపు 100 మందిని హెలికాప్టర్ల ద్వారా రక్షించారు. చార్‌ధామ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ‘సాక్షి’ బృందం మంగళవారం దేవ్‌ప్రయాగ్‌కు పయనమవగా.. అక్కడ తాజాగా కుండపోత కురుస్తోందంటూ అధికారులు నిలిపివేశారు. దేవ్‌ప్రయాగ్, అగస్త్యముని, రుద్రప్రయాగ్, శ్రీనగర్, రుషికేష్ మార్గాలపై కొండచరియలు విరిగిపడటంతో ఆ రోడ్లన్నీ మూసుకుపోయాయి. చార్‌ధామ్ మార్గాల్లో వందలాది వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

మొదలుకాని అంత్యక్రియలు

కేదార్‌నాథ్‌లో మరో 127 మృతదేహాలతో పాటు మంగళవారం మొత్తం 142 మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య 825కి పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ మృతదేహాలకు సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమం మంగళవారం కూడా వర్షాల కారణంగా సాధ్యపడలేదు. అంత్యక్రియల కోసం ట్రక్కుల కొద్దీ దేవదారు కట్టెలు, నెయ్యిని ఇప్పటికే కేదార్‌నాథ్‌కు రవాణా చేశారు. కాగా, వరదల్లో గల్లంతైన వారిపై ఇక ఆశలు వదులుకోవాల్సిందేనని ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

About the Author