Published On: Tue, Jun 25th, 2013

ఉత్తరాఖండ్‌లో సైనికుల గుండె నిబ్బరం …..

Share This
Tags

కేదార్‌నాథ్ నుంచి ఇస్మాయిల్,సాక్షి టీవీ ప్రతినిధి: సైనికుల గుండె నిబ్బరానికి మంచుకొండలు సైతం తలవంచాయి. విరామమెరుగకుండా సాగించిన సహాయక చర్యల్లో భారత సైన్యం, వైమానిక దళంతో పాటు ఇండో- టిబెటన్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ), సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ) జవాన్లు దాదాపు పదివేల మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాఖండ్‌లో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో సైనికులు, పారా మిలటరీ బలగాలు సాగిస్తున్న సహాయక చర్యలను చార్‌ధామ్ యాత్రికులు కొనియాడుతున్నారు. ముందే వారిని రంగంలోకి దించినట్లయితే, పరిస్థితి మరింత బాగుండేదని అంటున్నారు.

కేదార్‌నాథ్, బదరీనాథ్, స్వర్ణప్రయాగ, గౌరీకుండ్, గుప్తకాశి, జోషిమఠ్, హేమకుండ్, గోవింద ఘాట్ తదితర ప్రాంతాల్లో చిక్కుకున్న యాత్రికులను జవాన్లు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంచెత్తిన వరదలు, విరిగిపడ్డ కొండచరియలు, కూకటివేళ్లతో నేలకొరిగిన మహావృక్షాలు అడుగుడుగునా అవరోధాలు కల్పించినా, వాటిని లెక్క చేయకుండా, వీలైనంత మందిని సురక్షితంగా కాపాడటమే లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు. కేదార్‌నాథ్ మార్గంలోని ప్రధాన కేంద్రాలైన గుప్తకాశి, స్వర్ణప్రయాగ, గౌరీకుండ్‌లలో సిక్కు రెజిమెంట్ బలగాలు పనిచేస్తున్నాయి. గౌరీకుండ్ నుంచి రాంబడా వరకు పారా మిలటరీ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సముద్ర మట్టానికి 11,657 అడుగుల ఎత్తున అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో జవాన్లు ప్రాణాలకు తెగించి పనిచేశారు.

ఇదే మార్గంలో కేదార్‌నాథ్ నుంచి వచ్చిన మూడువేల మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సువర్ణప్రయాగ నుంచి గౌరీకుండ్ వరకు దూరం మూడు కిలోమీటర్లే అయినా, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. నిటారుగా కొండవాలు ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న మందాకినీ నది ఒడ్డున కాలినడకన ముందుకు సాగాల్సిందే. ఒక్కోసారి కనీసం వందమీటర్ల ఎత్తున కొండలు ఎక్కాల్సిందే. అందుబాటులో ఉన్న రాడ్లు, కర్రలు, తాళ్లు వంటి వాటితోనే సైనికులు తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేశారు. నడవలేని వారిని భుజాలపై వేసుకుని, తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గౌరీకుండ్ ప్రాంతంలో కనీసం వంతెన వేయలేని పరిస్థితులు ఉండటంతో అక్కడే శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని, యాత్రికుల యోగక్షేమాలు చూసుకుంటున్నారు. ఉత్తరకాశీలో రోడ్ల పునరుద్ధరణలో బీఆర్‌ఓ జవాన్లు నిర్విరామంగా కృషి చేశారు. బదరీనాథ్ మార్గంలో ఉన్న హేమకుండ్, గోవిందఘాట్‌ల వద్ద చిక్కుకున్న ఐదువేల మందిని ఆర్మీ, పారా మిలటరీ బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. కాగా, పలుచోట్ల తరలించేందుకు వీలులేని బాధితుల మృతదేహాలను సైనికులు అన్నీ తామే అయి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

గుక్కెడు నీటి కోసం: సహాయక చర్యలు ప్రారంభించిన తొలిరోజున సైన్యానికి గడ్డు పరిస్థితి ఎదురైంది. ఆహార సామగ్రి పూర్తిస్థాయిలో చేరేలోగా బాధితుల ఆకలి తీర్చడం వారికి సవాలుగా మారింది. అప్పటికే తాగునీరు లేక అలమటిస్తున్న యాత్రికులు, సైనికులు ఇచ్చే గుక్కెడు నీటి కోసం ఎదురు చూశారు. ఆహార సామగ్రి వచ్చేలోగా సైనికులు తమ వద్దనున్న మంచినీటి బాటిళ్లతో దాదాపు 15 వేల మందికి గొంతు తడిపి తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు. గంటల తరబడి పనిచేసినా, సైనికులు మాత్రం ఆహారానికి దూరంగానే ఉన్నారు. బిస్కట్లు, చాక్లెట్లతోనే వారు తమ ఆకలి తీర్చుకుంటున్నారు. తొలి మూడు రోజుల్లోను ఇరవై నాలుగు గంటలూ నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టినా, నాలుగో రోజు నుంచి పగటి వేళల్లో సహాయక చర్యలు, రాత్రివేళ్లల్లో వ్యూహరచన సాగిస్తున్నారు.

ఇళ్ల పైకప్పులపైనే హెలిపాడ్లు…

కేదార్‌నాథ్ ప్రాంతంలో సైనిక, వైమానిక దళాలకు చెందిన మౌలిక వసతులన్నీ నాశనమయ్యాయి. దీంతో కొన్నిచోట్ల ఇళ్ల పైకప్పులనే తాత్కాలికంగా హెలిపాడ్లుగా మార్చారు. మరికొన్ని చోట్ల చెట్లను నరికి, నేలను చదును చేసి, హెలిపాడ్లు తయారు చేశారు. ఇంతటి రిస్క్ తీసుకుని ఇలాంటి చోట్ల ఎప్పుడూ హెలికాప్టర్లు దించలేదని ఆర్మీ అధికారులు ‘సాక్షి’తో చెప్పారు.

సెలవులొద్దు… పనిచేస్తాం…

భారత-చైనా సరిహద్దుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఐటీబీపీ సిబ్బందిలో పలువురు తమకు మంజూరైన సెలవులను రద్దు చేసుకుని మరీ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సిబ్బందిలో ముప్పయి శాతం మంది ఇదే ప్రాంతంలో పుట్టి, ఇక్కడే పెరిగిన వారు కావడంతో వారంతా ఈ విపత్తుపై భావోద్వేగాలతో స్పందించారని ఐటీబీపీ 8వ బెటాలియన్ అధికారి చౌహాన్ చెప్పారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఐటీబీపీ అసిస్టెంట్ కమాండంట్ జగ్మోహన్ విధుల్లో పాల్గొనేందుకు తనను అనుమతించాల్సిందిగా ఉన్నతాధికారులను కోరారు. వారు అందుకు నిరాకరించినా, జగ్మోహన్ మోటార్‌సైకిల్‌పై చమోలీ ప్రాంతానికి చేరుకుని, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ వరదల కారణంగా భారత సైన్యం గత మూలాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. చైనాతో యుద్ధం జరిగినప్పుడు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక మార్గాలను తిరిగి వినియోగంలోకి తెచ్చింది.

ఆర్మీ జవాన్లకు స్వచ్ఛంద సంస్థల సత్కారం

వరద బాధితులను ఆదుకోవడంలో అహరహం కృషి చేస్తున్న ఆర్మీ జవాన్లకు స్వచ్ఛంద సంస్థలు సోమవారం ఘనంగా సత్కరించాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన 18 స్వచ్ఛంద సంస్థ ‘మహాసంఘం’ ఏర్పాటు చేసిన సత్కారాన్ని ఆర్మీ తరఫున మెకానైజ్డ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ కమాండంట్ జ్యోతిదీప్ భటి స్వీకరించారు. బాధితులను ఆదుకోవడంలో ఆర్మీ, పారామిలటరీ జవాన్ల కృషి నిరుపమానమైనదని ‘మహాసంఘం’ కన్వీనర్ శ్యామ్ ఆసవా కొనియాడారు. ఇదిలా ఉండగా, ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు అరకొరగా సాగుతున్నాయంటూ వస్తున్న విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తోసిపుచ్చారు. ప్రకృతి విపత్తులను నివారించలేమని, అయితే, విపత్తు ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోందని అన్నారు. సహాయక చర్యల్లో జవాన్ల కృషిని తక్కువగా అంచనా వేయలేమని ఆయన అన్నారు.

About the Author