Published On: Tue, Jun 25th, 2013

ఆ ప్రభుత్వాలకున్న బుద్ధి మన వారికేది?

Share This
Tags

ఒకవైపు ఎముకలు కొరికే చలి.. మరోవైపు తీవ్ర అనారోగ్యంతో సహకరించని శరీరం.. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో బతుకుతామో లేదో తెలియని దీనావస్థలో రాష్ట్రానికి చెందిన యాత్రికులు ఉత్తరాఖండ్‌లో నరకయాతన అనుభవిస్తున్నారు. వీరి యోగక్షేమాలు కనుక్కునేవారుగానీ, ధైర్యం చెప్పేవారుగానీ లేకపోవడంతో విలవిల్లాడిపోతున్నారు.

హైదరాబాద్‌కు చెందిన టి.సుబ్బారావు, జానకీదేవి, వీరి కుమార్తె జయలక్ష్మి, అల్లుడు పురుషోత్తం, మనుమడు హరీష్ ఈ నెల 6న చార్‌ధామ్ యాత్రకు వెళ్లారు. వీరు 16వ తేదీ సాయంత్రం బద్రీనాథ్ చేరుకోగా.. ఆ రోజే జలప్రళయం సంభవించడంతో వారం రోజులు అక్కడే చిక్కుకుపోయారు. సోమవారం నాటికి వీరిలో ముగ్గురు అనారోగ్యం పాలయ్యారు. స్థానిక వైద్య బృందం చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఈ బృందం ‘సాక్షి’కి ఫోన్‌లో తమ బాధలు చెప్పుకుని.. రాష్ట్ర సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లో-బీపీతో బాధపడుతున్న జయలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘మేం ఉన్న ప్రాంతంలోనే ఒడిశా, అసోంలకు చెందిన వారూ చిక్కుకున్నారు. వారి కోసం ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక వైద్య బృందాల్ని పంపాయి. ఆ రాష్ట్రం నుంచి బయలుదేరి వెళ్లిన యాత్రికుల పేర్లు, వారు చిక్కుకున్న ప్రాంతాలతో సవివరంగా జాబితా రూపొందించి రంగంలోకి దింపారు.

అయితే వారు తమ రాష్ట్రాలకు చెందిన వారికే వైద్యం అందిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అయితే ఆ రాష్ట్రం వారి కోసం హెలికాఫ్టర్లనే పంపింది. అన్ని రాష్ట్రాలూ స్పందిస్తున్నా.. మన ప్రభుత్వానికి మాత్రం ఆ బుద్ధి లేదు. కొందరు నేతల్ని పంపి హడావుడి చేయడం తప్ప.. అవసరమైన ఏర్పాట్లేవీ చేయట్లేదు. అసలు ముఖ్యమంత్రి ఉన్నారా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. ఇక్కడి అధికారులకు మా ఆరోగ్య పరిస్థితిని వివరించి త్వరగా బయటకు తరలించమని కోరాం. అవేమీ పట్టించుకోని వారు ఫ్రీగా ఫుడ్, బెడ్ దొరుకుతోందిగా ఇంకా ఎందుకు తొందర? అని హీనంగా మాట్లాడారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి దీనస్థితిని ‘సాక్షి’ జోషిమఠ్‌లోని తాత్కాలిక ఎయిర్‌బేస్‌లో ఉన్న ఆర్మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వాతావరణం బాగోని కారణంగా సోమవారం రెస్క్యూ ఆపరేషన్ జరగలేదని, మంగళవారం వాతావరణం అనుకూలిస్తే అనారోగ్యంతో ఉన్న వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చి తరలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

మన ప్రభుత్వం చేస్తోంది సున్నా

‘మా వాళ్లు 20 మంది చార్‌ధామ్ యాత్రకు వె ళితే అందులో 11 మంది జాడ ఇంతవరకు తెలియదు. అధికారుల మాటలు నమ్మలేక మేమే వెతికేందుకు హైదరాబాద్ నుంచి వచ్చాం. హరిద్వార్, డెహ్రాడూన్, రిషికేష్ అంతటా వెతికినా మావాళ్ల జాడ లేదు. సమాచారం కోసం మన ప్రభుత్వ అధికారులను సంప్రదిద్దామంటే వారి జాడలేదు. అధికారులు చెబుతున్నట్టు అక్కడ మన తెలుగువాళ్లకు అందుతున్న సాయం సున్నా. మిగతా రాష్ట్రాల వాళ్లు క్యాంపులు పెట్టి, ప్రత్యేక బస్సులు, విమానాల్లో జనాన్ని పంపుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. అదే ఏపీ భవన్‌లో ఉన్న అధికారులకు మా వాళ్లు బతికే ఉన్నారని చెప్పినా పట్టించుకోలేదు’ అని హైదరాబాద్‌కు చెందిన మహేందర్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

About the Author