Published On: Tue, Mar 12th, 2013

‘ఆస్ట్రేలియా’ జట్టులో సంక్షోభం

Share This
Tags

క్రికెట్‌లో ఇదో పెద్ద సంచలనం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ ఆదేశాలు పాటించనందుకు ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్ ఏకంగా నలుగురు క్రికెటర్లపై వేటు వేసింది. వైస్‌కెప్టెన్ వాట్సన్‌తో పాటు ప్యాటిన్సన్, జాన్సన్, ఖాజాలను మూడో టెస్టు ఆడేందుకు వీల్లేదని ఆదేశించింది. ఆ వెంటనే వాట్సన్ స్వదేశానికి బయల్దేరాడు. క్రమశిక్షణ చర్యలే అని కోచ్ చెబుతున్నా… అంతర్గతంగా జట్టులో ఏదో జరిగింది. కెప్టెన్ క్లార్క్‌తో వీళ్లకు పొసగనందునే వేటు పడింద ని వినిపిస్తోంది.

మొహాలీ: కీలకమైన మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టులో సంక్షోభం నెలకొంది. తమ ఆదేశాలను పాటించనందుకు నలుగురు కీలక ఆటగాళ్లపై జట్టు మేనేజ్‌మెంట్ వేటు వేసింది. వైస్ కెప్టెన్ షేన్ వాట్సన్, పేసర్లు జేమ్స్ ప్యాటిన్సన్, మిషెల్ జాన్సన్, బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజాలపై క్రమశిక్షణారాహిత్యం కింద చర్యలు తీసుకుంది. భారత్‌తో జరగబోయే చివరి రెండు టెస్టులో వ్యక్తిగత ప్రదర్శనతో పాటు జట్టు పుంజుకునేందుకు అవసరమైన సలహాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ గత మంగళవారం ఆటగాళ్లను కోరింది.

అయితే నిర్దేశిత గడువు శనివారంలోగా ఈ నలుగురు ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించలేకపోవడంతో వేటు వేసినట్లు సోమవారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో కోచ్ మికీ ఆర్థర్ తెలిపారు. ‘హైదరాబాద్ ఓటమి తర్వాత జట్టు మొత్తం నిరాశకు గురైంది. సిరీస్‌లో పుంజుకోవడానికి అనేక మార్గాలు వెతుకుతున్నాం. జట్టుగా మా పరిస్థితి ఎంటో తెలుసు. రాబోయే రెండు మ్యాచ్‌ల్లో సమష్టిగా రాణించడంపై చర్చిస్తున్నాం.

అయితే జట్టు పుంజుకునే మార్గాలపై వ్యక్తిగతంగా తమ అభిప్రాయాలను నివేదించాలని ఆటగాళ్లను కోరాం. ప్రతి ఒక్కరి నుంచి సాంకేతికంగా, మానసికంగా మూడు పాయింట్లు చెప్పాలని ఆదేశించాం. కానీ పై నలుగురు ఆటగాళ్లు తమ నివేదికలను ఇవ్వడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో జట్టు క్రమశిక్షణను కొనసాగించడం ప్రధానం కాబట్టి వేటు అనివార్యమైంది’ అని ఆర్థర్ వివరించారు. ఆటగాళ్ల ప్రవర్తన తమ అంచనాలకు అనుగుణంగా లేకపోతే జట్టును ప్రపంచ స్థాయికి ఎలా తీసుకెళ్లగలమని కోచ్ ప్రశ్నించారు.

వైఖరి, ప్రవర్తన, శ్రమించేతత్వం, సంస్కృతిని గౌరవించే ఆటగాళ్లు ఉన్న జట్టే ప్రపంచ స్థాయిలో ఉంటుందన్నాడు. ఈ నలుగురు క్రికెటర్లు తమ అంచనాలను అందుకోలేదు కాబట్టి మూడో టెస్టుకు వీళ్లు అందుబాటులో ఉండరని ఆర్థర్ స్పష్టం చేశారు. ‘ఈ సంఘటన చాలా చిన్నదే కావచ్చు. కానీ జట్టు సమష్టితత్వం దెబ్బతినకుండా కాపాడాలి. కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని క్లార్క్ కూడా భావించాడు.

ఈ మూడు రోజులు ప్రతి ఒక్కరం తీవ్రంగా శ్రమించాలి. మ్యాచ్ గెలవడంపైనే నేను, క్లార్క్ దృష్టిపెట్టాం. కానీ కొంత మంది ఆటగాళ్లు తేలికగా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్లను దారిలోకి తెచ్చేందుకు మేం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం’ అని ఆర్థర్ వ్యాఖ్యానించారు. స్టార్ ఆటగాడు వాట్సన్‌ను తప్పించడం చాలా కఠినమైన నిర్ణయమని ఆర్థర్ అన్నారు.

About the Author