Published On: Thu, Mar 21st, 2013

ఆసియా టోర్నీ నుంచి వైదొలిగిన సైనా

Share This
Tags

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వచ్చే నెలలో జరిగే ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ) పోటీల్లో పాల్గొనడంలేదు. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరిగే ఈ పోటీలకు చైనీస్ తైపీ ఆతిథ్యం ఇవ్వనుంది. 2010లో భారత్‌లో జరిగిన ఈ పోటీల్లో కాంస్యం సాధించిన సైనా 2011లో మాత్రం బరిలోకి దిగలేదు. గత ఏడాది మాత్రం రెండో రౌండ్‌లో ఓటమి పాలైంది. ఇటీవల ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో, స్విస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోనే ఓడిపోయిన సైనా… ఏప్రిల్ 23 నుంచి 28 వరకు న్యూఢిల్లీలో జరిగే ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌కు కావాల్సినంత ప్రాక్టీస్ లభించాలనే ఉద్దేశంతో ఆసియా టోర్నీ నుంచి వైదొలిగినట్లు సమాచారం. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీల్లో వివిధ దేశాల తరఫున పాల్గొనే క్రీడాకారుల జాబితాను మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. భారత్ నుంచి మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పి.వి.సింధు… జాతీయ చాంపియన్ సయాలీ గోఖలే బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్… జాతీయ మాజీ చాంపియన్ సౌరభ్ వర్మ పోటీపడుతున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో రాష్ట్ర క్రీడాకారులు కోనా తరుణ్, సుమీత్ రెడ్డి వేర్వేరు భాగస్వాములతో… మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి తన భాగస్వామి అపర్ణ బాలన్‌తో… మిక్స్‌డ్ డబుల్స్‌లో దిజుతో గుత్తా జ్వాల బరిలోకి దిగుతున్నారు.

About the Author