Published On: Sun, Jul 28th, 2013

ఆచితూచి కాంగ్రెస్ అడుగులు

Share This
Tags

రాష్ట్ర విభజన దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయాన్ని ప్రకటించే క్రమంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంతో పార్టీకి ఒనగూరే లాభనష్టాలను మళ్లీమళ్లీ బేరీజు వేసుకుంటూ ముందుకు కదులుతోంది. శుక్రవారం నాటి కాంగ్రెస్ కోర్ కమిటీలో నిర్ణయం తీసేసుకున్నప్పటికీ.. దానిపై ఎలాంటి ప్రకటనా చేయకపోవటానికి ఇదే కారణంగా చెప్తున్నారు. తెలంగాణ అంశంపై చర్చల ప్రక్రియ ముగిసిందని.. ఇక కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ వెల్లడించటం తెలిసిందే. పార్టీపరంగా అంతిమ నిర్ణయం తీసుకోవటానికి ముందే యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్యపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయపడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు మూడున్నరేళ్ల కిందట అప్పటి హోంమంత్రి చిదంబరం ద్వారా ప్రకటింపజేసిన అధిష్టానం.. దానిపై యూపీఏ భాగస్వామ్యపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవటానికి ముందుగానే మిత్రపక్షాల నేతలతో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నట్లు ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు శనివారం ఇష్టాగోష్టి సంభాషణల్లో వెల్లడించారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని.. అయితే దానిని ప్రకటించటానికి తమకు ఎలాంటి తొందరా లేదని కాంగ్రెస్ కోర్ కమిటీలోని కీలక సభ్యుడొకరు శనివారం మీడియాతో వ్యాఖ్యానించటం ఈ సందర్భంగా గమనార్హం. తెలంగాణ నిర్ణయాన్ని, ప్రక్రియను రాబోయే సార్వత్రిక ఎన్నికల వరకూ పొడిగించే అవకాశముందని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు.

‘తెలంగాణ’తో ఆశించిన ఫలితాలు వస్తాయా?

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచీ ఒత్తిళ్లు తీవ్రమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ప్రతి అంశాన్నీ మరోసారి పునఃపరిశీలిస్తోంది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే పక్షంలో పార్టీలో టీఆర్‌ఎస్ విలీనం సాధ్యాసాధ్యాలు, దాని పరిణామాలు, లాభనష్టాలను బేరీజువేసే పనిలో నిమగ్నమయింది. ఈ రెండు అంశాలపై ఏకాభిప్రాయం కానీ, స్పష్టత కానీ వచ్చే వరకూ విభజన ప్రక్రియలో జాప్యం తప్పదని ఉన్నతస్థాయి వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చని.. పార్టీ సీనియర్ నాయకుడొకరు ‘క్షేత్రస్థాయి వాస్తవాల’ ఆధారంగా రూపొందించినట్లు చెప్తున్న ఒక స్వతంత్ర నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి సమర్పించిన ఈ నివేదికలో.. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే పార్టీకి మంచి ఫలితాలు వస్తాయనే వాదన కూడా ఊహాజనితమే కావచ్చని అంచనా వేసినట్లు తెలిసింది. ‘రెండు పార్టీలూ తెలంగాణ ప్రాంతమంతటా సమానంగా విస్తరించి ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ రెండు పార్టీలకూ నాయకులు ఉన్నారు. టీఆర్‌ఎస్ విలీనం తర్వాత.. ఒకచోట ఒకరికి టికెట్ ఇస్తే రెండో నాయకుడు తిరుగుబాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలా జరిగితే పార్టీకి ఎదురు దెబ్బే’ అని ఆ నివేదికలో విశ్లేషించినట్లు చెప్తున్నారు. అలాగే.. టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం కాకపోతే జరిగే బహుముఖ పోటీలో గెలుపు ఎవరిదో ఎవరైనా ఊహించగలరు. టీఆర్‌ఎస్ – బీజేపీలు పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. మైనారిటీలు ఎలా ప్రతిస్పందిస్తారనేది ఊహకు అందనిది’ అని ఆ నివేదికలో పేర్కొన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం మరోసారి పరిస్థితులను అంచనా వేయటంలో తలమునకలైనట్లు చెప్తున్నారు.

హైదరాబాద్‌పై మల్లగుల్లాలు: సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆమె నిర్దేశంతోనే చర్చల ప్రక్రియ కొనసాగుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రాన్ని విభజించినప్పటికీ హైదరాబాద్ విషయంలో తెలివైన నిర్ణయం తీసుకోవాలని.. పూర్తిగా నష్టపోకుండా ఉండేలా జాగ్రత్తలు వహించాలని పలువురు నేతలు సోనియాకు సూచిస్తున్నట్లు సమాచారం. అన్ని వైపుల వారినీ సంతృప్తిపరిచేలా నిర్ణయం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరుతున్నట్లు చెప్తున్నారు.

కేంద్రానికి గూర్ఖా, బోడో ఉద్యమాల వేడి: మరోవైపు.. తెలంగాణపై సానుకూల నిర్ణయ సంకేతాల నేపథ్యంలో గూర్ఖాలాండ్, బోడోలాండ్ ఉద్యమాల నుంచి కేంద్ర హోంశాఖపై ఒత్తిడి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే.. అది ఈ రెండు ప్రాంతాల్లోనూ హింసాత్మక ఉద్యమాలకు దారితీసే అవకాశముందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే పార్టీ అధినేత్రితో పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా సాగుతున్న ఉద్యమమైతే.. పశ్చిమబెంగాల్‌లో గూర్ఖాలాండ్, అస్సాంలో బోడోలాండ్ ఉద్యమాలకు సాయుధ సంస్థలు నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో షిండే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు. దీంతో ఆ అంశాలపైనా నిర్దిష్ట అంచనాకు రావాల్సిన అవసరముంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

About the Author