అమెరికా పర్యటనకు వెళ్లనున్న రాజ్ నాథ్
ఆఫ్ఘానిస్థాన్ పై తమ పార్టీ అనుసరించనున్న విధానాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ వెల్లడించనున్నారు. అమెరికా పాలకులకు, మేధావులకు, విధాన నిర్ణేతలకు నేరుగా తెలపనున్నారు. రాజ్ నాథ్ సింగ్ ఈనెల 22 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ లోని క్యాపిటల్ హిల్ లో 23న సదస్సులో ఆయన పాల్గొంటారు. భారత్, ఆఫ్ఘానిస్థాన్ మరియు ప్రాంతీయ భద్రత అనే అంశంపై ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు.
ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్(ఎఫ్ఐఐడీఎస్-యూఎస్), అమెరికా-భారత్ రాజకీయ క్రియాశీల సంఘం సంయుక్తంగా ఈ సదస్సు ఏర్పాటు చేశాయి. వాషింగ్టన్ లోని చారిత్రక రేబర్న్ హౌస్ భవనంలో ఈ సదస్సు జరగనుంది. ఆఫ్ఘానిస్థాన్ లో భద్రతను దెబ్బతిస్తున్న అంశాలు, స్థిరత్వం, అభివృద్ధి అంశాలపై చర్చించే లక్ష్యంతో ఈ సదస్సు ఏర్పాటు చేసినట్టు ఎఫ్ఐఐడీఎస్ వెల్లడించింది.
రాజ్ నాథ్ సింగ్ తో పాటు విదేశాంగ మాజీ కార్యదర్శి కన్వాల్ సిబల్, ఆఫ్ఘాన్ నిఘా విభాగం మాజీ అధిపతి హమరుల్లా సాలేహ్ తదితరులు కూడా ఈ సదస్సులో ప్రసగించనున్నారు.