Published On: Tue, Mar 26th, 2013

అంతా సచిన్ ఇష్టం

Share This
Tags

సచిన్ లాంటి క్రికెటర్‌ను ఫామ్ లేదని వైదొలగమనడం కరెక్ట్ కాదు… ఒక్కో సిరీస్‌ను లెక్కేస్తూ రిటైర్ కావాలనడం న్యాయం కాదు… అసలు బయట కూర్చుని మాస్టర్ రిటైర్మెంట్ గురించి మాట్లాడం పద్ధతి కాదు… ఇవన్నీ సచిన్ టెండూల్కర్ అభిమానుల మాటలు కాదు. సాక్షాత్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ వ్యాఖ్యలు.

గతంలో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ , సౌరవ్ గంగూలీల రిటైర్మెంట్ విషయంలో బోర్డు ప్రమేయం ఉందని… రిటైరవ్వాల్సిందిగా బోర్డే సూచించిందనే వార్తల నేపథ్యంలో… సచిన్ రిటైర్మెంట్ విషయంలో మాత్రం బోర్డు ప్రమేయం ఏ మాత్రం ఉండబోదని శ్రీనివాసన్ పరోక్షంగా తేల్చేశారు. ఎప్పుడు రిటైరవ్వాలో సచిన్ ఇష్టమేనని చెప్పేశారు. ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో శ్రీనివాసన్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే…

మనమెవరం..: సచిన్ గురించి మాట్లాడటానికి మనం ఎవ్వరం సరిపోం. భారత్ నుంచి వచ్చిన అత్యంత గొప్ప ఆటగాడు సచిన్. దశాబ్దాల తరబడి భారత్‌కు అనేక విజయాలు అందించాడు. ఇప్పుడు ఒక్కో సిరీస్‌లో ప్రదర్శన తీసుకుని రిటైర్మెంట్ గురించి ఎలా మాట్లాడతారు. బయట కూర్చుని సచిన్ ఎప్పుడు రిటైరవ్వాలో చెప్పడం కరెక్ట్ కాదు. ఎప్పుడు ఏం చేయాలో మాస్టర్‌కు తెలుసు.

నేను సెలక్టర్‌ను కాదు: గంభీర్, సెహ్వాగ్‌లను ఫామ్ లో లేరని తొలగించారు. కానీ సచిన్‌ను తొలగిం చడం లేదు..? అనే ప్రశ్న నన్ను అడగాల్సింది కాదు. అది సెలక్టర్ల పని. వారిని అడిగాలి. సెహ్వాగ్, గంభీర్ మళ్లీ జట్టులోకి ఎప్పుడొస్తారో నాకు తెలియదు. సెలక్టర్లను ఈ విషయం అడగండి. అందుబాటులో ఉన్న ఉత్తమ ఆటగాళ్లనే ఎంపిక చేస్తారు.

నమ్మకం నిజమైంది: ఆస్ట్రేలియాపై భారత్ జట్టు అద్భుతంగా ఆడింది. మాకు మొదట్నించీ కుర్రాళ్లపై నమ్మకం ఉంది. జట్టు సంధికాలంలో ఉన్న సమయంలో కొన్ని ఓటములు ఎదురవుతాయి. కానీ ఒకసారి కుదురుకుంటే మళ్లీ విజయాల బాట పడతారని మాకు తెలుసు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో చాలా సందర్భాల్లో అదృష్టం కలిసి రాలేదు. కానీ ఆ సిరీస్‌ను మరచిపోయి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలపై అద్భుతమైన విజయాలు సాధించారు. జట్టుపై, ధోనిపై పెట్టుకున్న నా నమ్మకం నిజమైంది.

కుర్రాళ్లు బాగా ఆడారు: భారత కుర్రాళ్లలో సత్తా ఉందని మురళీ విజయ్, శిఖర్ ధావన్, పుజారా నిరూపించారు. కొంతమంది పెద్ద ఆటగాళ్లు లేకపోయినా వాళ్ల స్థానాలను భర్తీ చేయగలిగారు.
ధోని విషయంలో..: ధోని అద్భుతమైన ఆటగాడు, నాయకుడు. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించాడు. ధోని విషయంలో నా నమ్మకం ఎప్పుడూ వమ్ము కాలేదు.

ఎప్పుడో సెలక్షన్ కమిటీ సమావేశంలో జరిగిన అంశాలు (ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన తర్వాత కెప్టెన్‌ను తొలగించాలన్న సెలక్టర్ల నిర్ణయాన్ని శ్రీనివాసన్ తోసి పుచ్చారు) ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. భారత జట్టు ఎంపికను ఆమోదించాల్సింది అధ్యక్షుడే అని బీసీసీఐ రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. నాణ్యమైన జట్టు కొన్ని సందర్భాల్లో ఓడిపోయినా, బోర్డు నుంచి మద్దతు ఉండాలి.

ఐపీఎల్ మ్యాచ్‌లపై: భారత్‌లో అని రాష్ట్రాల్లోనూ క్రికెట్ ఆడటం సురక్షితమే. శ్రీలంక క్రికెటర్లు చెన్నైలో ఆడటం గురించి తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడాం. పటిష్టమైన భద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

నివాసంపై సీబీఐ దాడి: మా ఇంటిలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో నేను దేశంలో లేను. అయితే ఇది వేరే కేసుకు సంబంధించిన అంశం. మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇండియా సిమెంట్స్ (శ్రీనివాసన్ కంపెనీ) అన్ని పన్నులూ చెల్లించింది. మేం ఎప్పుడూ ఎక్కడా తప్పు చేయలేదు.

About the Author